రవి గాంచనిది కవి గాంచును అంటారు. ఇవాళ ప్రభుత్వాలు ఊహించనది, ఒకప్పుడు రచయితలు ఊహించారు. సాహిత్యంలో సైన్సు ఫిక్షన్ ఒక భాగం. కొందరు రచయితలు తమ కాలం కంటే ముందుకెళ్లి మానవాళికి రాబోయే ప్రమాదాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘వైరస్’ల ప్రమాదఘంటికలు మోగించిన పుస్తకాలను కొన్నింటిని పరిశీలిద్దాం.
**(*గతంలో మానవాళి మీద చాలా వైరస్‌లే వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వైరస్ ప్రపంచాన్నే లాక్‌డౌన్ చేయించింది. దీని వ్యాప్తి తెలియకుండానే, అప్రయత్నంగానే జరుగుతుండటం ఒక కారణం. దీనికి ఇంకా మందు కనిపెట్టలేకపోవడం మరో కారణం. ఈ వ్యాధి సోకినవారు, సోకినవారి ద్వారా మరొకరికి సోకే సమయాలు కనిపెట్టలేకపోవడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. రచయితలు మనుషులకు వచ్చే సమస్యలను తమ కథాంశాలుగా చేసుకున్నట్టే ఈ ‘వైరస్’లను కూడా తమ కథాంశాలు చేసుకున్నారు.
వాటి కథాకమామీషు ఒకసారి చూద్దాం.
****నాన్ ఫిక్షన్
*వైరస్ చరిత్ర, శాస్త్ర సమాచారం, ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న మొదటి పుస్తకం ‘అండ్ ద బ్యాండ్ ప్లెయిడ్ ఆన్’. రచయిత రాండీ షిల్ట్స్. 1987లో మొదటిసారిగా ఎయిడ్స్ విజృంభణ మొదలైనప్పుడు, దానిని ప్రజలింకా జోక్ స్థాయిలో చూస్తున్నప్పుడు అమెరికా జర్నలిస్ట్ రాండీ ఆ వైరస్ గురించి ఈ పుస్తకంలో రాశాడు. ఇలాంటి వైరస్‌లు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు వాటిని ఎలా నిరోధించలేకపోతాయో చెప్పాడు.
*1854లో లండన్ జనాభాను బలి తీసుకున్న కలరా గురించి రచయిత స్టీవెన్ జాన్సన్ రాసిన పుస్తకం ‘ద ఘోస్ట్ మాప్’. కలరా మహమ్మారి తర్వాత సైన్స్ పరిశోధనల్లోనూ, నగర నగర నిర్మాణ శాస్త్రంలోనూ పెనుమార్పులు వచ్చాయి.
*ఎబోలా గురించి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ అది. దీని గురించి రచయిత రిచర్డ్ ప్రెస్టన్ ‘ద హాట్ జోన్’ అనే పుస్తకం రాశాడు. ఎబోలా వైరస్ పుట్టుక, వ్యాప్తిని హారర్ నవలలోలాగా వర్ణించాడు రచయిత. ఆఫ్రికా వర్షారణ్యాలలో ఆవిర్భవించి అనతికాలంలోనే దేశదేశాలకూ పాకిన వ్యాధి అది. ఎబోలా ఒక పీడకల. పునరావృతం కాదని చెప్పలేం.
*1918 నాటి ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి గురించి రచయిత్రి జినా కోలటా రాసిన పుస్తకం ‘ఫ్లూ’. ఈ ఫ్లూనే స్పానిష్ ఫ్లూ అని అంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వాళ్ల కన్నా రెట్టింపు జనాభాను ఈ ఫ్లూ కబళించింది. ఒక్క అమెరికాలోనే అయిదు లక్షల మంది మరణించారు. ఇది ప్రపంచాన్ని మరోసారి చుట్టి వస్తుందేమోనని శాస్త్రజ్ఞులు భయపడుతూనే ఉన్నారు అంటుంది అమెరికా పాత్రికేయురాలు కోలటా.
*గత అయిదు లక్షల ఏళ్లుగా మానవజాతిని శాసించిన మలేరియా గురించిన కథనం ‘ద ఫీవర్’. 2010లో వచ్చిన ఈ పుస్తకం పూర్తి పేరు ‘ద ఫీవర్: హౌ మలేరియా హాజ్ రూల్డ్ మేన్‌కైండ్ ఫర్ 5,00,000 ఇయర్స్’. రచయిత్రి సోనియా షా. మన జీవన విధాతగా దోమ ఎలా మారిందో ఈ పుస్తకం చెబుతుంది. సోనియా, భారతీయ మూలాలున్న అమెరికా పాత్రికేయురాలు.
*అమెరికా చరిత్రకారిణి బార్బరా టక్‌మాన్ ‘ప్లేగ్’ గురించి రాసిన 1978నాటి ‘ఎ డిస్టంట్ మిరర్: ద కలమిటిస్ ఫోర్‌టీన్త్ సెంచరీ’ ఫ్రతిష్టాత్మక పురస్కారం పొందిన శాస్త్ర గ్రంథం. 14వ శతాబ్దంలో యుద్ధం, మతోన్మాదం వంటి భౌతిక పరిస్థితులు ప్లేగు వ్యాపించడానికి ఎలా కారణమయ్యాయో ఈ పుస్తకం చెబుతంది.
*ఆటలమ్మ (స్మాల్‌పాక్స్) కూడా ఒక మహమ్మరి. 18వ శతాబ్దపు ఉత్తరార్థంలో ఉత్తర అమెరికాను గడగడలాడించిన ఆ వ్యాధి ఆ దేశ చరిత్రనే మార్చివేసింది. ఆటలమ్మ గురించి ఆ రోజుల్లో ఎన్నెన్ని కథలు ప్రచారంలో ఉండేవో. ఎలిజబెత్ ఎఫెన్ రాసిన ‘పాక్స్ అమెరికానా’ అద్భుతమైన కథనంతో పాఠకులను కట్టిపడేస్తుంది.
***ఫిక్షన్
కొందరికి నాన్‌ఫిక్షన్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ‘తప్పనిసరి తీరిక సమయం’ లో కథల లోకంలో విహరిద్దామనుకుంటే ‘వైరస్’ కథాంశంగా గల కొన్ని నవలలనైనా చదవండి.
*ఈ జాబితాలో మొదట చెప్పుకోవలసింది హోసె సారమాగో (నోబెల్ బహుమతి పొందిన పోర్చుగీస్ రచయిత) రాసిన 1995 నాటి నవల ‘బ్లైండ్‌నెస్’. కథాకాలం 1990. ఒక వ్యక్తి టాక్సీలోంచి దిగబోతూ అకస్మాత్తుగా అంధుడైపోతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్ కూడా అంధుడైపోతాడు. క్రమంగా అందరూ అంధులుగా మారిపోతుంటారు. ఇక్కడ అంధత్వం ఒక వైరస్ కావచ్చు, ఒక ప్రతీక కూడా కావచ్చు.
*ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామూ రాసిన ‘ద ప్లేగ్’ చాలామంది చదివే ఉంటారు. ఇరవయ్యవ శతాబ్దంలో మహమ్మారుల గురించి వచ్చిన అన్ని నవలలకూ ‘బైబిల్’ లాంటిదిది. అల్జీరియాలోని ఓరాన్‌లో వచ్చిన ప్లేగు గురించే రాసినప్పటికీ ‘ప్రజలలో ఫాసిస్టు భావజాలం దాగివున్నంత కాలం దీన్నెవరూ ఆపలేరు’ అంటాడు కామూ. ఈజిప్షియన్లు, గ్రీకులు, ఫిన్నిష్‌లు, హిందువులు– అందరూ మహమ్మారుల కోసం దేవతలను సృష్టించుకున్నారు. ‘పాండోరా’ తన వద్ద ఉన్న పెట్టె తెరిస్తే అందులో నుంచి బయటికొచ్చి మహమ్మారులు లోకమంతా వ్యాపించాయని కథ ఉంది కదా.
* 14వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రచయిత బొకాషియో రచించిన ‘ద డెకామెరాన్’ చాలా ప్రసిద్ధ నవల. ‘బ్లాక్‌డెత్’ అనబడే ప్లేగు నేపథ్యంలో పాత్రలు చెప్పుకునే జ్ఞాపకాలే ఈ నవల. వ్యంగ్యం హాస్యం కూడా ఉంటాయి గాని శృంగారానికే యివి ప్రసిద్ధి. అదే శతాబ్దానికి చెందిన ఇంగ్లిష్ కవి జాఫ్రీ ఛాసర్ రాసిన ‘ద కాంటర్‌బరీ టేల్స్’ నేపథ్యం కూడా ప్లేగే. ఈ కథల ద్వారా పాత్రలు ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటాయి.
*‘రాబిన్‌సన్ క్రూసో’ రచయిత డేనియల్ డెఫో 1722లో ‘ఎ జర్నల్ ఆఫ్ ద ప్లేగ్ ఇయర్’ ప్రచురించాడు. 1995లో లండన్‌లో వేలాదిమందిని బలిగొన్న బుబోనిక్ (ఈగల ద్వారా వ్యాపించే) ప్లేగ్‌ను అత్యంత వాస్తవికంగా చిత్రించిన కథనం యిది.
*ఇక 1985లో నోబెల్ గ్రహీత గేబ్రియల్ గార్షియా మార్కెజ్ ప్రచురించిన ‘లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా’ చాలా ప్రసిద్ధం. ఇది ఒక ప్రేమకథ. స్పానిష్‌లో ‘కలరా’ అన్న పదానికి ‘కోపం’ అనే అర్థం కూడా ఉంది. మహమ్మారులను కట్టడి చెయ్యడానికి డాక్టర్లున్నారు. మన లోపలి కోపం, ద్వేషాగ్నులను ప్రేమ మాత్రమే ఆపగలదు అంటాడు మార్కెజ్.
*2006లో వచ్చిన నవల ‘ద రోడ్’. రచయిత కార్మాక్ మెకార్తీ. మానవజాతి చివరిదశలో సమాజం, నాగరికత, వ్యక్తి సంబంధాలు ఎలా పతనమవుతాయో అత్యంత భయానకంగా చిత్రిస్తుంది. ఈ నవల ధైర్యం ఉన్న గుండెలకే. ఈ అమెరికన్ రచయిత దీనికిగానూ పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ నవల 2009లో ఇదేపేరుతో సినిమాగా వచ్చింది.
పుస్తక పఠనం మానసిక స్థయిర్యాన్ని పెంచుతుంది. అవగాహనను కల్పిస్తుంది. కనుక ఈ పుస్తకాలు చదవుదాం. లేదా నచ్చిన పుస్తకాలు చదువుదాం.
వైరస్ మీద కథలు రాశారు
Related tags :