* ప్రధాని నరేంద్రమోదీ శనివారం కీలక మంత్రిత్వ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య శాఖల సీనియర్ అధికారులు సైతం వీటిలో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌తో కుదేలైన పారిశ్రామిక రంగం కోసం రెండో ఉద్దీపన పథకాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి. కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మోదీ సమావేశమయ్యారు. సూక్ష్మ్, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులూ ఇందులో పాల్గొన్నారని తెలిసింది. జీఎస్‌టీ వసూళ్ల వివరాల ప్రకటనను ఆర్థికశాఖ శుక్రవారం వాయిదా వేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, భారత ఆర్థిక వ్యవస్థను పుంజుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం ప్రజెంటేషన్ ఇచ్చారు.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం తిరిగి కోలుకోవాలంటే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని పారదర్శకంగా అమలు చేయాలని సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు శివకుమార్ అభిప్రాయపడ్డారు. అలా చేసినప్పుడే అమలును పర్యవేక్షించడం సులభతరం అవుతుందని తెలిపారు. ఆయా పరిశ్రమలకు మరిన్ని ఉద్దీపనలు ప్రకటిస్తే మేలన్నారు.
* రెండో విడతగా మహిళల జన్‌ధన్ ఖాతాల్లో మే నెలకు సంబంధించి రూ.500 చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ‘అకౌంట్ నంబర్ల చివరి అంకె ఆధారంగా ఖాతాదారులకు నిర్ణీత రోజు నగదు తీసుకునేందుకు అవకాశం ఇస్తాం. తద్వారా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గి.. భౌతిక దూరం పాటించేందుకు వీలు కలుగుతుంది. 11వ తేదీ అనంతరం ఏ రోజైనా తీసుకోవచ్చు’ అని ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా శనివారం తెలిపారు.
* అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరగడం, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు బలహీన వృద్ధిని నమోదు చేయడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. మేడే సందర్భంగా పలు ప్రధాన మార్కెట్లు శుక్రవారం పనిచేయలేదు. జపాన్ నిక్కీ 2.84 శాతం నష్టంతో 19,619 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 5 శాతం కోల్పోయి 5,245.90 దగ్గర స్థిరపడింది. మరోవైపు బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ 2 శాతం తగ్గి 5,781.91 దగ్గర ముగిసింది. బ్రెంట్ ముడిచమురు 26 డాలర్ల దరిదాపుల్లో ట్రేడవుతోంది. అమెరికా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటల సమయానికి డోజోన్స్ 200 పాయింట్లు, నాస్‌డాక్ 100 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.
* కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్ చర్యతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ దేశాన్ని తీవ్రమైన వేదన నుంచి బయటపడేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అభిప్రాయపడ్డారు. ‘మరింత ఓపికపట్టడం అవసరం. పరిస్థితి అదుపులోకి వచ్చిందని, వైరస్ వ్యాప్తిని నియంత్రించామని పూర్తి స్థాయిలో నమ్మకం కలిగేంత వరకు మనల్ని కాపాడుతోన్న మార్గాన్ని విడిచిపెట్టకూడద’ని పీటీఐ వార్తా సంస్థతో రజనీశ్ కుమార్ చెప్పారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక ప్రగతి స్తబ్దుగానే ఉంటుందని అన్నారు. అయితే దేశంలో డిమాండుకు మాత్రం ఎటువంటి ఢోకా లేదని తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా తొలగాలంటే మరికొంత సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని అనుకుంటున్నాను. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏం బాగోలేదు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరిస్తే కేసుల సంఖ్య తగ్గి పరిస్థితి వేగంగా అదుపులోకి వస్తుంద’ని రజనీశ్ కుమార్ వెల్లడించారు.