Movies

జ్ఞాపకాలే ఘనమైనవి

Rakul Preet Singh Speaks Of COVID19 Experiences

‘‘లక్ష్యసాధన కోసం నిత్య జీవితంలో మనమందరం పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రకృతి విపత్తు వస్తే మనం ఎంతవరకు ఎదుర్కోగలమో ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే అర్థం అవుతుంది. మన ఆరోగ్యం, కుటుంబం, మనల్ని ప్రేమించేవారు, వారితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి. మిగతావన్నీ తర్వాతే అనిపిస్తోంది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. లాక్‌డౌన్‌ సమయం ఎలా గడుస్తుందో రకుల్‌ చెబుతూ – ‘‘ఈ ఏడాది మార్చి 18 నా చివరి వర్కింగ్‌ డే. అప్పట్నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎప్పటిలానే ఉదయం యెగాతో నా రోజు మొదలవుతుంది. పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రస్తుతం నేను ‘వై వియ్‌ స్లీప్‌’ అనే పుస్తకం చదువుతున్నాను. ‘ఛారియట్స్‌ ఆఫ్‌ గాడ్స్‌’, ‘కాస్మిక్‌ కాన్షియస్‌నెస్‌’ అనే పుస్తకాలను చదవడం పూర్తి చేశాను.మార్నింగ్‌ టైమ్‌లో బుక్స్‌ చదువుతున్నాను. మధ్యాహ్నం ఏదైనా సోషల్‌ మీడియా లైవ్స్‌ చూస్తాను. సాయంత్రం ఒక సినిమా చూస్తాను. అలాగే ఒక షోకు సంబంధించిన రెండు, మూడు ఎపిసోడ్స్‌ ఫాలో అవుతాను. ఆస్కార్‌ అవార్డు సాధించిన అన్ని సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆస్కార్‌ సినిమాలను రెండేళ్లుగా చూస్తున్నాను. వీలైనప్పుడు వంట కూడా చేస్తున్నాను. దీనిపై ఓ యాట్యూబ్‌ చానెల్‌ను కూడా స్టార్ట్‌ చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్‌ అవ్వడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. కానీ ఇంత లాంగ్‌ బ్రేక్‌ నా లైఫ్‌లో రాలేదు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత సినిమాలతో మళ్లీ బిజీ అవుతాను’’ అన్నారు.