DailyDose

ట్యూషన్ టీచర్ భరతం పట్టిన బుడతడు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-5 Year Old Informs Police About Tutions

* లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా గత నెలరోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణాలపై సదరు విమానయాన సంస్థలు తిరిగి చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రవాసీ లీగల్‌ సెల్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాక్‌డౌన్‌ కాలానికి (మార్చి25-మే3) కొనుగోలు చేసిన టికెట్ల పూర్తి మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లించే విధంగా అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో కోరింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పౌరవిమానయాన సంస్థతోపాటు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)కు నోటీసులు జారీచేసింది.

* కరోనా టెస్టింగ్‌ కిట్ల విక్రయాల్లో అక్రమంగా లాభాలు పొందేందుకు యత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లను ఐసీఎంఆర్‌కు ఎక్కువ ధరలకు విక్రయించారనే వార్తాకథనాన్ని ఆయన ఈ సందర్భంగా తన ట్వీటర్‌ ఖాతాలో ఉంచారు. ‘ఒకవైపు దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. ఈ క్రమంలో కొందరు అక్రమంగా లాభాన్ని అర్జించేందుకు వెనుకాడటం లేదు. ఈ తరహా వ్యవహారాలు సిగ్గుచేటు. ఇది ప్రతి భారతీయుడికి అవమానం లాంటిదే. దేశం వారిని క్షమించదు’ అని సోమవారం ట్వీట్‌ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ స్పందిస్తూ.. నెలరోజులుగా కరోనా కట్టడికి సంబంధించి చేపట్టిన మొత్తం కొనుగోలు వ్యవహారాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లు నకిలీవని రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు ఆరోపించిన విషయం తెలిసిందే.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె.. వరుసగా అతన్ని ఓడించింది. దీంతో ఆగ్రహం చెందిన అతను.. ఆమెను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదర సమీపంలో చోటుచేసుకుంది. భార్య తనకంటే తెలివైందనే ఆత్మన్యూనతాభావానికి లోనై.. ఈ క్రమంలో అహం దెబ్బతినడంతో అతను ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికంగా ఓ కౌన్సెలర్‌ వివరించారు. చికిత్సనంతరం ఆమె కొన్నాళ్లపాటు తన తల్లిదండ్రులవద్దే ఉండేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ వేళ మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

* లాక్‌డౌన్‌ వల్ల చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడానికి నిర్మాతలు మక్కువ చూపుతున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని నేపథ్యంలో తాము పెట్టిన బడ్జెట్‌ను తిరిగి పొందేందుకు ఇలా చేస్తున్నారు. కాగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంకు సంబంధించి జీ5లో తొలి తెలుగు సినిమా నేరుగా విడుదల కాబోతోంది. అదే సరికొత్త ప్రేమ కథాంశంతో రూపొందిన ‘అమృతరామమ్’. అమితారంగనాథ్‌, రామ్‌ మిట్టకంటి జంటగా నటించారు. పద్మజ ఫిల్మ్స్‌ ఇండియా పతాకంపై సి.ఎన్‌ రెడ్డి నిర్మించారు. సురేందర్‌ కొంటాడ్డి దర్శకుడు. ఎస్‌.ఎస్‌. ప్రసు సంగీతం అందించారు.

* ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం వీలు కాదా? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌కు సూచించింది. వలస కూలీల ఇబ్బందులపై న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

* చదువుకునే పిల్లలు ఎప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అలాంటిది లాక్‌డౌన్‌ పేరిట సుదీర్ఘ సెలవులు రావడంతో పిల్లలంతా ఇంట్లో ఆనందంగా గడుపుతున్నారు. అయితే, బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడం కాస్త వారిని బాధపెడుతున్నప్పటికీ.. పాఠాల నుంచి తప్పించుకొని ఇంట్లోనే ఆటా-పాటా ఉన్నందుకు మాత్రం సంతోషిస్తున్నారు. అయితే, ఈ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్ల పేరిట వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో కోపంతో ఉన్న ఓ ఐదేళ్ల బాలుడు ట్యూషన్‌ చెప్పే టీచర్‌ అడ్రస్‌ పోలీసులకు చెప్పిన సంఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగింది.

* తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా రేపు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ పతాకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను తెరాస సాధించిందన్నారు. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు.

* రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాను సందర్శించే ధైర్యం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఉందా? అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్‌ విసిరారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 వేగంగా వ్యాపిస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్‌ తాడేపల్లి రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని దేవినేని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయని.. ఇకనైనా కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అలాగే, జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు కేటీఆర్‌, ఈటలతో పాటు కేకే తదితర ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు.

* దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్‌ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. దేశంలో కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అంశంపై హోంమంత్రి అమిత్‌షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై రిప్లై పిటిషన్‌ వేసిన ఆయన కమిషనర్‌ పనుల్లో సాయం చేసేందుకే సెక్రటరీ విధులు పరిమితమని పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పిన ఆయన.. ఈసీ న్యాయవిభాగం వాయిదా నోటిఫికేషన్‌ తయారు చేశాకే తాను సంతకం చేశానని వివరించారు. విచక్షణతో వాయిదావేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందని తెలిపారు.