DailyDose

పాతికవేలకు చేరువలో భారత్ కరోనా కేసులు-TNI కథనాలు

TNILIVE Coronavirus Health Bulletin-India Close To 25000 COVID19 Cases

* తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు కొత్తగా మరో 66 కేసులు; ఒక మరణం నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు సంఖ్య 1821కి చేరగా.. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఈ ఒక్క రోజే 94మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 960కి చేరింది.

* ఏపీలో మొత్తంగా 196 క్లస్టర్లు ఉన్నాయని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అన్నారు. వీటిలో 122 అర్బన్లో ఉండగా.. 74 క్లస్టర్లు రూరల్‌లో ఉన్నాయని తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్‌ కేసుల రేటు (1.66శాతం) చాలా తక్కువగా ఉందన్నారు. ఇప్పటివరకు 61,266 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1016 పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 171మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రతి మిలియన్‌ మందిలో 1147మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు.

* భారత్‌లో కరోనా విజృంభణ రోజురోజుకూ మరింతగా వేగంగా కొనసాగుతోంది. గత 24గంటల్లో 1490 కేసులు, 56 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 24,942 కరోనా పాజిటివ్‌ నమోదైనట్టు పేర్కొంది. వీరిలో 5210 మంది కోలుకోగా.. 779 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఏపీలో పెరిగిన కరోనా కేసులు.తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదు.గడిచిన 24 గంటల్లో 61 కేసులు నమోదు.ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1016 కరోనా పాజిటివ్ కేసులు.814 మందికి కొనసాగుతున్న చికిత్స .170 మంది డిశ్చార్జ్.24 గంటలు కర్నూలు లో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి.మొత్తం 31 కి చేరిన మృతుల సంఖ్య.

* విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

* శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ నుంచి వచ్చిన ద్వారా జిల్లాలో కరోనా కేసులు వచ్చినట్టు కలెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. పాతపట్నం మండలానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో మండలంలోని 18 గ్రామాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా గ్రామాల్లో నిత్యావసరాలు, తాగునీరు, మందులు డోర్‌ డెలివరీ చేస్తామనీ, ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

* రాష్ట్రంలో కోవిద్- 19 వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నేడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. ప్రధానంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన 1500 పడకల ప్రత్యేక కోవిద్ ఆసుపత్రిని, హైదరాబాద్ నగరంలో వలస కూలీలు, నిరుపేదలకు ఉచితంగా అందించే భోజనాన్ని తయారు చేసే నార్సింగిలోని అతిపెద్ద కిచెన్ అక్షయపాత్ర ను ఈ ప్రతినిధి బృందం సందర్శించింది. భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గెడం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, కన్జ్యూమర్ ఆఫ్ఫైర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది తదితరులున్నారు. ఈ బృందం నేడు ఉదయం గచ్చిబౌలి లో ప్రతేకంగా ఏర్పాటుచేసిన కోవిద్ ఆసుపత్రిని తనిఖీ చేసింది.ఈ కోవిద్ ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లపై పంచాయతీరాజ్ కమీషనర్ రఘునందన్ రావ్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ డా.జయరాం రెడ్డిలు ఈ బృందానికి వివరించారు. 2007 లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల సందర్బంగా నిర్మించిన ఈ 14 అంతస్తుల భవనంలో 1500 పడకల ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి, కింగ్ కోటి ఆసుపత్రులను పూర్తి స్థాయి కరోనా పాజిటివ్ కేసులకు సంబందించిన ఐసోలేషన్ ఆసుపత్రులుగా మార్చామని, ఆయా ఆసుపత్రుల్లో స్థాయిని మించి కేసులు నమోదయిదే గచ్చిబౌలి ప్రత్యేక ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని వివరించారు. ఒక్క హైదరాబాద్ లోనే రెండు వేల పడకలు (బెడ్స్) వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్చడం జరిగిందని, కోవిద్ నివారణ, చికిత్సలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుసరించే చేస్తున్నామని రఘునందన్ రావ్ తెలిపారు. కాగా, ఈ ప్రతినిధి బృందం గచ్చిబౌలి ఆసుపత్రిలోని ఐ.సి.యూ, అత్యవసర వార్డులు, ఐసోలేషన్ వార్డులు, థియేటర్లు,స్టోర్ రూములన్నింటిని పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గ దర్శకాలను అనుసరించి వివిధ ప్రోటోకాల్ కమిటీల ఏర్పాటు చేశారా, కరోనా నివారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తదితర అంశాలపై ప్రశ్నించారు. అనంతరం ఈ బృందం నార్సింగిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన వంటశాలను (మెయిన్ కిచెన్ ) పరిశీలించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ కేంద్రం ద్వారా ప్రతిరోజూ దాదాపు లక్షన్నర మందికి మధ్యాహ్నం, సాయంత్రం బోజనాలను అందిస్తున్నామని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటుచేసిన 150 అన్నపూర్ణ క్యాంటిన్ ల ద్వారా ఈ బోజనాలను అందిస్తున్నామని, కరోనా వ్యాధి అనంతరం ఈ అన్నపూర్ణ కేంద్రాలను 200 లకు పెంచారని తెలిపారు. దీనితో పాటు మొబైల్ వాహనం ద్వారా కూడా బోజనాలను అందచేస్తున్నామని పేర్కొన్నారు.