* ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న 38నార్త్ అనే వెబ్‌సైట్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ వెబ్‌సైట్ ఉత్తరకొరియా సహా దాని చుట్టుపక్క ప్రాంతాలపై నిరంతరం నిఘా వేసి విశ్లేషిస్తూ ఉండే ఓ ప్రాజెక్టుకి సంబంధించినది.
* లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మే 3తో లాక్‌డౌన్ గడువు ముగియనుండడంతో ఆ తర్వాతే వారిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు దీనితో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్రం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం ఓ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం ఇక్కడ కరోనా మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. శనివారం ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 2,494 మంది మరణించారు. దీంతో అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య 53,928కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 9,60,375గా నమోదైంది. ప్రపంచంలో నాలుగో వంతు కరోనా మరణాలు, మూడో వంతు కేసులు అక్కడే నమోదవుతున్నాయి. శుక్రవారం అక్కడ 1,258 మరణాలు చోటుచేసున్న సంగతి తెలిసిందే. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
* లాక్‌డౌన్ పొడగింపుపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆదివారం కీలక ప్రకటన చేశారు. ముంబై, పుణేలోని కంటేయిన్‌మెంట్ జోన్లలో అవసరం దృష్ట్యా లాక్‌డౌన్ పొడగించే అవకాశాలూ ఉన్నాయని ప్రకటించారు. ఈ రెండు నగరాల్లోని కంటేయిన్‌మెంట్ జోన్లలో మే 18 వరకూ లాక్‌డౌన్ పొడగించే సూచనలను కొట్టిపారేయలేమని అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం సోమవారం నిర్వహించబోయే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తర్వాతే తీసుకుంటామని తెలిపారు.
* జిల్లాలో 4 పాజిటివ్ కేసులు ఉన్నాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 3,576 మందికి నెగెటివ్ వచ్చిందని, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాపిడ్, ట్రూ నాట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, జెమ్స్ ఆస్పత్రిని జిల్లా కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తామని ఆళ్లనాని ప్రకటించారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈసందర్భంగా లాక్‌డౌన్ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈనెల 20 తర్వాత ఇచ్చిన సడలింపుల ప్రభావంపైనా సీఎంతో సమీక్షించారు.
కొవిడ్ నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం .. హోం మంత్రికి వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు.