Movies

సోనాలికి అలవాటేనంట

సోనాలికి అలవాటేనంట

‘‘లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులు నాకు కొత్తవేం కాదు’’ అంటున్నారు సోనాలీ బింద్రే. క్యాన్సర్‌తో పోరాడి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నారామె. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల గురించి సోనాలీ మాట్లాడుతూ – ‘‘క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నాలో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. ఇందుకోసం నేను ఆరోగ్యకరమైన ఫలాలు, కూరగాయలను తింటున్నాను. క్యాన్సర్‌కు చికిత్స తీసుకునే ప్రక్రియలో భాగంగా రెండేళ్ల క్రితం నేను క్వారంటైన్‌ తరహా పరిస్థితులనే ఎదుర్కొన్నాను.ఇప్పుడు కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా క్వారంటైన్‌లో ఉంటున్నాం. అందుకే ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిస్థితులకు, అప్పటి నా క్వారంటైన్‌కి నాకు పెద్ద తేడా కనిపించడం లేదు. కానీ ఆ సమయంలో నా యోగ క్షేమాల గురించి తెలుసుకోవడానికి నా స్నేహితులు, బంధువులు మా ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ‘మీరు బాగున్నారా’ అని ఫోన్‌ పలకరింపులే తప్ప వ్యక్తిగతంగా కలుసుకుని మంచీ చెడులు మాట్లాడుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.