Fashion

మీ మెదడు అదుపులో ఉంటోందా?

మీ మెదడు అదుపులో ఉంటోందా?

పొద్దున్నే లేవడం… స్నానం చేయడం.. తినడం.. ఆఫీసుకి వెళ్లడం.. సాయంత్రం ఇంటికి రావడం.. తినడం.. పడుకోవడం… మొన్నటి వరకు ఇదే మన నిత్య జీవితం. ఆడవాళ్లకైతే అదనంగా… వంట, పిల్లలు! ఎన్నో ఏళ్లుగా ఇవన్నీ మనకు ‘కండీషనైజ్‌’ అయిపోయాయి. అలవాటైన ఈ పనులు మనకు ఒక రకమైన సౌకర్యాన్ని ఇస్తాయి. ఇందుకు భిన్నంగానో, వ్యతిరేకంగానో పనిచేయాలంటే మెదడు ఓ పట్టాన ఒప్పుకోదు. ఐవాన్‌ పావ్‌లోవ్‌ థియరీ చెప్పేదీ అదే. గణగణా గంట కొట్టడం.. కుక్క ముందు ఆహారం పెట్టడం.. ఈ రెండు పనుల్నీ ఒకేసారి చేయడం వల్ల కొంతకాలానికి గంట వినిపించకపోతే కుక్క ఆహారాన్ని ముట్టుకోదు. రోజూ మనం ఆటోమేటిగ్గా చేసుకునే పనులన్నీ కూడా ఈ సిద్ధాంతం కిందకే వస్తాయి. ఇప్పుడా నియంత్రిత చర్యలన్నీ ‘లాక్‌డౌన్‌’ అయిపోయాయి. అంటే, గంట ఆగింది!

‘జీవితం రొటీన్‌ అయిపోతున్నది. థ్రిల్‌ లేకుండా పోతున్నది’ … నిన్నమొన్నటి వరకూ ఇదీ మన సణుగుడు. కాని నెలరోజుల నుంచీ ఆ ఉరుకుల పరుగుల జీవనశైలి లేనేలేదు. ఆఫీసు లేదు, డ్రైవింగ్‌ లేదు, మీటింగ్‌లు లేవు… మనకు అలవాటైన, సౌకర్యవంతమైన పనులేవీ లేవు. కాబట్టే, చేతినిండా సమయం ఉన్నా, ఆఫీసు ఒత్తిడి లేకపోయినా… ఏదో తెలియని ఇబ్బంది. దీన్నే ‘పాండెమిక్‌ బ్రెయిన్‌’గా తీర్మానించారు న్యూరోసైంటిస్టులు.
సమస్య-పరిష్కారం

ఇప్పుడొక చిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రస్తుతం, మన మెదడు స్థితిని ‘పాండెమిక్‌ బ్రెయిన్‌’గా నిర్ధారిస్తున్నారు న్యూరోసైంటిస్టులు. డీన్‌ బర్నెట్‌ అనే న్యూరోసైంటిస్టు కరోనా సంక్షోభానికి మన మెదడు ఏ రకంగా స్పందిస్తున్నదో విశ్లేషించారు. ఏదైనా తీవ్ర సమస్య వచ్చినప్పుడు, దాన్ని ఎదుర్కోవడానికి మెదడు రకరకాల పరిష్కారాలను వెతుకుతుంది. ఉదాహరణకు, లాక్‌డౌన్‌ అయితే సరుకులే దొరకవని భయపడిపోయి అవసరమున్నా, లేకపోయినా కిలోలకొద్దీ తెచ్చి పడేస్తుంటాం. ఇలా చేయడం ద్వారా, తన ముందుకు వచ్చిన ఓ పెద్ద సమస్యను సునాయాసంగా కంట్రోల్‌ చేయగలిగాననీ, సమస్యపై విజయం సాధించగలిగాననీ మెదడు తృప్తిపడుతుంది. అదేవిధంగా, పెద్దపెద్ద సమస్యలకు చిన్నచిన్న పరిష్కారాలు పనిచేయవని బ్రెయిన్‌ బలంగా భావిస్తుంది. అందుకని వాటిని ఓ పట్టాన పాటించదు. చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం తదితర చిట్కాలతో విశ్వమారిని తరిమికొట్టవచ్చని తెలిసినా, మన బ్రెయిన్‌ అందుకు సిద్ధంగా ఉండదు.
ఇదీ ధ్యాన స్థితే!

విపస్సన ధ్యాన శిబిరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది బౌద్ధానికి సంబంధించిన ఓ ధ్యాన విధానం. సాధకుల్ని తీసుకెళ్లి శివార్లలోని ఏ గెస్ట్‌హౌస్‌లోనో వదిలిపెడతారు. ఇది కూడా క్వారంటైన్‌ లాగానే, పద్నాలుగు రోజుల కార్యక్రమం. అక్కడ ఉన్నన్నాళ్లూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. సెల్‌ఫోన్లు కూడా అనుమతించరు. టీవీలు అసలే ఉండవు. లాక్‌డౌన్‌ పరిస్థితి విపస్సన ధ్యాన శిబిరాన్ని తలపిస్తుంది. సాధకుడు, జనతా కర్ఫ్యూలో ఉన్న సామాన్యుడు… ఇద్దరి పరిస్థితీ దాదాపుగా ఒకటే. అక్కడ సాధకుడు… ధ్యానం చేయాలని కూర్చుంటే మనసు నిలువదు. ఆలోచనల వరద వచ్చిపడుతుంది. ఏకాగ్రత కుదరదు. ఇక్కడ కూడా సామాన్యుడు… దిక్కు తెలియక బిక్కమొహం వేస్తాడు. దీనికి కారణం… ఆలోచనలు, ఎడతెరిపిలేని ఆలోచనలు. ఒకదాని వెంట ఒకటి టీవీ సీరియల్‌ ఎపిసోడ్స్‌లా వచ్చేస్తుంటాయి. ఎరుకతో వ్యవహరించడం వల్ల ఆ ఆలోచనల ప్రవాహాన్ని ఆపవచ్చని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. అంటే, ఆలోచనలను గమనిస్తూ ఉండటమే మన పని. వాటిని కొనసాగించకూడదు, అలా అని, బలవంతంగా తుంచేయనూ కూడదు. ఏదో ఓ దశలో పువ్వు మీద వాలిన సీతాకోక చిలుకలా వాటంతట అవే ఎగిరిపోతాయి. మనసు మహా ప్రశాంతంగా మారుతుంది. ఇదే టెక్నిక్‌ను లాక్‌డౌన్‌ సమయానికి అన్వయించుకోవచ్చు.
‘కొరత’ భయం!

లాక్‌డౌన్‌లో చాలామంది బరువు పెరిగిపోతున్నారు. వ్యాయామం లేకపోవడం ఓ కారణం అయితే… మితభోజనాన్ని వదిలిపెట్టడం మరో కారణం. మొన్నటివరకు పని ఒత్తిడిలో ప్రశాంతంగా కూర్చుని తినడానికి కూడా టైం ఉండేది కాదు. కాని ఇప్పుడు కావాల్సినంత సమయం. రోజు కంటే ఓ రెండు ముద్దలు ఎక్కువే తినేస్తున్నాం. దీని వెనుక మన అన్‌కాన్షియస్‌ బ్రెయిన్‌ యాక్టివిటీ ఉంది. ఈ అత్యవసర పరిస్థితి కారణంగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందేమో అనే ఆలోచన మన లోలోపల గూడుకట్టుకుని ఉండటం. అలాంటి పరిస్థితే వస్తే కష్టం కాబట్టి, ఎక్కువ తినేయమని ఆదేశాలిస్తుంది మన మెదడు. బరువు తగ్గడానికి క్రాష్‌డైట్‌ చేసేవారి విషయంలోనూ మెదడు ఇలానే స్పందిస్తుంది. మెదడును మన అదుపులో ఉంచుకుంటే పనిమంతుడైన సేవకుడిలా మనం చెప్పిన పని చేస్తుంది. లేదంటే, తలతిక్క యజమానిలా మనల్ని ఆడిస్తుంది.
క్వారంటైన్‌లో ఉంటే…

రొటీన్‌కి భిన్నంగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు మెదడు, ఆ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే, కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలను మనం తిరస్కరిస్తాం. పాతజీవితం వైపే మొగ్గు చూపుతాం. ఏ వంకతో బయటికి వెళ్దామా అని చూస్తాం. అదే, ఊళ్లో కర్ఫ్యూ ఉన్నప్పుడు బయటకు వెళితే… పోలీసు లాఠీ దెబ్బలను భరించాల్సి ఉంటుంది. లేదంటే, అదే అదనుగా ఏ సంఘ విద్రోహ శక్తులో దాడి చేయవచ్చు. గత అనుభవాల ఆధారంగానో, ఎక్కడో విన్న సమాచారాన్ని బట్టో మెదడు ఆమేరకు ఓ నిర్ణయానికొచ్చి మనల్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో, గడపదాటే సాహసం చేయం. జనతా కర్ఫ్యూ అలా కాదే. మనకు గతానుభవాలు లేవు. వైరస్‌ సోకితే తప్ప ఆ అనుభవం మెదడుకు తెలియదు. కాబట్టే, క్వారంటైన్‌కు తరలించిన వ్యక్తులు 14 రోజుల పాటు బయటి ప్రపంచాన్ని చూడకుండా ఉండలేకపోతారు. మెదడు మొరాయించడమే దీనికి కారణం. అందుకే, చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. డాక్టర్లతో కొట్లాడతారు. పోలీసులపై దాడికి దిగుతారు. సంకల్పబలంతో మెదడును ఒప్పించగలిగిన వాళ్లు మాత్రం నిశ్చింతగా ఉంటారు.
‘ఫేక్‌’ స్పందనలు

మెదడు ఫ్రంటల్‌ లోబ్‌లో ఉండే కార్టెక్స్‌ అనే విభాగం మనం ముఖ్య నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది భావోద్వేగ కేంద్రమైన అమిగ్డలాకు అనుసంధానమై ఉంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో అమిగ్డలా ఎక్కువ పనిచేస్తుంది. దాంతో అతిజాగ్రత్తతో ఉంటాం. ఫేక్‌ న్యూస్‌కు తీవ్రంగా స్పందించడానికి ఇదే కారణం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘రెండో బ్రెయిన్‌ సిస్టమ్‌’ని వాడాలి. అంటే దీనికి లాజికల్‌ థింకింగ్‌ పెంచుకోవాలి. ఇందుకు ప్రయత్నపూర్వక ఆలోచన అవసరం. అంటే, మనకు మనమే సజెషన్స్‌ ఇచ్చుకోవాలి. ఇదే ‘సెల్ఫ్‌ హిప్నాసిస్‌’. ఆ సాధనతో మెదడు లాక్‌డౌన్‌ను తిరస్కరించకుండా చేయవచ్చు.