Food

భారత్‌లో కరువు లేదు

India Has No Scarcity Of Food. India Is Food Secure.

కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న తరుణంలో పెద్దఎత్తున ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం భారతదేశానికి పెద్ద ఊరటగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప కాలంలో ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడుతుందని, అది మరింత విపత్తుగా మారతుందని కరోనా బాధిత దేశాలు ఆందోళనలో పడిపోయాయి. అయితే మన దేశానికి మాత్రం రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రాల్లో భారీగా ఆహార ఉత్పత్తులు పెరిగాయి. దీంతో అనేక రాష్ట్రాలు వాటికి అవసరమైన ధాన్యాన్ని తీసుకుని మిగిలిన మొత్తాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు పంపుతున్నాయి. ఎక్కువ రాష్ట్రాలు మిగులు ఉత్పత్తి చేస్తుండటం వల్ల ఎఫ్‌సీఐ కూడా తక్కువ మొత్తంలోనే ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలను రాష్ట్రాలకు పంపుతోంది. మార్చి 1 నాటికి ఉన్న వివరాల ప్రకారం ఎఫ్‌సీఐ దగ్గర 309 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం, 275 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమ నిల్వలు ఉన్నాయి. అంటే మొత్తం 5.84 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఎఫ్‌సీఐ వద్ద నిల్వ ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వద్ద సొంత నిల్వలు ఉన్నాయి. దేశంలో పంజాబ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు గోధుమలను పెద్దమొత్తంలో పండిస్తున్నాయి. అలాగే పంజాబ్‌, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛసగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు భారీగా వరి పండిస్తున్నాయి. దానివల్ల బియ్యం నిల్వలకు కూడా ఢోకా లేకుండా పోయింది. మరీ పంటలు తక్కువ ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలు తప్ప ఎఫ్‌సీఐ నుంచి ఆహార ధాన్యాలను ఇతర రాష్ట్రాలు తీసుకోవడం లేదు. దీంతో ఎఫ్‌సీఐ వద్ద కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ నిల్వలే దేశానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లాక్‌డౌన్‌ కాలం మళ్లీ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దానివల్ల దేశంలో ఆహార ఉత్పత్తులు తగ్గి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ సమయంలో భారీగా పేరుకుపోయిన నిల్వలను దేశం సమర్థంగా వినియోగించే వెసులుబాటు కలగనుంది. ఎఫ్‌సీఐ వద్ద ఉన్న 5.84 కోట్ల మెట్రిక్‌ టన్నుల నిల్వలు కనీసం రెండేళ్ల పాటు దేశం మొత్తం పంపిణీ చేయవచ్చని, ఆహార కొరతకి అవకాశమే ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆహార ధాన్యాల నిల్వలకు ఏమాత్రం కొరతలేదు. తెలంగాణలో ప్రస్తుత యాసంగిలో 39.24 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. గడిచిన వానాకాలం సీజన్‌లో 31.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అప్పుడు 95 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట వచ్చింది. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఈ ఒక్క సంవత్సరం పండించిన ధాన్యంతో ఎఫ్‌సీఐకి ఇచ్చేవి పోగా కనీసం నాలుగేండ్ల ఆహార అవసరాలు తీరిపోతాయి. ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ, రైస్‌ మిల్లర్లు, వ్యాపారుల దగ్గర నిల్వ చేసిన పాత బియ్యం కూడా లక్షల టన్నుల్లో ఉన్నాయి. రైతులైతే కనీసం ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు ఉంచుతారు. వరి కాకుండా మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, అరికెలు, సామలు, కందులు, వేరుశనగ, మినుములు, నువ్వులు, పెసర్లు, శనగలు, సోయాబీన్‌ తదితర పంటలు మరో 25 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏపీలో ఈ ఏడాది ఖఫలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. రబీలో 20 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తాయని అంచనా. వెరసి మొత్తం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఈ ఏడాది సేకరణలో వస్తుంది. వాటిలో 67 శాతం బియ్యం పౌర సరఫరాల శాఖకు వస్తాయి. అంటే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి.