* వలస కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే చిక్కుకు పోయారు. దీంతో కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. తమను సొంతూళ్లకు పంపాల్సిందే నంటూ ఆందోళనకు దిగారు. అక్కడి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది.
* లాక్‌డౌన్ కొనసాగింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మే 3వ తేదీ తర్వాత మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. బుధవారం దేశంలోని తాజా పరిస్థితిపైనా, లాక్ డౌన్ కొనసాగింపుపైనా, కరోనా వైరస్ నియంత్రణ చర్యలపైనా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో అనేక ఇబ్బందులు తలెత్తి నప్పటికీ ప్రజలందరి ప్రాణాలు కాపాడుకోవాలంటే, దేశాన్ని పరిరక్షించుకోవాలి అంటే లాక్ డౌన్ కొనసాగింపు ఒక్కటే మార్గమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆయన తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగింపునకు మొగ్గు చూపుతున్నాయని, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు.
* రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
* లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి అదనపు గైడ్‌లైన్స్ విడుదల చేసిన ఏపీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం :
►వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు
►ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు
►ఆర్థిక రంగానికి మినహాయింపు
►గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి
►కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి
►వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి
►కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు
►వలస కార్మికులు లాక్‌డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి
►బుక్స్ షాపు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు
►ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
►మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి
* కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి విద్యుత్ ఉద్యోగులు తమ వంతు విరాళం అందజేశారు. కరోనా నివారణ చర్యల కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి తమ ఒకరోజు వేతనాన్ని ఇచ్చారు. దాదాపు 70 వేల మంది జెన్‌కో, ట్రాన్స్‌కో, ఉత్తర, దక్షిణ డిస్కం ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి రూ. 11.4కోట్లు విరాళంగా అందజేశారు. ఈ విరాళం చెక్కులను జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేశారు.
* భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. గడిచిన 24గంటల్లోనే 1813 కొత్త కేసులు.. 71 మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 31,787 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 7797 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1008 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 9318 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1388 మంది కోలుకోగా, 400 మంది మృత్యువాతపడ్డారు.
* కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం వైరస్ సోకిన వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు, ఐసోలేషన్‌కు తరలిస్తుంది. అయితే కొందరు మాత్రం ఆయా కేంద్రాల్లో ఉండలేక తప్పించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సరైన సదుపాయాలు లేవని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రం నుంచి వ్యక్తి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.