* దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 10 వేల మంది కోలుకోవడం శుభసూచికం. గడిచిన 24 గంటల్లో (మే2 సాయంత్రం 5 గంటల వరకు) కొత్తగా 2,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,776కు చేరింది. తాజాగా 71 మరణాలు సంభవించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,223కు చేరింది. ఇప్పటి వరకు 10,018 వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం 26,535 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది.
* గత రెండు నెలల్లో భారత్‌లో కరోనా వైరస్ ఉత్తరివర్తనం (మ్యుటేషన్) చెందిందో లేదో తెలుసుకొనేందుకు ఐసీఎంఆర్ అధ్యయనం చేయనుంది. సార్స్-కొవిడ్2 స్ట్రెయిన్‌లో మార్పు జరిగిందో లేదో తెలుసుకుంటే వ్యాక్సిన్‌ను సమర్థంగా రూపొందించేందుకు సాయపడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వైరస్ మరింత తీవ్రంగా మారిందా, వ్యాప్తివేగం పెరిగిందో లేదో తెలుస్తుందన్నారు.
* అమెరికాలోని చాలా ఆస్పత్రుల్లో కొవిడ్-19 చికిత్సకు మొదట మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)నే ఉపయోగిస్తున్నారని మెడికల్ పబ్లికేషన్ ఎండీఎడ్జ్ తెలిపింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా ధ్రువీకరించిన రోగులకు యేల్ న్యూ హెవెన్ హెల్త్ సిస్టమ్స్‌లో ముందుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెండో ప్రాధాన్యంగా టొసిలిజుమాబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సంస్థకు కనెక్టికట్‌లో కొన్ని ఆస్పత్రులు ఉన్నాయి.
* కరోనా వైరస్‌ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్‌ను చూసి ప్రతీ దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వెల్లడించింది. వుహాన్ నగరంలోనే మొట్టమొదట కరోనా వైరస్ వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచమంతా పాకేసింది. వైరస్ వ్యాప్తితో దాదాపు సగం ప్రపంచం ఆంక్షల మధ్యే జీవిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరైన సమయంలో సంపూర్ణ వివరాలు ఇవ్వలేదని, మహమ్మారిని నియంత్రించడం, ఇతర దేశాలను హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. డ్రాగన్ దేశం మరింత పారదర్శకంగా ఉండాల్సిందని అనేక దేశాలు అంటున్నాయి.
* కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో చిక్కుకున్న వారంతా తిరిగి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు.
* సిద్దిపేట జిల్లాలో తరతరాల రైతుల కల నెరవేరిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయకసాగర్ ఎడమ, కుడి కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. మల్లన్నసాగర్ నాలుగో గేట్ ద్వారా ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ నీరు విడుదల చేశారు. అనతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతులకు ఏడాదిలో 2 పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు. జిల్లాలో ఇకపై కరవు, ఆత్మహత్య అనే పదాలే వినిపించవని ధీమా వ్యక్తం చేశారు. రంగనాయకసాగర్‌కు ఏడాదంతా నీళ్లు వస్తాయని.. కుడి కాల్వ ద్వారా 40 వేలు, ఏడమ కాల్వ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. సిద్దిపేట వాగు కింద 28 చెక్ డ్యాంలు, శనిగరం చెరువు, నక్కవాగు, పెద్దవాగు పరిధిలోని చెక్ డ్యాంలు నింపుతామని హరీశ్‌రావు తెలిపారు.