DailyDose

CRPFలో కరోనా కలకలం-TNI కరోనా బులెటిన్

CORONA Case In CRPF-TNILIVE Corona Bulletin

* ప్రయాణాల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని కోరింది. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఏపీ ప్రజల పరిస్థితిపై చర్చించారు.

* ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. 25 శాతం మధ్యం ధరలు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రానున్నరోజుల్లో మరిన్ని దుకాణాల సంఖ్య తగ్గింపునకూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపడుతారు. మద్యపానాన్ని నియంత్రించడం, రద్దీని తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

* తెలంగాణ -ఏపీ సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోదాడ రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ సరిహద్దులో వలస కార్మికుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి 7 నుంచి ఇప్పటి వరకు ఏపీలోకి అనుమతింలేదు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిపివేశారు. వలస కార్మికులకు తెలంగాణ పోలీసులు అల్పాహారం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసుల తీరుపై వలస కార్మికులు మండిపడుతున్నారు.

* సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్పీఎఫ్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో హెడ్‌ క్వార్టర్స్‌ను అధికారులు ఆదివారం సీలు వేశారు. శానిటేషన్‌ కోసం బెటాలియన్‌ కార్యాలయాన్ని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకిగా, ఈ బెటాలియన్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇటీవలే కరోనాతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా 39,000మంది కరోనా బారినపడిగా 1300మంది మరణించారు.

* గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం. జయశంకర్ విగ్రహం వద్ద సోషల్ డిస్టెన్స్ లో నిల్చున్న సిబ్బంది. గాంధీ హాస్పిటల్ వద్ద క్యూలో నిల్చున్న హైదరాబాద్ సీపీ. హర్షం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు.

* పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు.

* వలస కూలీలు తమ రాష్ట్రంలకు వెళ్ళేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దుందిరాలపాడు గ్రామంలో ధర్నా ఆదివారం నిర్వహించారు. పిల్లలు, వృద్ధులను ఇంటి దగ్గర ఉంచి పనులకు వచ్చామని, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇక్కడే పనులులేక ఉన్నామని, అధికారులు స్పందించి వెళ్ళేందుకు అనుమతులు ఇవ్వాలని నిరసన తెలిపారు.

* ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్‌డౌన్‌లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం)పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది.

* నగరంలో 8 రోజులపాటు పర్యటించిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన బృందం కరోనా నివారణ, సహాయ చర్యలను పరిశీలించింది. ఇవాళ ప్రత్యేక విమానంలో బృంద సభ్యులు దిల్లీ వెళ్లిపోయారు.

* రష్యాలో ఇవాళ ఒక్కరోజే 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో సగానికిపైగా దేశ రాజధాని మాస్కోలో నమోదవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇవాళ 10,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. అందులో సగానికిపైగా మాస్కోలో నమోదయ్యాయి. కరోనా విజృంభణ మొదలైన తర్వాత ఇలా ఒక్కరోజులోనే 10 వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు రష్యాలో కేసుల సంఖ్య 1,34,000కు చేరగా.. 1420 మంది ప్రాణాలు కోల్పోయారు.

* లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు త్స్ప్.కూపిద్.ఐ/ఎపస్స్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి డిజిటల్ పాసులను జారీ చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయని… ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 7వేల పాసులు జారీ చేసినట్లు పోలీసు శాఖ తెలిపింది. మరో 10వేల దరఖాస్తులు పరిశీలించి పాసులు జారీ చేయాల్సి ఉందని వివరించారు. దరఖాస్తుల వెల్లువతో డిజిటల్ పాసు సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. కొంత సమయం తర్వాత సంప్రదించాలని సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌ 19 పరీక్షల్లో 58 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా బాధితుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 488 మందిని డిశ్చార్జి చేశారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది మృతి చెందారు.