Health

పెరుగుతో ఆ తృప్తి వేరు

పెరుగుతో ఆ తృప్తి వేరు

విస్తరిలో అన్నిరకాల ఆహార పదార్థాలున్నా చివర్లో పెరుగు లేకపోతే తిన్నట్టే ఉండదు. పెరుగు కేవలం తృప్తినే కాదు తక్షణ శక్తినీ ఇస్తుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలనూ అందిస్తుంది..
ఎండాకాలం రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పెరుగూ ఒకటి. వంద గ్రాముల పెరుగు 61 కెలొరీల శక్తినిస్తుంది. దీంట్లో 88 శాతం నీరుంటుంది. మాంసకృత్తులు 3.4 గ్రా., పిండిపదార్థాలు 4.7 గ్రాములు ఉంటాయి. ఇక కొవ్వులు.. మనం తోడుపెట్టే పాల రకాన్ని బట్టి ఉంటాయి.
**లాభాలు..
పెరుగులో బి6, బి12 విటమిన్లు, క్యాల్షియం ఉంటాయి. దీనిలోని ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా పేగులు విటమిన్లను శోషించుకోవడానికి సాయపడుతుంది. కడుపులో మంట (అసిడిటీ) లాంటి సమస్యలు రావు. చర్మం తాజాగా ఉంటుంది. మీగడలేని పెరుగు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. బలహీనంగా ఉన్నవారు తక్షణ శక్తి పొందాలంటే పెరుగులో కొంచెం పంచదార, అరటిపండు వేసి తీసుకోవచ్చు. పెరుగులో ఉసిరి పొడి కలిపి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు, విరేచనాలు అవుతున్నప్పుడు పెరుగులో పంచదార కలిపి తీసుకోవచ్చు. ఇది పేగు పూతను నియంత్రిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి పెరుగు చక్కటి ఎంపిక.
**జాగ్రత్తలు..
* పులిసిన, పాడైన పెరుగు తీసుకోవద్దు.
* ప్లాస్టిక్‌లో కాకుండా పింగాణి, మట్టికుండ/స్టీల్‌ గిన్నెలో తోడు పెట్టుకోవచ్చు.
* పెరుగును వేడి చేసి తీసుకోవద్దు.
అపోహలు…పెరుగు తింటే లావైపోతారు, వేడి చేస్తుంది, కఫం పెరుగుతుంది, ఆయాసం వస్తుంది, రాత్రుళ్లు తినొద్దు అంటారు. వీటిలో కొంత వాస్తవం ఉన్నా.. చక్కెర/ఉప్పు/తేనె/నెయ్యి/పెసరపప్పు లాంటి వాటితో కలిపి తీసుకుంటే ఏమీ కాదు.