సంగీతానికి స్పందింపచేసే గుణం మాత్రమే కాదు ప్రశాంతతను ఇచ్చే శక్తి కూడా ఉంది. ఒక పది నిమిషాలు మనసును సంగీతంలో లయం చేస్తే ఆందోళన తొలగిపోతుంది. లాక్‌డౌన్ వేళ సంగీతం ఒక మంచి ఊరట. మన శాస్త్రీయ సంగీతంలో కొన్ని రాగాలు మనసుకు దివ్యౌషధాలు. వీలైతే ఈ రాగాలను నిత్యం వినే ప్రయత్నం చేయండి. అలజడులు మీ చెంతకు చెరకుండా చూసుకోండి.
*మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇటువంటి సమయంలో సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం.
*సామ రాగం
ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా ‘శంకరాభరణం’లోని సదాశివబ్రహ్మం ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే.
*మలయమారుతం
ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనోహ్లాదం కల్గించమని రాముని నుతించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాలజంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు.
*మోహన రాగం
‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాలించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’.
*హిందోళ
ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే.
*వలజి
ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా’ పాట ఉంది. ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాట ఈ రాగంలో స్వరపరిచినదే.
*మధ్యమావతి
ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ,.. లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు.
లాక్‌డౌన్‌లో హాయి కలిగించే సంగీతం
Related tags :