DailyDose

ఇక విమానాల్లో ఒక సీటుకు డబుల్ ఛార్జీ-వాణిజ్యం

Indian Airline Operators To Double Charge Passengers

* ప్రయాణికులకు ఇక విమానం మోత మోగనుంది. ఒక్క సీటుకు రెండు సీట్ల డబ్బు చెల్లించాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 4 నుంచి విమాన ఆపరేషన్లకు సిద్ధంగా ఉండాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేయటం, ఇందుకు తగిన మార్గదర్శకాలను సూచించటంతో పాక్షిక సడలింపులతో కూడిన దేశీయ విమానయానానికి అవకాశం ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ విమానాలు నడిపితే.. కేవలం 30 శాతం ప్రయాణికులకే పరిమితమని సూచించటాన్ని విమానయాన సంస్థలు ఆక్షేపిస్తున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు ఎయిర్‌లైన్స్‌ ఆపరేటర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. 30 శాతం ప్రయాణికులతో విమానాలు నడపటం వయబిలిటీ కాదన్న అంశాన్ని ఎయిర్‌లైన్స్‌ మేనేజర్లు వ్యక్తం చేశారు. విమానయాన సంస్థలు సంక్షోభంలో ఉన్నాయి. ఆపరేషన్స్‌ చేపట్టనిదే మనుగడ సాగించే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ మినహాయింపుల ప్రకారం కేవలం 30 శాతం మందినే ఎక్కించుకుంటే వయబిలిటీ ఉండదు. అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటపుడు విమానయాన సంస్థలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి ఆప్షన్‌ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌). దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీజీఎఫ్‌ ఇచ్చే అవకాశం లేదు. అయితే, ప్రోత్సాహకంగా ఎయిర్‌పోర్టులలో ఏఏఐలకు చెల్లించే ఫీజుల విషయంలో మాత్రం మినహాయింపులు ఇవ్వవచ్చు. దీనివల్ల నెలరోజుల్లో కోల్పోయిన ఆదాయంలో కొంతమేర ఉపశమనం లభిస్తుందే తప్ప రానున్న రోజుల్లో విమానాలు తిప్పడానికి ఉపయోగపడదు. రకరకాల ఫీజుల రూపంలో విజయవాడ విమానాశ్రయం ప్రతినెలా రూ.3.50-రూ.4కోట్ల మేర ఆదాయాన్ని సాధిస్తుంది. అంటే ఏడాదికి సగటున రూ.50 కోట్ల మేర వస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రిలీఫ్‌ ఇస్తే విజయవాడ విమానాశ్రయం నుంచి నడిచే ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ విమానయాన సంస్థలు ఈ మేరకు లబ్ధి పొందుతాయి. అయినా రోజువారీ విమానయాన సంస్థలు కోల్పోయిన ఆదాయం కంటే తక్కువే. ఇక రెండో ఆప్షన్‌ చార్జీలు పెంచడమే. ఒక్కో విమానంలో దాని మోడల్‌ను బట్టి సీటింగ్‌ ఉంటుంది. విజయవాడ నుంచి నడిచే విమానాల్లో 82 నుంచి 180 సీటింగ్‌ ఉంటుంది. ఈ సీటింగ్‌ ప్రకారం 30 శాతం అంటే ఏమాత్రం లాభం ఉండదు. ఈ పరిస్థితుల్లో కనీసం 60 శాతం ఆక్యుపెన్సీ అయినా ఉంటే బ్రేక్‌ ఈవెన్స్‌గానూ, వయబిలిటీగానూ ఉంటుంది. అరవై శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఉండవు కాబట్టి 30 శాతం మంది ప్రయాణికులు డబుల్‌ చార్జీ చెల్లిస్తే ఆ మేరకు విమానయాన సంస్థలు కోరుకున్నట్టుగా 60 శాతం ఆక్యుపెన్సీని పరోక్షంగా పొందగలవు. డబుల్‌ చార్జీ చేస్తే ఈ భారంతో పాటు డిమాండ్‌ను బట్టి అంతకంతకూ చార్జీలు పెరిగిపోతుంటాయి. దీంతో డబ్బున్నవారు, వ్యాపారులు, సెలబ్రెటీలు తప్ప సాధారణ ప్రజలకు విమానయానం అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించట్లేదు.

* ఇంట్లో వంటింటి అవసరాలకి గ్యాస్ సిలిండర్ ముఖ్యం. ఒకప్పుడు పల్లెటూర్లో అయినా కట్టెల పొయ్యిలు కనిపించేవేమో కానీ ఇప్పుడు ఎక్కడా అవి కనిపించడం లేదు. అయితే గ్యాస్ వినియోగం పెరగడంతో ఇప్పటి దాకా ఆ రేట్లు పెరుగుతూనే పోయాయి. అయితే తాజాగా గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. దీంతో హైదరాబాద్ మహానగరంలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి రూ.589.50కు లభించనుంది. ఇక వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది. నెలవారీ సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం వల్లే మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

* ఔషధ రంగంలో పలురకాలైన ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) లు, ఫార్ములేషన్లు తయారు చేసే సంస్థ అయిన లారస్‌ ల్యాబ్స్‌ మరో దఫా విస్తరణ చేపట్టింది. ప్రధానంగా విశాఖపట్టణంలోని ఫార్ములేషన్ల యూనిట్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసే పనిలో నిమగ్నమైంది. దీనిపై రూ.300 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు, పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ తెలిపారు. ఈ విస్తరణ వచ్చే 18 నెలల్లో పూర్తవుతుందని అన్నారు. విశాఖపట్టణం ఫార్ములేషన్ల యూనిట్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాన్ని విస్తరించాల్సి వస్తోంది- అని ఆయన వివరించారు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థ లాభాల్లో జనవరి-మార్చి త్రైమాసికంలో 29శాతం క్షీణత నమోదైంది. మొత్తంగా గడిచిన త్రైమాసికంలో 2.54 బిలియన్‌ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. అదే గత ఏడాది ఇది 3.56 బిలియన్‌ డాలర్లుగా ఉండింది. షేరుపై ఆర్జన(ఈపీఎస్‌) 6.23 డాలర్లుగా విశ్లేషకులు అంచనా వేయగా.. అది 5.01 డాలర్లకే పరిమితమైంది. ఇక స్థూల ఆదాయం 26 శాతం పెరిగి 75.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీన్ని 73.7 బిలియన్‌ డాలర్లుగానే తొలుత అంచనా వేశారు.

* మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ రూ.35 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.25 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఇక మొత్తం ఆదాయం రూ.876 కోట్ల నుంచి రూ.893 కోట్లకు పెరిగింది. 2018-19లో మొత్తం రెన్యువల్‌ ప్రీమియం రూ.3,291 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.3,435 కోట్లకు చేరింది. 2019-20లో మొత్తం వ్యక్తిగత ప్రీమియం వసూళ్లు 4 శాతం పెరిగి రూ.4,375 కోట్లకు చేరాయి. ఇక నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.20,281 కోట్ల నుంచి రూ.19,837 కోట్లకు తగ్గింది. కరోనా నేపథ్యంలో తక్షణ అవసరాల నిమిత్తం రూ.33 కోట్లు కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఇక క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ నిష్పత్తి 97.7 శాతం నుంచి 98.1 శాతానికి పెరిగింది.