Devotional

అప్పన్న చందనోత్సవానికి ఎవరూ లేరు

Simhadri Appanna Chandanotsavam 2020 Performed In LockDown

వైశాఖశుద్ద తదియని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం తొలిసారి భక్తుల సందడి లేకుండానే ఆదివారం జరిగింది. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిమిత వైదిక సిబ్బందితోనే ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కేవలం వంశపార ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున దేవస్థానం ఈవోనే స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు, 3.30గంటల నుంచి స్వామివారిపై ఉండే చందనం విసర్జన, మధ్యాహ్నం 3గంటల నుంచి అష్టోత్తర శత కలశ పూజ, సాయంత్రం 5గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, తదుపరి తొలివిడత చందనం సమర్పణ నిర్వహించనున్నారు. అర్చకులు సహా పరిమిత సిబ్బందితోనే స్వామి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఆలయ చరిత్రలో భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగటం ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ కారణంగా ఆలయ నిర్వాహకులు భక్తులకి అనుమతి నిరాకరించారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది సింహాచలేశుడి నిజరూప దర్శనాన్ని భక్తులు వీక్షించలేకపోయారు. సింహగిరిపైకి వెళ్లే ఘాట్ రోడ్డుతో పాటు మెట్ల మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు. అదేవిధంగా మాధవధార కొండపై నుంచి రోడ్డు, మెట్ల మార్గంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.