NRI-NRT

రెండున్నర లక్షల H1Bల మీద వేలాడుతున్న కత్తి

Lakhs Of H1Bs In Deep Trouble Due To LockDown And COVID19

క‌రోనాతో అమెరికా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ది. ఆ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కేందుకు ఇమ్మిగ్రేష‌న్ ఆరు నెల‌ల పాటు నిలిపివేస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో అమెరికాలో హెచ్‌1బీ వీసాతో ప‌నిచేస్తున్న వారికి ఇప్పుడు క‌ష్టాలు మొద‌లుకానున్నాయి. వారంతా త‌మ లీగ‌ల్ స్టాట‌స్ కోల్పోయే ప్ర‌మాదం ఉన్న‌ది. ప్ర‌స్తుతం సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. దాంట్లో హెచ్‌1బీ వీసా ఉన్న‌వాళ్లు సుమారు రెండు ల‌క్ష‌ల మంది ఉంటారు. అయితే జూన్ చివ‌రిలోగా ఆ వీసాదారులంతా త‌మ న్యాయ‌ప‌ర‌మైన హోదాను కోల్పోనున్న‌ట్లు ఇమ్మిగ్రేష‌న్ పాల‌సీ విశ్లేష‌కుడు జెరిమీ నీఫెల్డ్ తెలిపారు. రెసిడెన్షియ‌ల్ స్టాట‌స్ కోసం ప్ర‌య‌త్నించని వారు కూడా తిరిగి త‌మ స్వ‌దేశాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హెచ్‌1బీ వీసాల్లో.. మూడ‌వ వంతు టెక్నాల‌జీ రంగాల‌కు మాత్ర‌మే జారీ చేశారు. హెచ్‌1బీ వీసా ఉండి ఉద్యోగం కోల్పోయిన వారి ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారుతుంది. కొత్త ఉద్యోగం వెతికేందుకు వారికి 60 రోజుల స‌మ‌యం ఉంటుంది. ఒక‌వేళ జాబ్‌కు ఢోకాలేకున్నా.. కోవిడ్ నేప‌థ్యంలో వారి వీసాలు రెన్యూవ‌ల్ అవ‌డం అనుమానంగానే ఉన్న‌ది. వీసా సంక్షోభం వ‌ల్ల తీవ్ర మాన‌వ‌, ఆర్థిక బీభ‌త్సాన్ని సృష్టిస్తున్న‌ట్లు ఓ ఇమ్మిగ్రేష‌న్ సంస్థ ఓన‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.