కోవిడ్-19 ప్రభావం వల్ల విభిన్న దేశా ల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల నుంచి భారత్కు వచ్చే నిధులు ఈ ఏడాది 23 శాతం తగ్గి 6,400 కోట్ల డాలర్లకు (రూ.4.80 లక్షల కోట్లు) పడిపోవచ్చని అంచనా. గత ఏడాది భారత్కు వచ్చిన ప్రవాసుల నిధుల పరిమాణం 5.5 శాతం వృద్ధితో 8,300 కోట్ల (రూ.6.23 లక్షల కోట్లు) స్థాయిలో ఉంది. అలాగే అంతర్జాతీయంగా ప్రవాసుల నుంచి వచ్చే నిధుల పరిమాణం 20 శాతం వరకు క్షీణించవచ్చని అంచనా. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు పలు దేశాలు సుదీర్ఘ లాక్ డౌన్లు అమలుపరుస్తూ ఉండడం, ఫలితంగా పలువురు ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి వేతన నష్టం వంటి అంశాలన్నీ ప్రవాసుల నిధుల క్షీణతకు దోహదపడే అంశాలని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో తెలిపింది. వర్థమాన దేశాలకు ప్రవాసుల నుంచి వచ్చే నిధులే అత్యంత కీలకమైన ఆదాయ వనరు అని, కాని ఉపాధి కల్పిస్తున్న దేశాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా వారు నిధులు పంపే సామర్థ్యం గణనీయంగా దెబ్బ తింటుందని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ అన్నారు. ప్రవాసుల కుటుంబాలకు ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఇతర మౌలిక అవసరాలకు కూడా ఈ నిధులే మూలమని ఆయన పేర్కొన్నారు. ఈ రెమిటెన్స్ చానళ్లన్నీ సక్రమంగా పని చేసేందుకు, పేదల కుటుంబాలకు మౌలిక అవసరాలు దెబ్బ తినకుండా ఉండేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని డేవిడ్ చెప్పారు.
ఈసారి అమెరికా డాలర్లు ఎక్కువగా రాకపోవచ్చు

Related tags :