వైశాఖ మాసమంటేనే పెళ్లి ముహూర్తాలకు పెట్టింది పేరు. పెళ్లి మేళాలు, భాజాభజంత్రీలు మార్మోగుతుంటాయి. వ్యాపారాలు కళకళలాడుతుంటాయి. కల్యాణ మండపాలు సందడిగా కనిపిస్తాయి. చీరలు, నగల దుకాణాల్లో మహిళల ఉత్సాహం చెప్పనలవి కాదు. క్యాటరింగ్, డెకరేషన్ మొదలు ప్రతి రంగానికి ఆ గిరాకీ అంతో ఇంతో ఉంటుంది. కానీ, ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి సుమారు వెయ్యి వివాహాలు వాయిదా పడ్డాయి. కల్యాణ మండపాలు బుక్ చేసుకున్న వారు కూడా… వాటిని రద్దు చేసుకోగా- ఇప్పుడు తప్పితే మళ్లీ వీలు కుదరదనుకునే అతికొద్ది మంది మాత్రమే పెళ్లి వేడుకులకు సిద్ధమయ్యారు. వీరికి ప్రభుత్వం విధించిన నియమాలు వర్తిస్తాయి. కేవలం 40 మంది లోపలే వివాహానికి పిలవాలి. సామాజిక దూరం పాటిస్తూ కూర్చోవాలి. మునుపటిలా ఫొటోలు తీసుకోవడానికి వీలు లేదు. పెళ్లి జరుగుతున్నంత సేపు ముఖానికి మాస్కులు కట్టుకోవాలి. వధువు, వరుడితో పాటు పురోహితుడూ, బంధువులు సైతం ఈ నిబంధనను విధిగా పాటించాలి. అవును మరి… వంట వారి నుంచి అలంకరణ చేసేవారి వరకు ప్రతి ఒక్కరిని ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎందుకంటే.. వారిలో ఒక్కరికి కరోనా లక్షణాలు ఉన్నా… మొత్తం అల్లకల్లోలమే. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. సంబంధిత ప్రాంతాల ఆరోగ్యశాఖ వారు వివాహాలు నిర్వహించేందుకు వచ్చిన వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. తమ సంతానం వివాహాన్ని భారీగా నిర్వహించాలని, ఊరు, వాడ ఏకమయ్యేలా పందిళ్లు వేసి, బంధుమిత్రులందరితో హంగామా చేయాలనుకునే కోటీశ్వరులు కూడా కరోనా దెబ్బకు తలలు పట్టుకు కూర్చున్నారు. చాలా మంది తమ స్థాయికి కొద్ది మందితో పెళ్లి చేయడం కన్నా.. వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించుకుంటున్నారు. ఇంకోవైపు ఎంత గొప్పవారి పెళ్లయినా… పిలిస్తే.. రావడానికి బంధుమిత్రులు అంత సిద్ధంగా లేరు. వీళ్ల సంగతి అలా ఉంచితే.. వివాహాలపై ఆధారపడ్డ ఎంతో మంది ఈసారి సీజన్‌లో తమ ఉపాధిని కోల్పోయారు. పూల దండలు, డెకరేషన్, ఆభరణాలు, దుస్తుల తయారీ రంగంలో ఉన్న వారు కరోనా తమ కడుపులు కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యాపారులను పలకరిస్తే.. వారి బాధకు అంతే లేదు. సుమారు 40 రోజులపాటు దుకాణాలు మూసివేయడంతో కుటుంబాలకు జరుగుబాటే కష్టంగా ఉంటోందన్నారు. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టాన్ని తమ రంగం చవిచూస్తోందని చెబుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు తట్టుకున్నా, అంతంత మాత్రం వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పురోహితులకైతే కళ్ల నీళ్లు ఒక్కటే తక్కువ. ఒక్క సీజన్ పెళ్లిళ్లు లేకపోతే.. దీని ప్రభావం ఈ సంవత్సరమంతా ఉంటుందని వాపోతున్నారు. తమ సంఘాలతో పాటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో 900 మంది ఉన్నారు. వంటలు తయారు చేసేవాళ్లు, వడ్డన కుర్రాళ్లు, కిళ్లీలు కట్టేవాళ్లు, అమ్మేవాళ్లు…పెళ్లిళ్ల మీద ఆధారపడి కూరలు, పాల వ్యాపారాలు చేసేవాళ్లు… ఇలా… ప్రతి ఒక్కరికీ కరోనా..కష్టాలే.
వెయ్యి వివాహాలు ఆగిపోయాయి
Related tags :