DailyDose

భారత్‌కు భారీ రుణం-వాణిజ్యం

భారత్‌కు భారీ రుణం-వాణిజ్యం

* కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న భారత్‌కు సహాయం చేసేందుకు ఏసియన్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) ముందుకొచ్చింది. దీనికోసం 150కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంతోపాటు, నివారణ చర్యలు, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాల కోసం భారత ప్రభుత్వం వీటిని ఖర్చుపెట్టనుంది.

* నిన్న ఫైనాన్స్‌ షేర్ల అండతో పరుగులు తీసిన సూచీలు నేడు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికి నష్టాల్లోకి జారుకున్నప్పటికీ తిరిగి పుంజుకున్నాయి. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 72 పాయింట్లు ఎగబాకి 31,815 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 9,306 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.55 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో ఒక్కో రాష్ట్రం క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తుండడం.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళిక అమలుకు సిద్ధం కావడం అక్కడి మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. చమురు ధరలు మరోసారి ఒడుదొడుకులను లోనయినా సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు.

* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి, స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.311.71 కోట్ల నికరలాభాన్ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నమోదు చేసింది. 2018-19 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.364.01 కోట్లతో పోలిస్తే ఈసారి 15 శాతం తగ్గింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.14,375.06 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.418.64 కోట్లకు పరిమితమైంది. కరోనా వైరస్‌ సంక్షోభం నేపథ్యంలో, పెట్టుబడులపై ఆదాయం రూ.10,229.92 కోట్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. అయితే నికర ప్రీమియం వసూళ్లు మాత్రం రూ.10,247.50 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.10,464.46 కోట్లకు చేరాయి.

* డీలర్‌ వద్దకు వెళ్లకుండానే కార్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించినట్లు హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. ‘హోండా ఫ్రం హోమ్‌’ కింద నచ్చిన కారును, డీలర్‌ను ఎంపిక చేసుకుని, కార్‌ను బుక్‌ చేసుకోవచ్చని వివరించింది. ఎక్కడి నుంచైనా 24 గంటల పాటు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని, త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లందరినీ దీనికి అనుసంధానిస్తామని ప్రకటించింది.

* కంపెనీలు తమ ఆదాయ పన్ను(ఐటీ) ఆడిట్‌ నివేదికలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), గార్‌ వివరాల నమోదుకు ప్రభుత్వం వరుసగా మూడోసారి గడువు పెంచింది. మార్చి 31, 2021 వరకు ఇందుకు సమయం ఇచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. అంటే అంత వరకు కంపెనీలు తమ జీఎస్‌టీ, జనరల్‌ యాంటీ అవాయిడెన్స్‌ రూల్స్‌(గార్‌) వివరాలను ఆదాయ పన్ను ఆడిట్‌ నివేదికలో పొందుపరచాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. రూ.కోటి అంత కంటే ఎక్కువ టర్నోవరు ఉన్న వ్యాపార కంపెనీలు, రూ.50 లక్షల కంటే ఎక్కువ స్థూల రశీదులు పొందే వృత్తి నిపుణులు పన్ను ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది.