Business

డబ్బుల కోసం రిలయన్స్ వెదుకులాట-వాణిజ్యం

Reliance RIL In Search Of Money-Telugu Business News Roundup Today

* దేశంలోని తొమ్మిది సర్కిళ్లలో 5జీ నెట్‌వర్క్‌ సేవల విస్తరణ నిమిత్తం నోకియాకు రూ.7,500 కోట్ల విలువైన కాంట్రాక్టును భారతీ ఎయిర్‌టెల్‌ అప్పగించింది. ప్రతిపాదిత కాంట్రాక్టులో భాగంగా 4జీ సేవల బేస్‌ స్టేషన్లను 3 లక్షల వరకు నోకియా ఏర్పాటు చేస్తుందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 5జీ సేవల స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి వచ్చాక వీటిని 5జీ నెట్‌వర్క్‌కు మారుస్తుందని పేర్కొంది. ‘ఈ ఒప్పందం భవిష్యత్‌లో 5జీ సేవల అనుసంధానతకు పునాదిరాయి అవుతుంది. 900 మెగాహెర్ట్జ్‌, 1800 మెగాహెర్ట్జ్‌, 2100 మెగాహెర్ట్జ్‌, 2300 మెగాహెర్ట్జ్‌ ఇలా.. వివిధ స్పెక్ట్రమ్‌ బ్యాండ్లలో సుమారు 3,00,000 వరకు రేడియో యూనిట్లు ఏర్పాటవుతాయి. ఈ ప్రక్రియ 2022 కల్లా పూర్తయ్యే అవకాశం ఉంద’ని భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ‘టెలికాం సేవలపరంగా మా వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలన్నది మా సంకల్పం. అందుకే కొత్త నెట్‌వర్క్‌ సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతుంటాం. నోకియాతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఇందులో భాగమేన’ని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

* ఎయిరిండియాలో వాటా విక్రయ నిమిత్తం చేపట్టిన బిడ్‌ల దాఖలు ప్రక్రియకు గడువు తేదీని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. జూన్‌ 30 వరకు బిడ్‌లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. బిడ్‌ల దాఖలుకు గడువు తేదీని ప్రభుత్వం పొడిగించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 27న ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను ప్రారంభిస్తూ.. ఆసక్తి ఉన్న కొనుగోలుదార్లు బిడ్‌లు దాఖలు చేసేందుకు మార్చి 18 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆ తేదీని ఏప్రిల్‌ 30కి పొడిగించింది. ఇప్పుడు జూన్‌ 30 వరకు అవకాశం కల్పిస్తూ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం నిర్ణయం తీసుకుంది.

* కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఉద్యోగులు పీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ), ప్రైవేట్‌ పీఎఫ్‌ ట్రస్టీలకు చెందిన దాదాపు 8.2 లక్షల మంది ఉద్యోగులు రూ.3,243.17 కోట్లు వెనక్కి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం గత నెలలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను (పీఎంజీకేవై) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగులు 3 నెలల వేతనాన్ని (బేసిక్‌+డీఏ) లేదా పీఎఫ్‌ మొత్తంలో 75 శాతం వరకు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించింది. ఈపీఎఫ్‌ఓ ఇప్పటివరకు 12.91 లక్షల క్లెయిమ్‌లను సెటిల్‌ చేసిందని.. ఇందులో పీఎంజీకేవై కింద 7.40 లక్షల కొవిడ్‌-19 క్లెయిమ్‌లు ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది. మొత్తం రూ.4,684.52 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించామని, ఇందులో కొవిడ్‌-19 క్లెయిమ్‌లు రూ.2,367.65 కోట్లు ఉన్నాయని వెల్లడించింది .

* రుణ రహిత సంస్థగా మారాలనే లక్ష్యంతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నిధుల వేటకు సిద్ధమవుతోంది. రైట్స్‌ ఇష్యూకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రేపు (30న) జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. ‘మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, త్రైమాసికానికి ఆర్థిక ఫలితాల పరిశీలన, ఆమోదం నిమిత్తం ఏప్రిల్‌ 30న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. అదే సమావేశంలో తుది డివిడెండును బోర్డు సిఫారసు చేస్తుంది. దీంతో పాటు నిర్దేశిత నియంత్రణ సంస్థల అనుమతులు, చట్టాలకు లోబడి ప్రస్తుత వాటాదార్లకు రైట్స్‌ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను జారీ చేసే ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తుంద’ని ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. అయితే రైట్‌్్స ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. కాగా.. చివరిసారి ఆర్‌ఐఎల్‌ 1991లో నిధుల సమీకరణకు వెళ్లింది. ఆ సమయంలో ఒక్కోటి రూ.55 విలువైన ఈక్విటీ షేర్లుగా మార్చుకునే డిబెంచర్లను జారీ చేసింది. 2021 కల్లా రుణ రహిత కంపెనీగా ఆర్‌ఐఎల్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతేడాది ఆగస్టులో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. రైట్స్‌ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటాను ఆర్‌ఐఎల్‌ తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.