కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిరోజులుగా భగ్గుమంటున్న బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ల నుంచి సడలింపులు ప్రకటిస్తుండటంతో పసిడి ధరల జోరుకు బ్రేక్ పడింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 286 తగ్గి రూ 45,905 పలికింది. ఇక కిలో వెండి రూ 400 పతనమై రూ 41,558కి తగ్గింది. వివిధ కరెన్సీలతో డాలర్ మారకం విలువ పెరగడంతో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. పసిడి రికార్డు ధరలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కూడా బంగారం ధరల పతనానికి కారణమని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు. పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు చేపడుతున్న ఉద్దీపన ప్యాకేజ్లతో మదుపుదారులు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపడంతో హాట్ మెటల్స్‌కు ఆదరణ కొంతమేర తగ్గిందని భావిస్తున్నారు. బంగారం ధరల్లో మరికొన్ని రోజులు ఒడిదుడుకులు కొనసాగినా మున్ముదు బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
బంగారం ధర తగ్గింది
Related tags :