WorldWonders

సిగ్గులేని చైనా….అన్నీ పచ్చి అబద్ధాలు

China's False Stats On Coronavirus Cases And Deaths

విస్తృత ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించింది. ‘మొదటి దశ వైరస్‌ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్‌ కేసులు ఉండేవని మా అంచనా’ అని ఫెంగ్‌వూ నేతృత్వంలోని హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అన్నారు. వైరస్‌ బాధితులను గణించే ప్రమాణాల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. దీనిని ప్రముఖ వైద్య జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురించారు.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) ప్రకారం బుధవారం నాటికి ఆ దేశంలో 82,789 కేసులు నమోదవ్వగా 4,632 మంది మరణించారు. అధ్యయనం ప్రకారం ఈ సంఖ్యకు నాలుగురెట్ల కేసులు అక్కడ ఉంటాయి. కొవిడ్‌-19 రోగుల సంఖ్య, వైరస్‌ ప్రభావాన్ని తగ్గించి చెబుతోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 17న వుహాన్‌లో మృతుల సంఖ్యను చైనా అదనంగా 50% శాతం పెంచింది. అంటే సవరించిన గణాంకాల ప్రకారం కేవలం వుహాన్‌లోనే 50,333 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ఈ నగరంలోనే పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే.

జనవరిలో అమలు చేసిన ‘కరోనా వైరస్‌ కేసుల డెఫినెషన్‌’ను ఉపయోగించి వుంటే చైనాలో ఫిబ్రవరి 20 నాటికి అధికారులు చెప్పిన 55,000 కాకుండా 2,32,000 ధ్రువీకరించిన కేసులు ఉండేవని తాజా అధ్యయనం తెలిపింది. విస్తృత ప్రమాణాలను వినియోగిస్తే ఇప్పుడు కేసులకు నాలుగు రెట్లు బాధితులు ఉండేవారని వెల్లడించింది.

గతేడాది డిసెంబర్లో కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడ్డాక వైరస్‌ కేసుల డెఫినెషన్‌ను చైనా ఏడు రకాలుగా వర్గీకరించింది. కేసుల్ని గుర్తించేందుకు, పరీక్షలు చేసేందుకు, చికిత్స అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా వైరస్‌ తీవ్రత, వ్యాప్తి ఎలా ఉందో సరైన అంచనా తెలుస్తుంది. ఫిబ్రవరి 5న ఐదో డెఫినెషన్‌ విడుదల చేసిన డ్రాగన్‌ దేశం లక్షణాల ఆధారంగా కేసుల్ని గుర్తించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో వారం రోజులకే ఈ డెఫినెషన్‌ను సవరిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది.

మహమ్మారి మొత్తం ఐదో డెఫినెషన్‌నే అమలు చేసుంటే నిర్ధారిత కేసులు సంఖ్య ఫిబ్రవరి 20కి 2,32,000కు చేరుకునేదని అధ్యయనం వివరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ నిర్ధారణకు టెస్టు కిట్లు ఎక్కువగా లేని దేశాలు వర్గీకరణ ప్రమాణాలు, మార్గదర్శకాల్లో క్లినికల్‌ డయాగ్నసిస్‌ను జత చేయాలని సూచించింది. అప్పుడే అసలైన కేసులు సంఖ్య తెలిసి సరైన చర్యలు తీసుకొనేందుకు ఆస్కారం లభిస్తుందని వెల్లడించింది. సాధారణంగా వైరస్‌ కేసుల డెఫినెషన్‌లో రోగి వ్యక్తిగత సమాచారం, ప్రాంతం, లక్షణాలు, చికిత్సా పద్ధతి వంటి అంశాలు ఉంటాయి.