లాక్‌డౌన్ పేరుతో సిమెంట్, ఇసుక ధరలు భారీగా పెరిగాయి. సిమెంట్ డీలర్లంతా సిండికేట్ అయి ధరలను అమాంతం పెంచేశారు. లాక్‌డౌన్‌కు ముందు రూ. 300లున్న సిమెంట్ బస్తా రూ. 500 వందలైంది. టాక్టర్ ఇసుకలోడు రూ. 3000 వేలలోపు దొరుకుతుండగా.. అది ఇప్పుడు ఐదువేల రూపాయలకు చేరింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్న పేదోడికి లాక్‌డౌన్ అడ్డుపడింది. ముడిసరుకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. లాక్‌డౌన్ సాకు చూపిస్తూ డీలర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముడి సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సిమెంట్ ధర దడ పుట్టిస్తుండగా, ఇటుక ధర బరువెక్కింది. ఇసుక అంటేనే ఇప్పుడు బంగారమైపోయింది. స్టీల్ ధరలకు తోడు ఇతర ధరలు కూడా పెరగడంతో ఇల్లు కట్టాలంటేనే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ధరలపై అధికారుల నియంత్రణ కొరవడటంతో ప్రజలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇసుక సిమెంట్ ధరలకు రెక్కలు
Related tags :