Business

మన మామిడి రవాణా బానే ఉంది

Indian Mango Export Business On Good Stands

పండ్లలో రారాజు మామిడికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్‌. నోరూరించే రసాలు, చూస్తేనే తినాలనిపించే బంగినపల్లి, చెరకును మరిపించే సువర్ణరేఖ.. ఇలా మొత్తం 30 రకాల పండ్లకు రాష్ట్రం నిలయం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాది మామిడి పండ్లను తినగలుగుతామా? అనే బెంగ లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు పండ్లను చేర్చే క్రమంలో మార్కెటింగ్, ఉద్యాన శాఖలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ రకాల కిట్ల రూపంలో అడిగిన వెంటనే పండ్లను సరఫరా చేసే ప్రక్రియ కూడా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రారంభమైంది. అయితే కాయలు పక్వానికి రాకముందే కోస్తే సమస్యలుంటాయని, కొన్ని రోజులు వాయిదా వేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యమని ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురి సూచించారు. మరో 15 రోజుల్లో సీజన్‌ ఊపందుకోనున్న తరుణంలో మామిడి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం.
**ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు
* దళారులు లేకుండా మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించడం
* రైతులు, కొనుగోలుదార్ల మధ్య మీటింగ్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీవోలు) అనుసంధానం.
* ఎపెడా( అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) సహకారంతో ఎగుమతులు పెంపొందించడం
* ఇ–రైతు, కిసాన్‌ నెట్‌ వర్క్, కాల్‌గుడీ, ఎన్ఇఎం వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలపై అవగాహన కల్పించి రైతులు, ఎఫ్‌పీవోల నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో సరకు కొనుగోలు
* స్థానిక మార్కెట్ల ఏర్పాటు. ఇళ్ల ముంగిటకే సరకును సరఫరా చేయడం
* పండ్ల రవాణాకు తక్షణమే పర్మిట్లు. లాక్‌డౌన్‌ ఆంక్షల తొలగింపుతో ఆటంకం లేకుండా రవాణా
* సమస్యలపై స్థానిక అధికారులను లేదా 1902, 1907 నెంబర్లలో సంప్రదించే అవకాశం
***రాష్ట్రంలో 3.85 లక్షల హెక్టార్లలో సాగు
రాష్ట్రంలో సుమారు 3,85,881 హెక్టార్లలో సాగు. ప్రధానంగా కృష్ణా, చిత్తూరు, విజయనగరం,విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు,వైఎస్సార్‌ కడప జిల్లాలలో అత్యధిక సాగు, ఉత్పత్తి.
* రైతులకు రోజువారీగా ధరల సమాచారం తెలిసేలా చర్యలు.
* అంతర్రాష్ట్ర వాణిజ్యానికి చొరవ. ఎగుమతుల కోసం 54 ఎఫ్‌పీవోలు.
*రవాణాకు ప్రత్యేక రైళ్ల కోసం నాఫెడ్‌తో ఒప్పందం
* చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఒప్పందం
* శుక్రవారం నాటికి 25, 628 టన్నుల సేకరణ.
***రాష్ట్రం నుంచి ఎగుమతులు ఇలా
* కృష్ణా, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పలు దేశాలకు ఎగుమతి.
*ఎగుమతి కోసం రైతులు ఎపెడా) రూపొందించిన హార్టీ నెట్‌ వెబ్‌ నుంచి ఉద్యాన శాఖ వద్ద నమోదు చేసుకునే అవకాశం.
*2018–19లో 1471 టన్నుల సరకు ఎగుమతి కాగా, ఈ ఏడాది మూడు వేల టన్నులు లక్ష్యం.
*ఇప్పటికే న్యూజిలాండ్,స్విట్జర్లాండ్‌కు ఎగుమతులు.
* విదేశీ ఎగుమతులను ఉద్దేశించి తిరుపతి, నూజివీడులలో రెండు వాపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ యూనిట్లు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు హాట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు.
* చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో త్వరలో మరో 9 ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌసులు.
***రైతుల సమస్యలు ఇవీ
* విమాన రవాణా ఛార్జీలు, ఇతర రాష్ట్రాలకు లారీల కిరాయి అధికం. వీటిని తగ్గించాలని ఎఫ్‌పీవోల వినతి.
* దిగుబడి తక్కువగా ఉన్నా.. ధరలు గత ఏడాది కంటే తక్కువ.
* కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు టన్ను ధర రూ.80 వేలు. ఇప్పుడు రూ.35వేలు మాత్రమే. *చాలా చోట్ల మార్కెటింగ్‌ సౌకర్యం లేదని ఫిర్యాదులందుతున్నాయి.
* రైతులకు కనీస మద్దతు ధరలు లభించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్కెటింగ్‌ సదుపాయాలు అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.