WorldWonders

కిమ్ బతికే ఉన్నాడు

Kim Jong Un Is Alive

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతి చెందారంటూ మూడు వారాలుగా వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది. ఏప్రిల్‌ 11 నుంచి అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోయే సరికి ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయినందువల్లే ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ తెరదించుతూ కిమ్‌ ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపంలోని సన్‌చాన్‌ ప్రాంతంలో ఓ ఎరువుల కంపెనీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమానికి కిమ్‌ హాజరైనట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ వేడుకలకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా హాజరైనట్లు పేర్కొంది. అయితే, ఈ కార్యక్రమానికి అధికారిక మీడియా తప్ప ఇండిపెండెంట్‌ జర్నలిస్టులెవరినీ అనుమతించలేదని సమాచారం. దీంతో కేసీఎన్‌ఏ ప్రచురించిన కథనాన్ని, విడుదల చేసిన ఫొటోలను అంతర్జాతీయ మీడియా సంస్థలు ధ్రువీకరించలేకపోయాయి. కిమ్‌ ఆరోగ్యంపై విభిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఉత్తరకొరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా పేర్కొంది. కిమ్‌ మరణించారని నిర్దిష్ట నిఘా సమాచారమేదీ లేదని స్పష్టం చేసింది. కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇప్పటికే పేర్కొన్నారు.