Devotional

తిరుమలలో మరో దీక్షితుల రగడ

TTD Govinda Raja Swamy Narasimha Deexitulu Asked To Resign

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులు అనువంశిక అర్చక వివాదం దుమారం రేపిన సంఘటన మరువక ముందే మళ్లీ తెరపైకి మరో వివాదం వచ్చింది. అనువంశికం మిరాశి విధానం ప్రకారం దేవాలయాలలో పనిచేసే అర్చకులు చేస్తున్నది ఉద్యోగం కాదని స్వామి వారి కైంకర్యం చేస్తూ వృత్తిగా భావించాలని అని ఆదేశాలు ఉన్నాయి. దీని ప్రకారం 60 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ చట్టం వర్తించదు. భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నంతవరకూ శరీరం సహకరించినంతవరకు అర్చకులు దేవాలయాలలో పూజా కైంకర్యాలు నిర్వహించుకోవచ్చు అని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలకు విరుద్ధంగా తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులు గా పనిచేస్తున్న నరసింహ దీక్షితులను ఉద్యోగ విరమణ చేయాల్సిందిగా టిటిడి ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు ఇవ్వడం వివాదాన్ని రేపింది. కోర్టు ఆదేశాలు అనుసరించకుండా కేవలం కోర్టు కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సాకుగా చూపుతూ తనను ఉద్యోగం నుంచి తొలగించారని నరసింహ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆలయ అర్చకుల అనువంశిక మిరాసి విధానంపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను టిటిడి ఉన్నతాధికారులు వక్రభాష్యం చెప్పి మినహాయింపు లేకపోయినప్పటికీ టిటిడి ని మినహాయించారని ప్రచారం చేస్తూ ఇలా అర్చకుల జీవనోపాధి పై దెబ్బ కొడుతున్నారని నరసింహ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 2006 సంవత్సరంలో అనువంశిక విధానంపై అనుకూలమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అటు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక అనువంశిక మిరాసి విధానం కొనసాగిస్తామని అర్చకుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని నరసింహ దీక్షితులు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలలో అర్చకులు పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి ఉన్నారని ఇది ఉద్యోగ బాధ్యత కాదని స్వామి వారి కైంకర్యం కోసం చేపట్టిన వృత్తి గా భావించాలని నరసింహ దీక్షితులు స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై టీటీడీ పాలక మండలి అధ్యక్షులు వై వి సుబ్బారెడ్డిని కలిసి మాట్లాడుతానని చెప్పారు. మరోవైపు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న నరసింహ దీక్షితుల ను పదవీ విరమణ చేయాలంటూ టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏ వి రమణ దీక్షితులు ఖండించారు. ఈ నిర్ణయం అర్చక మిరాసి విధానానికి విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.