విశ్వప్రసిద్ధ శ్రీక్షేత్రం లోపల ఆదివారం అక్షయ తృతీయ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయం వెలుపల ఏర్పాటు కావాల్సిన సంబరాలు ఆంక్షల కారణంగా ఈ ఏడాది వెలవెలబోయాయి. పరిమిత సంఖ్యలో సేవాయత్‌లు ఉదయం మంగళహారతి తర్వాత జగన్నాథుని గోపాలవల్లభ సేవ చేపట్టారు. తర్వాత పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో దైనందిన సేవలు నిర్వహించారు. కక్కరా, అరిస, ముదుక, ఖిరి, వల్లభ, పుడొపిఠా తదితర పిండి వంటకాలు అర్పణ చేశారు. మధ్యాహ్నం యథావిధిగా ‘ఒబడా’(మహాప్రసాదం) సమర్పించారు. మరోవైపు చహానీ మండపం ఆవరణలో హోమం జరిపించారు. స్నానవేదిక వద్ద రామకృష్ణ, మదనమోహన, శ్రీదేవి, భూదేవి, పంచపాండవ ఉత్సవ విగ్రహాలకు సంప్రదాయానుసారం చందన లేపనం చేసి ఇక్కడే ఇత్తడి పాత్రల్లో విగ్రహాలచే జలక్రీడలు చేయించారు. మరోవైపు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాల నిర్మాణం పనులకు సంబంధించి 12 అడుగుల పొడవున్న మూడు కలప దుంగల్ని భోయ్, మహరణా సేవాయత్‌లు శ్రీక్షేత్రం లోపలకు తెచ్చారు. చహానీ మండపం ఆవరణలో కలప పూజా కార్యక్రమం నిర్వహించారు. గర్బగుడి నుంచి జగన్నాథుని మెడలోని పుష్ప(ఆజ్ఞ) మాల తెచ్చిన సేవాయత్‌లు మూడు కలప దుంగలపై ఉంచి పూజలు చేశారు. ఈ వేడుకలన్నీ పరిమితులకు లోబడి పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి సూచనల మేరకు శ్రీక్షేత్రం లోపలే రాత్రి వరకు నిర్వహించారు.
మల్లిఖార్జుని చెంత ప్రశాంతంగా అక్షయ తృతీయ
Related tags :