* కరోనా వైరస్ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) పరిశ్రమకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అండగా నిలిచింది. ఫండ్ల పరిశ్రమలో ద్రవ్య లభ్యతను పెంపొందించేందుకు రూ.50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రముఖ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇటీవల ఆరు డెట్ ఫండ్ పథకాలను నిలిపివేసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
* ప్రస్తుత లాక్‌డౌన్‌లో 6.5 లక్షలకు పైగా ప్రజలు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారని సమాచారం. ఏప్రిల్ నెలలో ఒక పనిరోజుకు సగటున 30,000-35,000 మంది నగదు కోసం క్లెయిమ్ చేసుకున్నారు.
* యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు లంచం ఇచ్చిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్ ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. ముంబయి సిటీ సెషన్స్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వారిద్దరిపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లు, సతారా జిల్లా యంత్రాంగం అందించిన సహకారంతో వారిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌కే గౌర్ వెల్లడించారు. యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్, బ్యాంకు ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్వల్పకాలిక డిబెంచర్లలో రూ.3,700 కోట్లు పెట్టుబడి పెట్టించడం, దీనికి ప్రతిగా రాణా కపూర్-వారి కుటుంబ సభ్యులకు వాధ్వాన్ సోదరులు రూ.600 కోట్ల లంచం ఇవ్వడం కేసులో వారిని సీబీఐ నిందితులుగా చేర్చింది. మార్చి 7న వారిపై కేసు నమోదైంది. కాగా వారు ఈ నెల ప్రారంభంలో తప్పించుకోవడానికి ప్రయత్నించారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించినందున, మహారాష్ట్రలోని పంచాగ్ని వద్ద సతారా జిల్లా పోలీసులు వాధ్వాన్ సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకుని, మహాబలేశ్వర్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం లేకుండా వారిని క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు పంపొద్దంటూ సతారా జిల్లా అధికారికి సీబీఐ లేఖ రాసింది. తాజాగా వారిని అరెస్టు చేయగా, ముంబయి సీబీఐ ప్రత్యేకకోర్టులో హాజరు పరచనుంది.
* ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో సోమవారం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 565 పాయింట్లు ఎగబాకి 31,892 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 9,311 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.59 వద్ద కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును సానుకూలపరిచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కీలక సంస్థల షేర్లు రాణిస్తుండడం కూడా సూచీలకు కలిసివచ్చింది.
* * రాగి మే కాంట్రాక్టు ఈవారం రూ.395.15 కంటే దిగువన ట్రేడ్‌కాకుంటే బలంగా పుంజుకోవచ్చు.
* సీసం మే కాంట్రాక్టు రూ.138.45 కంటే ఎగువన కదలాడకుంటే, దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. రూ.130.85 దిగువకు వస్తే రూ.128.85 వరకు పడిపోవచ్చు.
* జింక్ మే కాంట్రాక్టును రూ.137.45 వద్ద స్టాప్‌లాస్ పెటుకుని, రూ.140 నుంచి ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు.
* అల్యూమినియం మే కాంట్రాక్టు ఈవారం ఒడుదొడుకుల మధ్య చలించవచ్చు.
* బలహీన అంతర్జాతీయ సంకేతాలు, కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి నేపథ్యంలో గత వారం మార్కెట్లు డీలాపడ్డాయి. వ్యాక్సిన్ అభివృద్ధిపై అనిశ్చితి, మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ 6 డెట్ ఫండ్ పథకాలను నిలిపివేయడం కలవరపెట్టింది. కరోనాపై భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు నీరసంగా కదలాడాయి. అమెరికా ముడిచమురు ధరలు సున్నా దిగువకు చేరడం ప్రభావం చూపింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.8 శాతం నష్టంతో 31,327 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.8 శాతం తగ్గి 9,154 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4009 కోట్లు, డీఐఐలు- ఫండ్లు రూ.649 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.10,347 కోట్లు వెనక్కి తీసుకున్నారు.