Movies

రవీనా సరికొత్త ఉద్యమం

Raveena Tandon Starts New Revolution

వైద్యులు, నర్సులు ఇల్లు వదిలి, తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్‌పై పోరాడుతున్నారు. అలాంటి నిజమైన హీరోలను ప్రోత్సహించడం, వారికి సరైన గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత.తరచూ సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడుతుంటారు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌. తన దృష్టికి వచ్చిన అంశాలపై మానవత్వంతో స్పందిస్తుంటారు. కరోనా విలయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వైద్యులు. కానీ వారిపై దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు. వీటిని ఆపాలంటూ తాజాగా రవీనా పిలుపునిస్తున్నారు. అందు కోసం ఆమె సామాజిక మాధ్యమాల్లో ‘జీతేగా ఇండియా.. జీతేంగే హమ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో పుట్టుకొస్తున్న తప్పుడు వార్తలకు కళ్లెం వేయాలని కూడా అభ్యర్థించారు. ‘కొవిడ్‌-19’ బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897’ చట్టంలో మార్పులు చేస్తూ ఇటీవల ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీని ప్రకారం వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడినవారికి అత్యధికంగా ఏడేళ్లు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా దాడులు ఇంకా ఆగలేదు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నవారిని అంటరానివారిలా చూస్తూ, అపార్ట్‌మెంట్లకు రానివ్వని సందర్భాలూ ఉన్నాయి. అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటివి అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే రవీనా కొత్తగా క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘‘వైద్యులు, నర్సులు ఇల్లు వదిలి, తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్‌పై పోరాడుతున్నారు. మనల్నీ, మన కుటుంబాలనూ కాపాడడానికి వారు తమ కుటుంబ సభ్యులను కూడా కలవడం లేదు. అలాంటి నిజమైన హీరోలను ప్రోత్సహించడం, వారికి సరైన గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత. అదే సమయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దు. ‘జీతేగా ఇండియా… జీతేంగే హమ్‌’ క్యాంపెయిన్‌ ద్వారా నేను చేస్తున్న అభ్యర్థన ఇదే’’ అన్నారు రవీనా. త్వరలోనే మనమందరం చీకట్లు పారద్రోలి వెలుగును చూస్తామంటున్నారు రవీనా టాండన్‌.