Devotional

దుబాయిలో రంజాన్ సడలింపులు

దుబాయిలో రంజాన్ సడలింపులు

కరోనా విస్తరిస్తున్నప్పటికీ రంజాన్‌ మాసం దృష్ట్యా శుక్రవారం నుంచి దుబాయ్‌ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు షాపింగ్‌ మాళ్ల నుంచి ఇంచుమించుగా అన్ని వాణిజ్య సంస్థలు, నిర్మాణ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. అయితే, అత్యవసర పనులు ఉంటనే ప్రజలు బయటకు వెళ్లాలని పేర్కొన్నప్పటికీ, ‘అత్యవసరం’ అనే పదానికి నిర్వచనం మాత్రం చెప్పలేదు. యూఏఈ వ్యాప్తంగా శుక్రవారం వరకూ కరోనా రోగుల సంఖ్య 9,281. మృతుల 64. ఇందులో అత్యధికులు దుబాయ్‌కు చెందిన వారేనని తెలుస్తున్నా, స్పష్టమైన సంఖ్యను మాత్రం ప్రకటించడం లేదు. వాస్తవానికి దుబాయ్‌ జనాభా 31 లక్షలు కాగా, అందులో 85 శాతం విదేశీయులే. వారిలోనూ భారతీయులే ఎక్కువ. దీంతో సహజంగానే కరోనా బాధితుల్లోనూ వీరే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా, భౌతిక దూరం నిబంధనలకు అక్కడి ప్రభుత్వం తూట్లు పొడిచింది.భారత్‌తో పోలిస్తే బాధితులను క్వారంటైన్‌ చేయడంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దుబాయ్‌లో పని చేస్తున్న పలువురు తెలుగు ప్రవాసులకు నాలుగు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. అయితే, అప్పటికి వారికి ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. వారిలో కొందరికి పాజిటివ్‌ అని తేలడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి ద్వారా ఇంకెంత మందికి సోకిందన్నది తెలియడం లేదు. మరోవైపు.. రోగ లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న వారిని క్వారంటైన్‌ చేయకుండా, ఫోన్‌ నంబర్‌ తీసుకొని వదిలేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సెల్‌ఫోన్‌కు సందేశం రావడంతో వారంతా ఆస్పత్రులకు వెళ్తున్నారు. దుబాయ్‌ సహా షార్జా, అబుధాబీ, ఆజ్మాన్‌, రస్‌అల్‌ ఖైమా ఇతర ఏమిరేట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది.