Health

27వేల వైపు ఇండియా కరోనా పరుగులు-TNI కథనాలు

India Running Towards 27000 Positive Cases-TNILIVE Corona Bulletin

* కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనుంది. ఓవైపు లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ విరుగుడుకు ఇప్పటి వరకు సరైన ఔషధం లేకపోవడంతో.. సామాజిక దూరం, లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ మే 7తో ముగియనుంది. అయితే ఆ తరువాత కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

* భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,990 కొత్త కేసులు నమోదు కాగా, 49మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనా మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 824కు పెరిగింది. భారత్‌లో ఇప్పటి వరకు 26,496 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 5,803 మంది కోలుకున్నారు. ఇక గుజరాత్‌, మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి.

* ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు నెలరోజుల పాటు చేసే ఉపవాసాల అనంతరం మే 23 తేదీన ఈద్ వస్తుంది. ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేసి రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. గత ఏడాది వరకూ రంజాన్ పండుగను వేడుకగా జరుపుకున్నా ఈ సారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా ఉత్సాహంగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ వేళ సద్భావన, సంవేదన, సేవా భావన పెంపొందాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, రెండు గజాల దూరం పాటించడం మరచిపోవద్దని ప్రధాని సూచించారు.

* నగరంలో మూడు రోజుల్లో అనూహ్యంగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తయ్యారు. కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ వల్ల పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్నటివరకు 18 కేసులు నమోదయ్యాయని, ఆదివారం ఒక్కరోజే 20 కేసులు నమోదయ్యాయి. దీంతో కృష్ణలంకను రెడ్ జోన్‌ ప్రాంతంగా ప్రకటించారు. కృష్ణా జిల్లా కలెక్టర్, సీపీ ద్వారకా తిరుమలరావు అధికారులతో చర్చలు జరిపారు.

* తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని వానియంబడిలో పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కుప్పం ప్రజల్లో భయాందోళన నెలకొంది. కుప్పానికి సుమారు 30 కిలోమీటర్ల దూరములోని వానియంబడిలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కుప్పం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. సరిహద్దు ప్రాంతంలోని వానియంబడి తాలూకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకు కరోనా సోకింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్ స్టేషన్ మూసివేశారు. సీఐతో పాటు ఒకరిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది.

* కృష్ణాజిల్లాలో ఈ రోజు నమోదు అయిన 52 కేసులు విజయవాడ పరిధిలోనే. 24 కృష్ణలంక. 18 కార్మిక నగర్(మాచవరం). 4 ఖుద్దుస్ నగర్. 4 జింఖాన గ్రౌండ్స్. 2 గూడవల్లి.

* సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,624కు చేరుకున్నట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

* ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణతో పాటు లాక్‌డౌన్‌పైనా చర్చించనున్నారు. రెండో విడత లాక్‌డౌన్‌ గడువు (మే 3) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

* చిత్ర పరిశ్రమ విధానాలు మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత చిత్ర పరిశ్రమను నెమ్మదిగా మొదలుపెడతాం. ఎందుకంటే భౌతిక దూరంతో షూటింగ్‌ జరపడం సాధ్యం కాదు. థియేటర్‌లో కూడా సామాజిక దూరం పాటించి.. సినిమాలు చూస్తే మంచి అనుభూతిని ఇవ్వలేకపోవచ్చు. 20-30 మందితో కలిసి చిన్న, మీడియం సినిమాల షూటింగ్‌ చేయడం మొదలుపెడతాం. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌లో పరిమిత వ్యక్తులతో చిన్న సినిమాలు తీస్తాం. వీలుంటే ముందుగా వాటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేస్తాం’’ అని అన్నారు.