కరోనా ముప్పు నేపథ్యంలో ఆర్‌జేడీ అధినేత, తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్‌కు పెరోల్ ఇవ్వాలని బిహార్ ప్రతి పక్షనేత తేజస్వీ యాదవ్ కోరారు. కొవిడ్-19 బాధితులను కలవడంతో క్వారైంటైన్‌కు వెళ్లిన వైద్యులు తన తండ్రికి వైద్యం చేసినట్టు వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దాణా కేసులో దోషిగా తేలడంతో 2017, డిసెంబర్ నుంచి లాలూప్రసాద్ యాదవ్ ఝార్ఖండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మూత్ర పిండాలు, గుండె, మధుమేహ సమస్యలుండటంతో ప్రస్తుతం ఝార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడీ ఆస్పత్రిని కరోనా కేసుల చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించారు. రిమ్స్‌లో కేసులు పెరుగుతుండటంతో లాలూకు పెరోల్ ఇవ్వడంపై న్యాయ సలహాలు స్వీకరిస్తున్నామని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఏప్రిల్ 13న పేర్కొన్న సంగతి తెలిసిందే.
‘నేను ఆందోళన చెందుతున్నా. ఎందుకంటే మా నాన్న వయసు 72 ఏళ్లు. మూత్రపిండాలు, గుండె, మధుమేహ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఆర్‌జేడీ అధినేత, మా నాన్నకు మరింత భద్రత అవసరం’ అని తేజస్వీ అన్నారు. ‘కేవలం కుటుంబాలు ఉన్నవారికి మాత్రమే నా బాధేంటో తెలుస్తుంది’ అని పేర్కొనడం గమనార్హం. తన తండ్రిని పెరోల్‌పై విడుదల చేయాలని అప్పీల్ చేశారు.