అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో వైరస్ దెబ్బకు 24 గంటల వ్యవధిలో 2,494 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 54 వేలు దాటింది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు, వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నిషేధాజ్ఞల సడలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలను ఈ వారంలోనే పాక్షికంగా ఎత్తివేయనున్నారు. టెన్నెస్సీలో సోమవారం నుంచి రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. మిస్సౌరీలో ఈ వారం దాదాపుగా అన్ని వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇడహోలో ప్రార్థనా స్థలాల్లోకి ప్రజలను అనుమతించనున్నారు. సెలూన్లు, స్పాలను తెరిచేందుకు జార్జియా, ఒక్లహామా అనుమతించాయి. అలస్కాలోనూ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే పలు బీచుల్లో కోలాహలం కనిపిస్తోంది. రిపబ్లికన్ గవర్నర్ల నేతృత్వంలోని రాష్ట్రాలు కీలక రంగాలను పునరుద్ధరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
డెమోక్రాటిక్ నేతలు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కరోనా ఉద్ధృతికి కుదేలైన న్యూయార్క్‌లో ప్రస్తుతానికి సడలింపుల దిశగా అడుగులు పడట్లేదు. హవాయిలో జనం ఇళ్లను విడిచి బయటకు రాకుండా విధించిన ఆంక్షలను వచ్చే నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు గవర్నర్ డేవిడ్ ఇగె ప్రకటించారు. ఆంక్షల ఎత్తివేతకు తొందరపాటు తగదని అమెరికాలో అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హితవు పలికారు. తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పాలన్న కోరిక అర్థం చేసుకోతగినదేనని ఆయన పేర్కొన్నారు. అయితే- వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాక ముందే ఆంక్షలను ఎత్తివేస్తే.. పరిస్థితులు ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేవని హెచ్చరించారు. అమెరికా ఆరోగ్యం, మానవ సేవల మంత్రి అలెక్స్ అజర్‌పై వేటు వేయాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాజాగా పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. దేశంలో తొలినాళ్లలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అలెక్స్ విఫలమయ్యారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నాయి. ఈ వార్తలను శ్వేతసౌధ అధికార ప్రతినిధి జుడ్ డీరె కొట్టిపారేశారు.