Politics

రంగనాయకసాగర్ జలాలు విడుదల చేసిన హరీశ్‌రావు

TRS Minister Harish Rao Releases Ranganayaka Sagar Water

సిద్దిపేట జిల్లాలో తరతరాల రైతుల కల నెరవేరిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయకసాగర్‌ ఎడమ, కుడి కాల్వలకు మంత్రి హరీశ్‌ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. మల్లన్నసాగర్‌ నాలుగో గేట్‌ ద్వారా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరామ్‌ నీరు విడుదల చేశారు. అనతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతులకు ఏడాదిలో 2 పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు. జిల్లాలో ఇకపై కరవు, ఆత్మహత్య అనే పదాలే వినిపించవని ధీమా వ్యక్తం చేశారు. రంగనాయకసాగర్‌కు ఏడాదంతా నీళ్లు వస్తాయని.. కుడి కాల్వ ద్వారా 40 వేలు, ఏడమ కాల్వ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. సిద్దిపేట వాగు కింద 28 చెక్‌ డ్యాంలు, శనిగరం చెరువు, నక్కవాగు, పెద్దవాగు పరిధిలోని చెక్‌ డ్యాంలు నింపుతామని హరీశ్‌రావు తెలిపారు. రంగనాయక సాగర్‌ ఎడమ, కుడి కాల్వలోకి నీరు వదిలిన అనంతరం నీటిని చూసిన ప్రజాప్రతినిధులు పులకించిపోయారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కాల్వలోకి దిగి సంతోషంతో ఈత కొడుతూ సంబరాలు చేసుకున్నారు.