కిడ్నీ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా ఇతర ప్రాంతాల్లోని కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. డయాలసిస్ కేంద్రాలన్నీ కొవిడ్ స్క్రీనింగ్ పరీక్షల్లో నిమగ్నమైనందున కిడ్నీ రోగులకు సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొవిడ్ ఫలితాల ఆలస్యం కారణంగా డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన వైద్యం అందక వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని లేఖలో చంద్రబాబు వివరించారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి కిడ్నీ రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కిడ్నీ సమస్యలపై చంద్రబాబు లేఖలు
Related tags :