సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆయన ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించారు.
రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించారు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసారు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక “సందేశ్”ను చాలా ఏళ్ళు నిర్వహించారు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు.
1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.