Politics

కరోనా నివారణ సూచనలు చేసిన జగన్

AP CM YS Jagan Sends Notes To Prevent Corona To Officials

కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం సహా పలు అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుకు సూచించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, అలాంటి వారిని హోం క్వారంటైన్‌ విధించాలని అన్నారు. ఇక, గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చెక్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని సీఎం ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ 19 పరీక్షలు జరగగా నిన్న ఒక్కరోజే 7902 మందికి పరీక్షలు చేశారు. ప్రతి మిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు ఉన్నాయి. 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32వేల 792 మందిలో 17,585 మందికి పరీక్షలు జరిగాయని మిగిలిన వారికి 23 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్టు చెప్పారు. అయితే వీరికి వెంటనే పరీక్షలు చేసి… లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక, టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం… భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువగా ఉండేలా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.