తెలంగాణ అనగానే ఠక్కున గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు, బిర్యానీ పక్కన కొత్తగా యాపిల్ చేరింది! మినీ కశ్మీరంలా పేరొందిన కుమ్రంభీంఆసిఫాబాద్‌లోని కెరమెరి అటవీప్రాంతంలో తెలంగాణ యాపిల్ నెలరోజుల్లో కోతకు రానున్నది! ఏడాదిలో ఎక్కువకాలం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతం యాపిల్‌సాగుకు అనుకూలంగా ఉన్నది. ఔత్సాహిక రైతు బాలాజీ ప్రయోగాత్మకంగా చేసిన యాపిల్‌సాగు ఫలప్రదమైంది. చల్లని ప్రదేశాల్లో కొత్తరకం సాగుకు ఈ ప్రయత్నం దారిచూపింది.కుమ్రంభీంఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కెరమెరి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మన యాపిల్ మార్కెట్‌లోకి రానున్నది. త్వరలో ఈ ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశమున్నది. సర్కారు సహకారంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ 400 మొక్కలు నాటగా, మరో నెలరోజుల్లో పంట చేతికందనున్నది. మొదటల్లో బాలాజీ 15 ఎకరాల్లో పత్తి తదితర వాణిజ్యపంటలు వేయగా నష్టాలు వచ్చాయి. దీంతో పెట్టుబడి తక్కువగా ఉండే ఆహార పంటలు సాగుచేయాలని నిర్ణయించుకొన్నారు. 2000 సంవత్సరంలో ఏపీలోని గంటూరు జిల్లాలో ఓ నర్సరీ నుంచి 100 బత్తాయి, నారింజ మొక్కలను తీసుకొచ్చి ఎకరం భూమిలో నాటారు. ఐదో ఏట నుంచి పంట చేతికొచ్చింది మొదట్లో ఏటా రూ.50 వేల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ.లక్ష వరకు వస్తున్నది.
*** యాపిల్ సాగు విజయవంతం
స్నేహితుడి సలహాతో రాజమండ్రిలోని ఓ నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తనకున్న పరిజ్ఞానంతో వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించగా ఏపుగా పెరిగాయి. ఉష్ణ మండల ప్రాంతాల్లో యాపిల్ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. బాలాజీ యాపిల్‌సాగు చేస్తున్న భూమిని, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేశారు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెదిన 150 మొక్కలను ఇచ్చి ప్రోత్సహించారు. వారి సలహాలతో మొక్కల చుట్టూ ఏడాది పొడవునా తేమ ఉండేలా ఏర్పాట్లుచేశాడు. 50 మొక్కలు చనిపోగా, 100 మొక్కలు పెరిగాయి. రెండో ఏట పూతవచ్చి కాయలు కాశాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడేండ్లుగా కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల పరిమాణానికి చేరాయి. ఇవి ఎర్రగా కశ్మీర్ యాపిల్‌ను తలపిస్తున్నాయి. రెండెకరాల్లో 400 చెట్లలో ఒక్కోదానికి 20 నుంచి వరకు 40 కాయలున్నాయి. మరో నెలలో కోతకు వచ్చేసరికి ఒక్కొక్కటి 250 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో చెట్టుకు నాలుగు నుంచి ఆరు కిలోల వరకు దిగుబడి వస్తుందని బాలాజీ తెలిపారు. ధనోర పరిసరాల్లో సాగవుతున్న యాపిల్ క్షేత్రం చుట్టూ గుట్టలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో ఈ ప్రాంతంలో 4 నుంచి 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల యాపిల్ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు వీరభద్రరావ్, రమేశ్ అటర్వాల్ తెలిపారు. సరైన ఊష్ణోగ్రత నమోదవడంతో చెట్టుకు పూత నిలిచి ఉంటున్నది. ఆ తర్వాత ఉష్ణోగ్రత పెరిగనా యాపిల్ మొక్క తట్టుకుంటుంది. ఒక్కసారి నాటిన యాపిల్ మొక్కలు, నేల స్వభావాన్ని బట్టి 25 నుంచి 30 ఏండ్ల వరకు బతికి ఉంటాయి.