Fashion

బంగారం లేని వివాహం ఉంటుందా?

బంగారం లేని వివాహం ఉంటుందా?

మరీచి, అత్రి, కశ్యపుడు తదాది నవబ్రహ్మలు ఓసారి తమ భార్యలను చూసి బాధపడ్డారు. ఆ పడతుల రూపలావణ్యాలకు తగ్గట్టు అలంకరణ సామగ్రి ఏదీ లేకపోయిందే అని ఉద్విగ్నతకు గురయ్యారు. అదే ఆలోచనతో తాము పూజించే పంచాగ్నులను తీక్షణంగా చూశారు. ఆ వాడి చూపులకు అగ్నిదేవుడు భయపడి చెమటలు కక్కాడు. ఆయన తేజం ఆ చెమటచుక్కల రూపంలో నేలను తాకి బంగారమైందని ఓ గాథ! అలా అతివల కోసమే పుట్టిన పుత్తడి చుట్టూ అల్లుకున్న పద్యాలు, పాటలెన్నో! ఆ అపరంజి అక్షరాల వెలుగుజిలుగులివి..!
**అమ్మాయి అచ్చు కుందనపు బొమ్మ.. పసిడి పరువాల మొలక.. పుత్తడి బొమ్మ.. అంటూ కాంతకు కనకానికీ ఏనాడో జోడి కట్టేశారు మన కవులు. కానీ ఈ బంగారం కేవలం బొమ్మలకు పర్యాయపదం కాదు అంటూ, ‘‘అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే’’ అంటూ దేవుణ్ని కీర్తించిన ఘనత వేటూరి సుందర్రామ్మూర్తిది. ప్రబంధ సాహిత్యంలో, ఆధునిక కవిత్వంలో, సినీ గేయాల్లో ఈ పసిడి ప్రస్తావన ఎక్కువగా వచ్చిన సందర్భాల్లో వివాహ వేడుకలు, వైభోగాలు ఒక వైపు అయితే, పడతి సొగసులు వర్ణించేందుకు, పుత్తడిని కవితా వస్తువుగా కవులు ఎంచుకోవటం మరో కోణం. ‘మను చరిత్ర’లో మనోరమ, స్వారోచిషుల వివాహ వైభవాన్ని వర్ణించిన అల్లసాని, నూతన వధూవరులకు దేవతలు కట్నాలు చదివించే సందర్భంలో ‘‘చీరలున్‌ హార విభూషణావళియు.. నమ్మిథునంబు నకుం ప్రియంబుతో జదివించె…’’ అంటూ నలకుబేరుడితో కనకాభరణాలను కానుకలుగా అందజేయించారు. అందుకే ఆంధ్రకవితా పితామహుడి జిగి బిగి అల్లికలను మెచ్చిన ప్రభువులు కృష్ణదేవరాయలు కూడా ఆయనకు ‘కనకాభిషేకం’ జరిపించి బంగారానికి కొత్త వన్నె తెచ్చారు. అదే రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరైన నంది తిమ్మన ముద్దు పలుకులలో సైతం ఈ పసిడి ప్రస్తావన వచ్చింది. ఆయన రచించిన ‘పారిజాతాపహరణం’ కావ్యంలో నారదుడు సత్యభామకు పుణ్యక వ్రతోపదేశం చేస్తూ ‘‘ధన కనక వస్తు సమితియు తనయసమృద్ధి కల్గి తాను పతియు అరకొర లెరుగక’’ అని, స్వర్ణానికి దాంపత్య సౌభాగ్యంలో భాగమున్న మాట సెలవిచ్చారు. అయితే ఒకప్పుడు బంగారం అనేది కేవలం ఆభరణాల రూపంలో అలంకరణ వస్తువుగానే కాకుండా, నాణేల రూపంలో అందరి వాడుకలోనే ఉండేది. అందుకనే ఆ సిరులను పేద బ్రాహ్మణుడికి కూడా అందివ్వమంటూ శ్రీమహాలక్ష్మిని కనకధారా స్తవంతో శంకరాచార్యులు స్తుతించిన వేళ, కురిసిన కనక వృష్టి గురించి తెలిసిందే!

పసిడి వర్ణం, బంగారు సొగసు, స్వర్ణ కాంతి.. ఇవన్నీ స్త్రీ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకు కవులు వాడిన విశేషణాలు. కానీ వీటితో భువన మోహనుడైన శ్రీరాముని వర్ణించే సందర్భాలు ఎన్నో కీర్తనల్లో కనిపిస్తాయి. ‘‘కన కన రుచిరా కనకవసన నిను’ అంటూ పట్టుపుట్టం ధరించిన ఆ శ్రీరామచంద్రమూర్తిని సాక్షాత్కరింపజేశారు త్యాగరాజస్వామి. ఆ జగన్మోహనాకారునికి ‘‘గంధము పూయరుగా.. పన్నీటి గంధము పూయరుగా.. చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా’’ అంటూ అభిషేకాలంకరణ సేవలో పుత్తడిని చేర్చారు.

**భారతీయ సంప్రదాయ వివాహంలో వేడుకలెన్నో. అందులో పెళ్లి వారి సందడి అంతా ఇంతా కాదు. ఆ వైభోగాన్ని మరింత ద్విగుణీకృతం చేసేవే పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు. ఆ కళకళలని కళ్లకు కట్టినట్టు చూపించిన సినీగేయాలు ఎన్నెన్నో! ‘‘దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండి..’’ అంటూ పెళ్లివారికి ఎదురుసన్నాహంలో నానా హడావుడీ చేశారు ‘మాయాబజార్‌’లోని పెళ్లివారు. ‘‘కిరీటాలు.. వజ్ర కిరీటాలు.. హారాలు… మణిహారాలు’’ అంటూ విడిదికి విచ్చేసిన అతిథులకు అన్ని మాయలు చేసి చూపించింది ఆనాటి పింగళి కలం అయితే, ‘‘అయిదు రోజుల పెళ్లి అమ్మణ్ని పెళ్లి- తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి’’ అంటూ ‘‘నగలకు కందే మగువల మెడలు పడచు కళ్లకే గుండెల దడలు’’ అంటూ పెళ్లి వేడుకల్లో ఆడవాళ్ల మెడల్లో ఉండే బంగారు ధగధగలను ఘనంగా వర్ణించారు ఈనాటి కవులు. వివాహవేడుకలతో బాటు పెళ్లికూతురు అలంకరణలో కూడా స్వర్ణాభరణాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ‘‘పిడికిటి తలంబ్రాల పెళ్లికూతురు.. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లికూతురు’’ అంటూ నూతన వధువు సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అన్నమయ్య శృంగార కీర్తన ఈ కోవలోదే. ఇక నిత్యకల్యాణోత్సవం జరుపుకునే దంపతులు ఆ సీతారాములకు, వారి పరివారానికి చేయించిన ఆభరణాలను రామదాసు వర్ణించాడు. ‘‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా’’.. అంటూనే భరతుడి పచ్చల పతాకాన్ని, శత్రుఘ్నుల బంగారు మొలతాడుని, లక్ష్మణ స్వామి ముత్యాల పతకాన్నీ ప్రస్తావించారు. ఆ సొమ్ములు చేయించినందుకు తాను తన్నులు తినాల్సి వచ్చిందంటూ ‘‘ఆ దెబ్బల కోర్వక అబ్బా అంటిని’’ అని మొరపెట్టుకున్న రామదాసు కన్నీరుపెట్టిస్తాడు. కొంగుబంగారం గురజాడ ‘కన్యాశుల్కం’లో కట్నంగా ఇచ్చుకునేందుకు రొక్కం లేకపోయినా, ఆభరణంగా మధురవాణి ‘కంటె’ను చదివించి పెళ్లి చేసుకున్న లుబ్ధావధానులను ఎలా మరచిపోగలం? అందుకే ఈనాటికీ ఆ మధురవాణి కంఠాభరణం ‘కంటె’కి బంగారు ఆభరణాల్లో ఓ ప్రత్యేక స్థానం. ఇక పెళ్లిళ్లలో పెళ్లికూతురుకి పెట్టే నగల గురించి కూడా చెప్పుకోవాలి. ‘‘చెల్లాయి పెళ్లి కూతురాయెనే’’ అని మురిసే అన్నయ్య.. మనసులో ఆ చెల్లి ‘‘బంగారు గాజులు తొడుగుకొని- సిగలో అందాల జాజులు తురుముకొని పెళ్లి పీటలపై కూర్చుని’’ సిగ్గులు చిందించటం ఊహించుకుని ఆనందపడ్డాడు. తన చెల్లెలు ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ అనిపించుకోవాలని ఎంత కష్టమైనా ఓర్చాడు. ‘‘అయినా పొలాలు అమ్మకుండా, బంగారం కొనకుండా పెళ్లిళ్లు అవుతాయంటే’’ అంటూ ఒక్క వాక్యంతో మన వివాహ సంబరాలకూ, ధర అంబరాన్ని అంటుతున్నా ‘‘సరే’’ అని కొనుక్కునే బంగారానికి ముడిపెట్టాడు దర్శక రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. అయితే అరణంగా, భరణంగా ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయంలోని కాంచనాన్ని, రసాభరణంగా మలచటం మన కవులకే చెల్లింది. ‘‘రతిగృహ జఘనే విపుల పఘనే మనసిజ కనకాసనే- రమతి మురారి’’ అంటూ అష్టపదుల్లోని శృంగార వర్ణనల్లో నాయికా జఘనాన్ని మన్మథుడి బంగారు సింహాసనంతో పోల్చాడు జయదేవుడు. ఇక గురుదేవుడు రవీంద్రుడి సమర్పణ- గీతాంజలిని తెలుగీకరించిన గుడిపాటి వెంకటాచలం ‘‘హేమ కలశంలోని శీతల కాంతి సుధని నింపుకుని’’ అంటూ సంధ్యావర్ణనతో బాటు స్వర్ణధారలు కురిసే ఆకాశాన్ని కూడా వర్ణించారు. ‘శుభసంకల్పం’ చిత్రంలో ‘‘దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి.. కొండంతా అండల్లే కొలువైన మారేడు కొంగు బంగారయినాడు’’ అంటూ దయగల రాజుల ఏలిక, చెంగున కట్టుకున్న బంగారంలా సౌభాగ్యం అని చెప్పారు సిరివెన్నెల. ఇలా పసిడి పోకడల గురించిన రకరకాల ప్రస్తావనలు ఉదాహరణలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలు. ‘‘రాయలు ఏలిన సీమ.. రతనాల సీమ’’ అంటూ ప్రభువుల ఏలికలో మన్ను మాణిక్యం అవుతుంది అన్న మాటకి ఊతాన్నిస్తూ.. ‘‘అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమేలే’’ అంటూ అపరంజి బొమ్మకు పరుసవేది లక్షణాన్ని కూడా జోడించారు కవి రాజశ్రీ. మరి అలాంటి అమ్మడిని లొంగదీసుకోవడానికి ‘‘వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి- వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్లకి, మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి- ముత్యాల బేసరి వేస్తా కోపాలు కొమ్మకి’’ అంటూ అబ్బాయి ఆశ చూపితే నిలువెత్తు బంగారాన్ని నేను, ‘‘వాహనాల మణి భూషణాల భువనాల నేను నిను కోరితినా’’ అంటూ స్వర్ణాన్ని తృణీకరించిన స్వాతిశయం ఉన్న నాయికలు కూడా సినీ సాహిత్యంలో ఉన్నారు. కనకమహాలక్ష్మికి కోటిదండాలు సొగసు విషయంలో ఎంతో పొగరుగా వుండే వనితకు, ఆ బంగారం తన వద్ద లేకుండా పక్కింటి వాళ్ల ఇంటిలోనో, ఒంటి పైనో ఉండటం కించిత్‌ అసూయ కలిగిస్తోందేమో! దాన్ని రుచి చూపించిన పాట ‘‘పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు- ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు’’! ఆడవారి దృష్టిలో బంగారం వైభవానికి పర్యాయపదం అని ఈ గీతంతో చెప్పకనే చెప్పారు కవి జొన్నవిత్తుల. భామినులకు బంగారం మీద మిక్కిలి మోజు అన్న మాట నిజమేనేమో అనిపించేలా రేవతీ దేవి పాత్రని చూపించింది ‘మాయాబజార్‌’లోని ప్రియదర్శిని. కానీ మగవారి విషయంలో మాత్రం కాంచనాన్ని త్యజించడం మాకు అట్టే పెద్ద కష్టమైన పని కాదని చెప్పేవి దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నాయకుడి పలుకులు. ‘‘నాకు మరణ భయంబు లేదు’’ అంటూనే.. ‘‘సర సర హేమ నిష్కముల సంచులు ముందఱ విప్పి పోసెదన్‌’’ అని, ‘‘మరణ భయంబు అణుమాత్రము లే, జీవన సంభరణ భయంబే ఎక్కువ’’ని కనకం మీద మగవారి శీతకన్నును చక్కగా ఉదహరించారు. అలాగే, ‘‘ఏడాది పొడవునా ఈ దేవుల హుండీలో పడే ధగ ధగ బంగారమంతా కలిపినా, ఒక పొద్దున్న ఓ గట్టున, ఒక మొక్కకు పూసిన ఒక్క బంతి పూవు తుల తూగలేదు’’ అంటూ ‘వసుమతి’లో పసిడి కన్నా కుసుమానికి, ప్రకృతికి పెద్దపీట వేశారు ‘బంతిపూలు’ కవితలో దేవిప్రియ. ‘అమృతం కురిసిన రాత్రి’లో తిలక్‌ ‘‘సువర్ణం కన్నా అగ్ర వర్ణం లేదు’ అంటూ బంగారానికి ఉన్న పోకడని కాస్త ఘాటుగా చెప్పారు ‘‘సొగసు కీల్జెడ దాన సోగ కన్నుల దాన- వజ్రాల వంటి పలువరుస దాన- బంగారు బిగి దాన- మేలిమి పసిడి రవ కడియాల దానా…మించి పోనేల రత్నాల మించు దానా- తిరిగి చూడవే ముత్యాల సరుల దానా’’ అంటూ పడతి అందానికి పసిడి హంగులద్ది శ్రీనాథుడు చాటువుగా చెప్పిన రసగుళిక ఇది. ఇందులో భామా కలాపానికి హేమ విలాసానికి జట్టు కట్టాడు కవి సార్వభౌముడు. అందుకే, ఎవరేమనుకున్నా, కాంతకు కాంచనానికి ఓ అపురూప సంబంధం. పైగా ఆడవారి అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్నీ కాపాడేందుకు మన పూర్వికులు ఏడువారాల నగలను వారి ఐశ్వర్యాల్లో చేర్చారు.