✍️ఆధార్ అప్డేట్ కు గ్రీన్ సిగ్నల్..తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు…
♦️న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అప్డేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సుమారు 20వేల కామన్ సర్వీస్ సెంటర్లకు (సీఎస్సీ) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) అనుమతులు ఇచ్చింది. ఈ సీఎస్సీలు బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా పని చేస్తాయని స్పష్టం చేసింది.
♦️అయితే ఇవి షరతులతో కూడిన అనుమతులేనని పేర్కొంటూ ఈ నెల 24వ తేదీన సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ సీఈఓ దినేశ్ త్యాగికి ఉడాయ్ లేఖ రాసింది. కేవలం జనాభాకు సంబంధించిన వివరాలకే అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది.
♦️వేలిముద్రలు, ఐరిస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో ఆపరేటర్లు, నివాసితుల ప్రమాణీకరణ జరుగుతుందని ఆధార్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌కల్లా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
♦️సంతానం, చిరునామాలోని మార్పులు, తదితర బయోమెట్రిక్ వివరాలను సీఎస్సీలు అప్డేట్ చేస్తాయి. ఫ్రెష్ ఆధార్ నంబర్ రిజిస్ట్రేషన్లు కూడా సీఎస్సీలు చేపడతాయి.
♦️గ్రామీణులకు ఈ సదుపాయం అధికంగా ఉపయోగపడుతుందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఉడాయ్ నిబంధనలకు అనుగుణంగా, బాధ్యతాయుతంగా ఈ పని చేపట్టాలని సీఎస్సీ సభ్యులకు సూచించారు.
♦️ఈ మేరకు సీఎస్సీకి ఉడాయ్ అనుమతులిచ్చిన సంగతిని రవిశంకర్ ప్రసాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆధార్‌లో మార్పులు చేయడానికి జిల్లాస్థాయిలోని సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసులకు ఇప్పటికే ఉడాయ్ అనుమతిలిచ్చింది.
♦️గ్రామీణులకు సిటిజన్ సేవలందించేందుకు దేశవ్యాప్తంగా 2.74 లక్షల సీఎస్సీలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇంతకుముందు 2018 డిసెంబర్ నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్సీలు ఆధార్ అప్ డేట్ ప్రక్రియను నిలిపివేశాయి.