DailyDose

వనస్థలిపురంలో వృద్ధుడి మృతి-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona News Bulletin Today-Old Man Dies In Vanasthalipuram

* కేరళ రాష్ట్రంలోని ప్రజలకు రేషన్ షాపులో 17 రకాల సరుకులను ఉచితంగా ఇళ్ళవద్దకే అందిస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కల్పిస్తున్న బ్యాగ్ పై ఎలాంటి స్టిక్కర్ గాని ఫోటోలు గాని ఉండకపోవడం విశేషం.

* లాక్‌డౌన్ నిరంతరంగా కొనసాగించలేమ‌నీ.. దీన్ని ఎత్తివేసేందుకు భారత్ తెలివైన వ్యూహాలు రచించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో జరిపిన సంభాషణ సందర్భంగా ఆయన ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కల్లోలం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపైనే ఇద్దరి మధ్యా ప్రధానంగా చర్చ జరిగింది. పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడినందున భారత్‌లో వెంటనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. ప్రత్యేకించి దేశంలోని పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం అత్యవసరమన్నారు.

* తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఢిల్లీ పోలీసులు గురువారం నాల్గవసారి నోటీసులు జారీ చేశారు. మౌలానా సాద్ ప్రభుత్వ లాబోరేటరీకి వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవడంతోపాటు దర్యాప్తునకు హాజరు కావాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు గతంలో మూడు నోటీసులు జారీ చేశారు. అయితే మౌలానా సాద్ మాత్రం కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రభుత్వ లాబోరేటరీకి రాకపోగా, పోలీసుల దర్యాప్తునకు హాజరుకాలేదు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు 4వసారి గురువారం మరో నోటీసు జారీ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యారని మౌలానా సాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

* భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 1823 కేసులు; 67 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 33,610 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1075 మంది ప్రాణాలు కోల్పోగా.. 8373 మంది కోలుకొన్నారు. దేశంలో రికవరీ రేటు 25శాతానికి పైగా నమోదైంది.

* ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం 9:00 గంటల నుంచి గురువారం ఉదయం 9:00 గంటల వరకు) 71 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరుకుంది.

* కోవిడ్-19 చికిత్సలో సెప్సివాక్ ఉపయోగంపై ప్రయోగాలు ప్రారంభమైనట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)కు చెందిన డాక్టర్ రామ్ విశ్వకర్మ బుధవారం తెలిపారు. ఈ ప్రయోగాల నిర్వహణకు ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించని వ్యక్తులపై ఈ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ రామ్ తెలిపారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించనివారికి ఈ మందును వ్యాక్సిన్‌గా ఇస్తామన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, ఈ మందు చికిత్సకు అందుబాటులోకి రావడానికి కనీసం మూడు నెలలు పడుతుందన్నారు.

* మూతపడిన కాలేజ్‌లు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనే ఉత్కంఠకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెరదించింది. కళాశాలల పునఃప్రారంభంపై బుధవారం కీలక ప్రకటన వెల్లడించింది. కరోనా మహమ్మారితో మూతపడిన కాలేజ్‌లు ఆగస్ట్‌లో తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

* పంజాబ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా ఇవాళ ఒక్కరోజే 105 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 480కి చేరింది. ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న 167 మంది సిక్కు యాత్రికులు తప్పించుకోవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా ఇటీవలే మహారాష్ట్రలోని నాందేడ్‌ వెళ్లి వచ్చారు. దీంతో తరణ్‌ తరణ్ పట్టణంలో క్వారంటైన్‌ చేశారు.

* వనస్థలిపురంలో కరోనా వైరస్‌ సోకి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో భీంనాయక్‌ తెలిపారు. వృద్ధుడి రెండో కుమారుడికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు.