DailyDose

వడ్డీ లేకుండా అప్పులు-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Banks To Close 13 Days In May

* లాక్‌డౌన్ నిరంతరంగా కొనసాగించలేమ‌నీ.. దీన్ని ఎత్తివేసేందుకు భారత్ తెలివైన వ్యూహాలు రచించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో జరిపిన సంభాషణ సందర్భంగా ఆయన ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కల్లోలం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపైనే ఇద్దరి మధ్యా ప్రధానంగా చర్చ జరిగింది. పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడినందున భారత్‌లో వెంటనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. ప్రత్యేకించి దేశంలోని పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం అత్యవసరమన్నారు.

* కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్‌తో కొత్త లోన్స్ విషయం తర్వాత సంగతి.. ఉన్న లోన్లను కట్టే పరిస్థితే లేదు.. ఇక, ఆర్బీఐ కూడా.. వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది. అదంతా ఓవైపు అయితే.. లాక్‌డౌన్‌ తర్వాత కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది.. ఇదే సమయంలో.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. భారత్‌లో ‘అమెజాన్ పే లేటర్’ క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించిన అమెజాన్.. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇది వర్తించనుంది. అంటే.. ఎంపికచేసిన ప్రొడక్ట్స్‌కు డబ్బులు లేకపోయినా ‘అమెజాన్ పే లేటర్’ ద్వారా వస్తువులు కొని… గడువులోగా ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక, ఇది కుదరకపోతే ఈఎంఐగా మలచుకునే అవకాశం కూడా ఉంది.. 12 నెలల వరకు ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. అయితే, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మొత్తానికి అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించుకునే అవకాశం ఉండగా.. నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.60,000 వరకు అప్పు ఇస్తోంది అమెజాన్. మీరు ఈ సర్వీసును ఉపయోగించుకోవాలనుకుంటే అమెజాన్ ఇండియా యాప్‌లో మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి.. మరో వైపు దేశవ్యాప్త లాక్ డౌన్.. ఈ రెండు వెరిసి ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కష్టకాలంలో బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇది ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. మరోవైపు కరోనా కాలంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి వచ్చే నెలలో బ్యాంకు సెలవు దినాలు తెలుసుకుని మీ పనికి ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కబెట్టుకోండి. అంతేకాక లాక్ డౌన్ నడిస్తోంది కాబట్టి మొదటి 14 రోజులు బ్యాంకు పనులు కాస్త మందగించే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకులు కేవలం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి.

* కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తనకు వార్షిక పారితోషికంగా వచ్చే రూ.15కోట్లను పూర్తిగా వదులుకోనున్నారు. వార్షిక వేతనం రూ.15లక్షలు కన్నా తక్కువ ఉన్నవారికి కోతలు ఉండవని స్పష్టంచేసింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50శాతం కోత విధించనుంది.

* కరోనాతో తీవ్ర ప్రభావానికి లోనైన ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిచ్చే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరిన్ని విదేశీ పెట్టుబడును ఆకర్షించే వ్యూహంతో పాటు స్థానిక పెట్టుబడుల ప్రోత్సాహంపైనా ఈ సమావేశంలో చర్చించారు. పెట్టుబడిదారుల ఆకర్షణ, సమస్యల పరిశీలనకు ప్రత్యేక విధానం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.