ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. విప్లవ గీతాలైనా…భావాత్మక గీతాలైనా..దేశభక్తి గీతాలైనా….ప్రణయ గీతాలైనా..విరహగీతాలైనా…విషాద గీతాలైనా…భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి అలవోకగా జాలువారుతాయి. తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవి. తెలుగు పాటకు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడు. విప్లవ కవిగా తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తునే… సినీ కవిగా తన రచనలతో ప్రేక్షకలపై పాటల జల్లులు కురిపించాడు. తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ. ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి కవితనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటూ సినీకవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహా ప్రస్థాన కవి. సమ సమాజ స్థాపన తన లక్ష్యం అంటూ తన కలంతో ప్రవచించిన ఆధునిక యుగ ప్రవక్త. ఆయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు జన్మించారు.
శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటి పేరు శ్రీరంగం గా మారింది. శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లో జరిగింది. 1931లో మద్రాసు యూనివర్సిటీలో బి.ఏ పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ఎవిఎస్ కాలేజీలో డిమాన్స్టేటరుగా చేరారు. 1938 లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలోను, నిజాం సంస్థానంలోను, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను సంకలనం చేసి ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించారు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ మహాప్రస్థానం మిగిలిపోయింది.
అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా… విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా…. సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ అనేక భూమికలు పోషించారు. సమరానికి నేడే ఆరంభం…ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు నేటికి తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తించుకోని తెలుగు వారుండరు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై అంటూ మదిలోని భావాలను మనుసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ.‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా! అంటూ సోమరి పోతులను జాగృతం చేసిన చైతన్య శీలి శ్రీశ్రీ. మాంగల్య బలంలోని ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ చందమామ పై రాసిన ఈ గీతం శ్రీశ్రీ కలం నుంచి జాలు వారిందే.
‘అల్లూరి సీతారామరాజు’లో చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యం లా నిలిచిపోయింది. ఈ మూవీలోని ఈగీతానికే తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేసాడు శ్రీశ్రీ.
తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచిని… ఈ మహా ప్రస్థానా కర్త 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. “వ్యక్తికి బహువచనం శక్తి” అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడంలో విజయం సాధించాడు శ్రీశ్రీ. ఆయన మన మధ్య లేక పోయిన ఆయన అందించిన సాహితి సౌరభాలు…విప్లవ రచనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ..సజీవంగానే ఉన్నాయి.