DailyDose

శరీరంలోకి UV కిరణాలు పంపిస్తే ఏమవుతుంది?-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Trump Asks Researchers What Happens If You Inject Disinfectants

* కరోనా వైరస్‌ను చంపేందుకు డిసిన్‌ఫెక్టంట్స్‌ను ఇవ్వడం, శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించడం సాధ్యమవుతుందేమో అధ్యయనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వెంటనే ఆయనిచ్చిన ‘ప్రమాదకర సలహా’ వినొద్దని వైద్య నిపుణులు ప్రజలను కోరారు. ట్రంప్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బిల్‌ బ్రియన్‌ నేతృత్వంలోని హోం ల్యాండ్‌ శాస్త్ర, సాంకేతిక శాఖ గురువారం ఓ శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది. సూర్యరశ్మి, గాలిలో ఆర్ధ్రత (హ్యుమిడిటి) ఉన్నప్పుడు కరోనా వైరస్‌ అత్యంత వేగంగా నశిస్తోందని వారు గుర్తించారు. ‘నేరుగా సూర్మరశ్మిలో ఈ వైరస్‌ అత్యంత వేగంగా చచ్చిపోతోంది. ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ కేవలం 30 సెకన్లలో వైరస్‌ను నాశనం చేస్తోంది’ అని ట్రంప్‌ సమక్షంలో బ్రియాన్‌ మీడియాకు వెల్లడించారు. ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ట్రంప్‌… కొవిడ్‌-19ను తగ్గించేందుకు మనిషి శరీరంలోకి డిసిన్‌ఫెక్టంట్స్‌ (సూక్ష్మక్రిమి, వైరస్‌ సంహారకాలు)ను ఎందుకు పంపించొద్దని ప్రశ్నించారు.

* తెలంగాణలో ఇవాళ కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇవాళ 29 మంది డిశ్చార్జ్‌ కాగా.. డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 291కి చేరింది. ప్రస్తుతం 663 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని ఈటల తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 983కి చేరింది.

* కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తోందని కేంద్రం వెల్లడించింది. కరోనా కేసులు రెట్టింపు అవుతున్న సమయం భారీగా పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు డబుల్‌ అవుతున్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్‌ విధించడం వల్లే ఇవాళ కేసుల సంఖ్య 23 వేలు దగ్గర ఉందని, లేకుంటే ఆ సంఖ్య ఈ పాటికే లక్ష దాటేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ఎంపవర్డ్‌ గ్రూప్‌-1 ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు, ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్లలో నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెలీమెడిసిన్ సేవలను మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని జగన్‌ ఆదేశించారు. కుటుంబంలో ఒకరికి పాసు ఇచ్చి, ఆ వ్యక్తి మాత్రమే సరకులు తీసుకొచ్చేలా చూడాలని సూచించారు.

* కరోనా వైరస్‌ను చంపేందుకు డిసిన్‌ఫెక్టంట్స్‌ను ఇవ్వడం, శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించడం సాధ్యమవుతుందేమో అధ్యయనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వెంటనే ఆయనిచ్చిన ‘ప్రమాదకర సలహా’ వినొద్దని వైద్య నిపుణులు ప్రజలను కోరారు. ట్రంప్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషంలో డిసిన్‌ఫెక్టంట్స్‌ వైరస్‌ను నాశనం చేసేస్తోంది. అంటే మనిషి శరీరంలోని దానిని పంపించేందుకు మార్గం ఉందా? లేదా వైరస్‌ను శుభ్రం చేయగలమా? ఎందుకంటే ఆ వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉండటం మీరు చూశారు. అది చాలా తీవ్రంగా ఉంటోంది. అందుకే ఓ సారి పరీక్షిస్తే ఆసక్తికరంగా ఉంటుంది’ అని ట్రంప్‌ అన్నారు.

* కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో రసాయనిక టన్నెళ్లను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది రొనాల్డ్‌ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మరోమారు విచారణ జరిపింది. రసాయన టన్నెళ్లను ప్రోత్సహించవద్దంటూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సిఫార్సును ఏజీ హైకోర్టుకు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలో అలాంటి టన్నెళ్లను ఏర్పాటు చేయలేమని ఏజీ తెలిపారు. టన్నెళ్ల ద్వారా వ్యక్తులపై సోడియం హైపోక్లోరైట్‌ చల్లడం మంచిది కాదని కేంద్ర ఆరోగ్యశాఖ సిఫార్సులో పేర్కొందన్నారు.

* కరోనా గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా కొత్త కేసులు వస్తున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ‘‘గత 24 గంటల్లో ప్రస్తుతం ఉన్న క్లస్టర్లలోనే 40 కేసులు వచ్చాయన్నారు. మందులు ఇంటికే సరఫరా చేస్తాం. కొన్ని చోట్ల వైద్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి కరోనా సోకింది. వైరస్‌ సోకిన వారికి వరుసగా రెండుసార్లు నెగటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేస్తున్నాం.’’ అని జవహర్‌రెడ్డి వివరించారు.

* పశ్చిమ్‌ బెంగాల్‌ తొలిసారిగా ఆ రాష్ట్రంలోని కొవిడ్‌-19 మరణాల సంఖ్యను బహిర్గతం చేసింది. కరోనా వైరస్‌తో 57 మంది మృతిచెందారని వెల్లడించింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులుండి వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 39గా పేర్కొంది. వీటిని కరోనా లెక్కల్లోకి తీసుకోలేదని తెలుస్తోంది. కొవిడ్‌-19తో రాష్ట్రంలో 18 మంది మరణించారని బెంగాల్‌ ఆడిట్‌ కమిటీ తెలిపింది. ‘ఒకవేళ కొవిడ్‌-19 రోగి రహదారి ప్రమాదంలో చనిపోతే దానిని కొవిడ్‌ మరణంగా పరిగణించలేం కదా’ అని బెంగాల్‌ వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చెప్పిన తర్కం గురించీ కేంద్రం బృందం లేఖలో ప్రస్తావించింది.

* కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదాపడిన ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ షెడ్యూల్‌ను మారిస్తే ఒప్పుకోమని పీసీబీ సీఈఓ వసీంఖాన్‌ స్పష్టంచేశారు. కరోనా పరిస్థితులు అడ్డంకిగా మారకపోతే సెప్టెంబర్‌లో అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే ఆసియాకప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ‘ఆసియా కప్‌పై మా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఏ కారణం చేతనైనా ఆ టోర్నీ జరగకపోతే అది కరోనా మహమ్మారి వల్లే అవుతుంది. ఐపీఎల్‌ కోసం ఆసియా కప్‌ షెడ్యూల్‌ను మారిస్తే మేం ఒప్పుకోం.’ అని వసీం పేర్కొన్నారు.

* కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు దేశ నాయకులు కృషి చేస్తున్న తీరును ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఒక పూట భోజనం లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ములు ఎదురుచూడటమంటే ఏంటో నాకు తెలుసు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి.’ అని బ్రహ్మానందం చెప్పారు.