DailyDose

మద్యప్రియులకు శుభవార్త-TNI కరోనా బులెటిన్

Andhra Opens Liquor Shops And Manufacturing-TNILIVE Corona Bulletin

* మద్యం అమ్మకాల కోసం మద్యపాన ప్రియులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిదే. మద్యం అమ్మకాల విషయంలో ఏ నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉందా అని చాలా మంది ఆశగా ఎదురు చూసారు. కరోనా కంటే మందు లేక చచ్చిపోతారేమో అన్నట్టు చేసారు కొందరు. ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్ళిన బ్యాచ్ కూడా ఉందీ అనేది అందరికి తెలిసిందే. కేంద్రం తాజాగా లాక్ డౌన్ ని పెంచింది. ఈ సందర్భంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అది కూడా పరిమితంగా మాత్రమే ఉంటుంది అని చెప్పింది కేంద్రం. ఈ నేపధ్యంలో మద్యం అమ్మకాల కోసం జనాలు చాలా ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ రెడ్‌ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్‌ జోన్‌లో, ఒకటి గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్‌ జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్‌ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* గుజరాత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 333 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాటివ్‌ కేసుల సంఖ్య 5054కి పెరిగింది. ఇప్పటివరకు 262 మంది ప్రాణాలు కోల్పోగా.. 896మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం( తితిదే)లో పనిచేస్తున్న 1400 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా తితిదే పెద్దలు మాత్రం ఒక్క కలంపోటుతో ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగింపునకు గురైన వాళ్లంతా 15 ఏళ్లుగా పనిచేస్తూ స్వల్ప జీతాలు తీసుకొనే చిరుద్యోగులేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తితిదే ట్రస్టు బోర్డుకి జనసేనాని విజ్ఞప్తి చేశారు.

* కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ క్రెడాయ్‌, ట్రెడాయ్‌ ప్రతినిధులతో తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణాల్లో నిర్మాణ రంగ పనులకు కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ప్రాజెక్టు డెవలపర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచించారు. నిర్మాణరంగానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు డెవలపర్లు వలస కార్మికుల్లో విశ్వాసం కలిగించాలనీ.. వారికి ప్రోత్సహకాలు, సౌకర్యాలు, వైద్యవసతి కల్పించాలని సీఎస్‌ సూచించారు. నిర్మాణ రంగ సామగ్రి తీసుకెళ్లేందుకు వాహనాలకు ఇబ్బంది ఉండదని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు.

* రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన అనుమతులతో రేపట్నుంచే 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంపెనీలను పూర్తిగా శానిటైజ్‌ చేశాకే మద్యం తయారీ చేయాలనీ.. ఆ సమయంలో కార్మికులు భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆదేశించింది.

* దేశంలో కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలపాలని ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ ఉపసంహరణ వ్యూహాలనూ రూపొందించాలన్నారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా, ఆర్థిక రంగం నిర్వహణపై నిర్ణయాలను వెల్లడించాలని సూర్జేవాలా విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ప్రధాని ముందుకు వచ్చి 130 కోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం మానవత్వంతో వ్యవహరించడం లేదని విమర్శించారు. శానిటైజ్‌ చేసిన రైళ్లలో వారిని ఉచితంగా ఇళ్లకు తరలించాలని కోరారు.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ రోజు 19 కంటైన్‌మెంట్‌ జోన్లు ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆహారం కోసం కరోనా కంట్రోల్‌ రూమ్‌కు 545ఫోన్‌కాల్స్‌ వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

* భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 2411 కొత్త కేసులు 71 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 37,776 మందికి ఈ వైరస్‌ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకినవారిలో 10018 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1223 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 26535 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపింది.