* లాక్‌డౌన్‌ను నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి మరికొన్ని సడలింపులను ఇచ్చింది. నిత్యావసరాల్లో భాగంగా ప్రజలకు అవసరమైన గూడ్స్ సరఫరకు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే నాన్ హాట్‌స్పాట్ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను కూడా తెరవబడతాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తెరుచుకునే షాపులకు మాత్రం షరతులు కూడా విధించింది.
* దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తర్వాతా ఉద్యోగుల్లో 75% మంది ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ సంస్థలో 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. సాధారణంగా 20% ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుంటారు. 2025 లోగా దీనిని దశలవారీగా 75 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఉంది.
* లాక్‌డౌన్ వేళ వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు జూమ్ యాప్ అంతగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో జూమ్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. దీంతో హ్యాంగ్ అవుట్ మీట్‌ను గూగుల్ మీట్‌గా మార్చి తీసుకొచ్చింది. అందులో ఇప్పుడు గూగుల్ కొత్త సదుపాయాలను జోడించింది.
* ఈ ఆర్థిక సంవత్సరంలో (2020-21) రూ.13,500 కోట్ల నిధుల సమీకరణకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వెల్లడించింది. ‘మా బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశం 24న (శుక్రవారం) జరిగింది. ఇందులో 2021 మార్చి 31 వరకు వివిధ దశల్లో రూ.13,500 కోట్ల అదనపు మూలధన నిధులు సమీకరించుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింద’ని బీఓబీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ నిధుల్లో రూ.9,000 కోట్లు క్యూఐపీ వంటి పద్ధతుల ద్వారా సాధారణ ఈక్విటీ మూలధనం రూపంలో, మరో రూ.4,500 కోట్లు టైర్-1, టైర్-2 కేపిటల్ సాధనాల ద్వారా వివిధ దశల్లో సమీకరిస్తామని బ్యాంకు పేర్కొంది. నియంత్రణ సంస్థ చట్టబద్ధమైన అనుమతులకు లోబడే ఈ నిధుల సమీకరణ ఉంటుందని బీఓబీ తెలిపింది.
* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఏకీకృత ప్రాతిపదికన రూ.206.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.198.4 కోట్లతో పోలిస్తే ఇది 3.9 శాతం ఎక్కువ. ఆదాయం రూ.1,839.4 కోట్ల నుంచి 11.5 శాతం పెరిగి రూ.2,050.50 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రకారం, ఆదాయంలో 1.9 శాతం వృద్ధి నమోదు కాగా, నిర్వహణ మార్జిన్ 150 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు సంస్థ పేర్కొంది. డాలరు ప్రాతిపదికన నికర లాభంలో మార్పు లేకపోయినా, ఆదాయం మాత్రం 6.3% పెరిగిందని వివరించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 16.3% పెరిగి రూ.630.9 కోట్లకు, ఆదాయం 10.6% పెరిగి రూ.7,764.3 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2020 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి సంస్థలో 21,991 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, 307 మంది క్లయింట్లున్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.10 తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.
* భారత విమానయాన రంగం, దానిపై ఆధారపడిన పరిశ్రమల్లో 29 లక్షలకు పైగా ఉద్యోగాలపై కరోనా ప్రభావం పడవచ్చని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ అంచనా వేస్తోంది. మే 3 వరకు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో భారత్‌లో వాణిజ్య విమాన సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తితో విమానయాన, పర్యాటక రంగాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావమే పడింది.