నార్ల వెంకటేశ్వరరావు “ఆంధ్రప్రభ” ఎడిటర్ గా తెలుగు పత్రికా రంగంలో ఎదురులేని జర్నలిస్టుగా వున్న రోజులవి. 1948లో ఆయన సంపాదకీయంపై “జ్యోతి” పత్రిక సంపాదకుడుగా ఆలపాటి రవీంద్రనాథ్ వ్యాఖ్యానం చేస్తూ:“ఇది బొక్క బెరడా? నార్ల సంపాదకీయమా?” చెప్పుకోండి చూద్దాం అంటూ జ్యోతి పత్రికలో రాశారు. తెనాలి నుండి వెలువడుతున్న ఆ పత్రిక వ్యాఖ్యానం చూసి, నార్ల కళ్ళవెంట నీళ్ళు పెట్టుకొని, నా కుమారుడు చనిపోయిన రోజే యిలాంటి మాటలు అనాలా అని నొచ్చుకున్నారు. విషయం తెలిసి రవీంద్రనాథ్ వెంటనే మద్రాసు వెళ్ళి నార్లకు క్షమాపణ చెప్పారు. జ్యోతి పత్రికలో వ్యాఖ్యానానికి కాదు. కుమారుడు చనిపోయాడని తెలియదనీ, అందుకు మన్నించమనీ అన్నారు. వారిరువురి మధ్య అంతటితో ఆ సమస్య ఆగిపోయింది. నార్ల సంపాదకీయాన్ని బొక్కబెరడుతో పోల్చడం ఘాటైన విమర్శ. బొక్క బెరడు పాముకు రెండు తలలు వుంటాయి. ఇది మాగాణి ప్రాంత రైతులకు తెలుసు. సంపాదకీయం అలా వున్నదనేది తీవ్రవిమర్శ. ఆనాడు నార్లను అలా విమర్శించగలగడం సాహసం అయితే రవీంద్రనాథ్ అందుకు విచారించలేదు. తెనాలి నుండి నడచిన జ్యోతి పత్రిక ప్రాధాన్యత కూడా దీనిని బట్టి గ్రహించవచ్చు. అది రవీంద్రనాథ్ విశిష్టత.అలాంటి రవీంద్రనాథ్ ను ఛాలెంజ్ చేస్తూ, సుప్రసిద్ధ రచయిత చలం రెండు కథలు పంపిస్తాను, నీకు దమ్ముంటే ప్రచురించు అని సవాల్ విసిరాడు. పంపించు చూద్దాం అని ప్రశాంతంగా అన్న రవీంద్రనాథ్ ఆ కథల్ని రేరాణిలో ప్రచురించి చలం నోరు మూయించాడు. ఆ కథలలో ఒకటి : స్టేషన్ పంపు, రెండోది హంకో మొహొబత్. ఆ తరువాత ఛాలెంజ్ లేకుండా పంపిన చలం కథ “కళ్యాణి”ను రవీంద్రనాథ్ తిరస్కరించారు.
చలం దానిని వేరే పత్రికకు పంపుకున్నారనుకోండి.రవీంద్రనాథ్ విచిత్ర పరిస్థితులలో తెనాలి వచ్చారు. గోవాడ వాసిగా తురుమెళ్ళలో చదువుకోడానికి వెళ్ళారు. మూడు మైళ్ళ దూరంలో వున్న గ్రామానికి వెళ్ళినా చదువు పూర్తి కాలేదు. చదువు ఎగ్గొట్టి పొలాలగట్ల మీద ఆటలు ఆడేవారు. హైస్కూలు మంచి ప్రమాణాలు గలది. దక్షిణామూర్తి అనే హెడ్మాస్టర్ నాయకత్వాన క్రమశిక్షణకు పేరు పొందిన పాఠశాల. టీచర్లు కూడా నిష్ణాతులే. అందుకే అనేక గ్రామాల నుండి తమ పిల్లల్ని చదువు నిమిత్తం అక్కడకు పంపారు. రవీంద్రనాథ్ ఆ క్రమశిక్షణలో యిమడలేదు. ఆకతాయితనంగా ఇద్దరు ముగ్గురు స్నేహితులు క్లాసు ఎగ్గొట్టి వరి పొలాల మధ్య ఆటలు ఆడి యింటికి చేరేవారు. ఒకనాడు క్లాసులో పంతులుగారికి ఎదురు తిరిగి, ఆయన చొక్కాపై కలం సిరా చల్లారు. హెడ్మాస్టర్ విచారిస్తే చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. క్రమశిక్షణా రాహిత్యత శ్రుతి మించుతున్నదని, స్కూలు నుండి తొలగించారు. చదువుకు స్వస్తి.గోవాడ గ్రామంలో గ్రంథాలయం వుంది. కార్యకలాపాలకు కొదవ లేదు. అయినా రవీంద్రనాథ్ స్థాయికి అవి చాలలేదు. అందువలన తెనాలికి చేరుకున్నారు.ఆనాడు తెనాలి రాష్ట్రంలో సాంస్కృతిక కేంద్రం. నాటకాలు, ప్రదర్శనలు, ప్రచురణలు, లలిత కళలు, సినిమా రంగం, ప్రింటింగ్ ప్రెస్ లు విరివిగా వుండేవి. ఆంధ్ర పారిస్ అని పేరొందిన తెనాలికి చేరుకున్న రవీంద్రనాథ్ కు కావలసినంత అవకాశం కనిపించింది. అప్పటికే ఎం.ఎన్.రాయ్ నాయకత్వాన మానవవాద వుద్యమం ముమ్మరంగా సాగుతున్నది. రాడికల్ పత్రిక వెలువడుతున్నది. కార్మికుల పక్షాన గుత్తికొండ నరహరి ఒక పత్రికను, విద్యార్థులకు కృష్ణ చౌదరి ఒక పత్రికను నడిపారు. కోగంటి రాధాకృష్ణమూర్తి కవిరాజ ప్రచురణలు నిర్వహించారు. త్రిపురనేని గోపీచంద్ రాడికల్ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శిగా కథలు, వ్యాసాలు దంచేస్తున్న రోజులవి. ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ పత్రిక నడుపుతున్నారు.
అలాంటి సమయంలో త్రిపురనేని రామస్వామి సంస్కరణ వుద్యమం సాగిస్తూ, పురోహితులు లేని పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారు.రవీంద్రనాథ్ కు యిష్టమైన వాతావరణం అది. కనుక తెనాలిలో స్థిరపడి, ప్రింటింగ్ ప్రెస్ తో మొదలుపెట్టారు. బోసురోడ్ లో జ్యోతి ప్రెస్ ప్రారంభించారు. ప్రెస్ వున్నందున, జ్యోతిపత్రిక మొదలు పెట్టారు.రవీంద్రనాథ్ బోస్ రోడ్ లో ప్రెస్ లో కూర్చొని, కేప్టెన్ సిగరెట్ పీలుస్తూ, లాల్చి పంచె డ్రస్ లో వుంటే చూడ ముచ్చటగా వుండేది. సాయంత్రం అయ్యేసరికి సిగరెట్ డబ్బా చేతిలో పట్టుకొని, టెన్నిస్ ఆటకు పంచెకట్టుతో వెడుతుంటే ఆశ్చర్యంగా చూచేవారు. రవీంద్రనాథ్ తెనాలి వచ్చిన సమయంలో ధనికొండ హనుమంతరావు కూడా విద్య ముగియక ముందే తెనాలి వచ్చారు. జ్యోతి పత్రికలో రవీంద్రనాథ్ కు సహాయపడటమే గాక, కొత్తగా పెట్టిన రేరాణి పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. రవీంద్రనాథ్ పెట్టిన మరో పత్రిక సినిమా, తెనాలికి వున్న సినిమా బంధాల వలన సినిమా పత్రిక అందరినీ ఆకర్షించింది. రవీంద్రనాథ్ కు రచయితలను పట్టుకోవడం, రాయించడం గొప్ప విద్య.రవీంద్రనాథ్ పత్రికలలో తెలంగాణా నుండి, ఆంధ్రలో నలుమూలల నుండి రచయితలు తమ వ్యాసాలు పంపేవారు. తెలంగాణా రచయితలు కూడా అలాగే పరిచితులయ్యారు.రవీంద్రనాథ్ చేసిన ఒక వినూత్న గొప్ప విశేషం ఏమంటే సైంటిఫిక్ గా సెక్స్ ను ప్రజలకు చెప్పడం యూరోప్ అమెరికాలో హావ్ లాక్ ఎల్లీసు కొత్తగా ప్రవేశపెట్టిన సెక్స్ విద్య వీరికి ప్రోత్సాహాన్నిచ్చింది. విషయాన్ని అందంగా ఆకర్షణీయంగా చెప్పటమే గాక, వైజ్ఞానికంగా వుండాలనడం రవీంద్రనాథ్ ప్రధాన ఉద్దేశం. ఎం.ఎన్.రాయ్ మానవవాద దృష్టి అందుకు వూతం యిచ్చింది. రవీంద్రనాథ్ పత్రిక రేరాణి ముఖ్యంగా యువతలో విపరీత ఆకర్షణగా వుండేది. అది చదివితే చెడిపోతారని పెద్దలు కోప్పడి, కొట్టిన ఘటనలు లేకపోలేదు. ప్రశ్నలు సమాధానాలు శాస్త్రీయంగా వుండాలని డాక్టర్ల సలహాలు, సహాయం స్వీకరించేవారు.జ్యోతి ప్రెస్ కు టైైప్ రైటర్ ను ఆలపాటి కృష్ణకుమార్ బహూకరించారు. అమెరికా నుండి తెచ్చిన టైప్ రైటర్ ఆనాడు తెనాలికే అపురూపం!రేరాణి పత్రికకు తొలుత ఉపసంపాదకుడుగా ధనికొండ హనుమంతరావును నియమించారు. తరువాత కొలను బ్రహ్మానందంను పూర్తిస్థాయి సంపాదకుడుగా నియమించారు.సినిమా పత్రిక రవీంద్రనాథ్ జీవితంలో మరో ఘట్టం తెనాలి నుండి అలాంటి పత్రిక నడపడం గొప్ప సాహసం. ఆ రోజులలో సినిమా రంగం అంతా మద్రాసు కేంద్రంగా వుండేది. అయినా సాహసించి, సినిమా పత్రిక పెట్టి, సినిమాల రివ్యూలు, తారల విశేషాలు పాఠకులకు అందించారు. నిత్యం మద్రాసుతో సంబంధం పెట్టుకునేవారు. తెనాలి నుండి అప్పటికే కాంచనమాల, వరలక్ష్మి వంటివారు రంగంలో వున్నారు. రవీంద్రనాథ్ అప్పుడప్పుడూ మద్రాసు వెళ్ళి వస్తుండేవారు. మద్రాసు పత్రికల స్థాయిలో తెనాలి నుండి నడిపి జయప్రదం చేసిన రవీంద్రనాథ్ కొన్నాళ్ళ తరువాత ఆ పత్రిక నిలిపేశారు.తెనాలి జీవితంలో 10 ఏళ్ళపాటు రవీంద్రనాథ్ చరిత్ర మలుపులు తిప్పారు. మానవవాద ఉద్యమంలో సాంస్కృతిక విభాగానికి తిరుగులేని బాటలు వేశారు. ఆయన పెళ్ళి కూడా సుప్రసిద్ధులైన త్రిపురనేని రామస్వామి, తాపీ ధర్మారావు నిర్వహించారు. ఎం.ఎన్.రాయ్ తరచు తెనాలి వస్తూపోతూ వుండడం కూడా రవీంద్రనాథ్ పై ఆకర్షణ శక్తి అయింది.రవీంద్రనాథ్ ప్రోత్సాహంతో ధనికొండ హనుమంతరావు, కొలను బ్రహ్మానందం, రావూరి భరద్వాజ, శార్వరి యిత్యాదులు వెలుగులోకి వచ్చారు. అదొక పునర్వికాస దశాబ్దం. 1940-50 మధ్య తెనాలి విప్పారిన సందర్భం. తరువాత ధనికొండ హనుమంతరావు తెనాలి వదలి మద్రాసు వెళ్ళి అభిసారికి నడిపారు. కొలను బ్రహ్మానందం తెనాలి వదలి మద్రాసు వెళ్ళారు.
రావూరి భరద్వాజ హైదరాబాద్ వెళ్ళారు.రవీంద్రనాథ్ కొన్నాళ్ళు విజయవాడలో గడిపినా అప్పుడేమీ చేయలేదు.విజయవాడలో బాజీగారు లీలామహల్ సినిమాహాలు నిర్వహిస్తూ మంచి ఇంగ్లీషు చిత్రాలు వేసేవారు. రవీంద్రనాథ్ సాయంత్రానికి లీలామహల్ వెళ్ళి, వెనుకవున్న గెస్ట్ హౌస్ లో కబుర్లు చెప్పుకొని, మంచి సినిమా అనిపిస్తే ఏదైనా చూచేవారు. బుజ్జులు (కృష్ణమూర్తి) వారికి మరొక కంపెనీ. కొన్నాళ్ళు విజయవాడ జీవితం అనంతరం, రవీంద్రనాథ్ హైదరాబాద్ లో కుదుటబడ్డారు. జీవితంలో అదోమలుపు.మానవవాద ఉద్యమంలో సాంస్కృతిక ప్రతినిధి ఆలపాటితెనాలిలో వివిధ వ్యక్తులు మానవవాద వుద్యమ వ్యాప్తికి కృషి చేయగా ఆలపాటి రవీంద్రనాథ్ సాంస్కృతిక రంగం చేబట్టి, అనుకోని విజయాలను సాధించారు. అది బృహత్తర కృషి. యువతను బాగా ఆకట్టుకున్న యీ రంగం ఎంతో ప్రభావాన్ని కనబరిచింది.తెనాలి వదలిన అనంతరం రెండు దశాబ్దాలు గడచిన తరువాత హైదరాబాద్ లో రవీంద్రనాథ్ మళ్ళీ కార్యరంగంలోకి దిగారు. ఈ లోగా ప్రెస్ బెట్టి, వ్యాపార కార్యక్రమం సాగించారు. భవిష్యత్తు వుద్యమానికి తగిన సాధన సంపత్తి సమకూర్చుకున్నారు. అమెరికా, ఇంగ్లండ్ పర్యటించారు.సాంఘిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం తన లైబ్రరీకి సాధించిన రవీంద్రనాథ్, ముందుచూపుతో నడిచారు. యూనివర్సిటీలకు సైతం లేని యీ గ్రంథాలు ఎంతో రిఫరెన్స్ కు పనికొచ్చాయి. విల్ డ్యురాంట్ నాగరికత చరిత్ర సేకరించారు.మరోవైపు బౌద్ధాన్ని అధ్యయనం చేసి, సిలోన్, టిబెట్, థాయ్ లాండ్ నుండి విశిష్ట గ్రంథసేకరణ చేశారు. అమెరికా నుండి 40 ఏళ్ళపాటు టైం మాగజైన్ తెప్పించారు. ఎవర్ గ్రీన్ పత్రిక తెప్పించారు. జీవితంలో మరోమలుపుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అనేకమందితో సంప్రదించారు.తెనాలి అనుభవాల దృష్ట్యా హైదరాబాద్ లో తొందరపడి రవీంద్రనాథ్ పత్రికారంగంలోకి దిగలేదు. అనేకమందిని కలవడం, తన సొంత లైబ్రరీ సంతరించుకోవడం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు.కొన్నాళ్ళకు కళాజ్యోతి ప్రెస్ కు పేపర్ కావలసి వచ్చింది. యూరోప్ నుండి షిప్ లో తెప్పిస్తే చౌకగా వస్తుంది. అయితే పత్రికలకు అలా తక్కువ ధరలో యిస్తారు. రవీంద్రనాథ్ తన కుమారులు దేవేంద్ర, వెంకట్ తో సంప్రదించారు. ఒక పత్రిక పెట్టి దాని పేరిట పేపర్ కోటా అడగాలనుకున్నారు. అప్పుడు ఏం పత్రిక పెట్టాలా అని ఆలోచించి, ఒక పక్షపత్రిక పేరిట పేపర్ తెప్పించాలనుకున్నారు. ఆ చర్చలలో నేనూ పాల్గొన్నాను. పక్షపత్రిక తెలుగులో పెట్టాలని దానికి మిసిమి అని పేరు పెట్టాలని నిర్ధారించారు. బాగానే వుంది కాని పక్షపత్రికకు తగిన విషయం కావాలిగదా. నేను ముందుకు వచ్చి సహకరిస్తానని చెప్పాను.మిసిమి అనే పేరుతో పక్షపత్రిక నడపాలని భావించారు. నేను మరికొందరు మిత్రులు, బూదరాజు రాధాకృష్ణవంటివారు తొలుత కొన్ని వ్యాసాలు అందించాం. సుభాస్ చంద్రబోసు గెలిస్తే ఏమయ్యేది అనే శీర్షికన తొలిసంచిలో సుదీర్ఘవ్యాసం అందించాను. అలా మిసిమి పక్షపత్రికగా కొన్నాళ్ళు వచ్చింది. యూరోప్ నుండి పత్రిక పేరిట పేపర్ రావడంతో, పత్రిక ఆపేద్దామనుకున్నారు. రవీంద్రనాథ్ ప్రెస్ పనులు చూడడం తగ్గించి, వెంకట్, దేవేంద్రనాథ్ లకు అప్పగించారు. కాలక్షేపానికి మిసిమి పత్రికను కొనసాగించమని తండ్రికి సలహాయిచ్చారు. సరే అని పక్షపత్రికను మాసపత్రికగా మార్చి పూర్తి పనిని రవీంద్రనాథ్ స్వీకరించారు. అలా వచ్చింది మిసిమి మార్కెట్ లోకి!పక్షపత్రిక కొన్నాళ్ళు నడిపిన అనంతరం, అది కొనసాగించాలా వద్దా అనే మీమాంస వచ్చింది. కుమారులు దేవ్, వెంకట్ లు పత్రిక ఆపవద్దని నడపమని కోరారు. రవీంద్రనాథ్ ప్రెస్ పనులు చూడడం లేదు గనుక, పూర్తి సమయం పత్రికకు వినియోగించవచ్చన్నారు. ఆ దశలో పక్షపత్రికగా కాక, మాసపత్రిక అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.రవీంద్రనాథ్ సిసలైన మానవవాది. అందులో రామణీయకతలపై బాగా దృష్టిపెట్టిన వాడు. తెనాలి అనుభవాల దృష్ట్యా అలాగే కొనసాగించాలని తలపెట్టారు.రవీంద్రనాథ్ పూర్తిగా రంగం ప్రవేశం చేశారు. వివిధ రచయితలను సంప్రదించడం, శీర్షికలు చర్చించడం ఆయనకు కొట్టిన పిండి. రచయితలకు పుస్తకాలు, సమాచారం అందించి, వాటి ఆధారంగా రాయమనేవారు.మిసిమి పాలసీగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.మిసిమిలో కథలు, గేయాలు, నాటకాలు వద్దనుకున్నారు. ఎంత పెద్ద రచయితలకైనా సరే యీ పాలసీ వర్తిస్తుందని, సడలింపు వుండదనీ భావించారు. అందువలన కొందరికి ఆగ్రహం రాకపోలేదు. ఉదాహరణకు వాసిరెడ్డి సీతాదేవి పంపించిన రచనని తిప్పి పంపితే ఆమెకు చాలా కోపం వచ్చింది.టైం మాగజైన్, అలాంటి మరికొన్ని మాగజైన్లు గోవాడ సత్యారావు వంటి వారికి యిచ్చి, విషయం చెప్పి, తదనుగుణంగా వ్యాసం రాయమనే వారు.
ప్రతిరోజూ నేను రవీంద్రనాథ్ కలసి మిసిమి పాలసీ చర్చించేవాళ్ళం. తెనాలికి ఫోన్ చేసి ఆనపరెడ్డి వెంకటేశ్వరరెడ్డితో మాట్లాడేవారు. భాషాపరంగా బూదరాజు రాధాకృష్ణను సంప్రదించేవారు. మొత్తం మీద పూర్తిస్థాయి ఎడిటర్ గా మిసిమిని రవీంద్రనాథ్ నడిపారు. మానవ విలువలలో రామణీయకత ప్రాధాన్యత చూపారు.ఒకరోజు రవీంద్రనాథ్ నేను కలసి అశోక్ నగర్ లో వుంటున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ వద్దకు వెళ్ళి చర్చించాం. గురజాడ వారి పాత్ర మధురవాణి పేరిట, ఇంటర్వ్యూ పద్ధతి ప్రవేశ పెడితే ఎలా వుంటుందని రవీంద్రనాథ్ అడిగారు. పురాణం ఎగిరి గంతేసినంత పనిచేసి వెంటనే మొదలుపెడదామన్నారు. ఆ శీర్షిక బాగా పేలింది. పురాణం దూకుడును రవీంద్రనాథ్ ఎడిట్ చేసేవారు. ఒకసారి ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ ను దృష్టిలో పెట్టుకుని రాయగా రవీంద్రనాథ్ సెన్సార్ చేసి, అది తొలగించారు. అలా ఔచిత్యాన్ని కాపాడేవారు.మంచి పుస్తకాలు కొని తగిన వ్యక్తుల్ని ఎంపిక చేయించేవారు. సూటబుల్ బోయ్ అనే పెద్ద పుస్తకం కొని, వెనిగళ్ళ కోమలకు యిచ్చి రివ్యూ రాయమన్నారు. కాని, వెనిగళ్ళ కోమలకు యిచ్చి రివ్యూ రాయమన్నారు. ఆ సమీక్ష ఆయనకు బాగా నచ్చింది.ఆధునిక తాత్విక మహాశయులపై బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారిపై నేను వ్యాసాలు రాసేవాడిని.టైం పత్రికలో వచ్చిన రివ్యూ ఆధారంగా ఇంటలెక్చువల్స్ అనే గ్రంథం తెప్పించారు. సాలే జాన్సన్ రాసిన గ్రంథం అది. చాలా బాగా ఆకర్షించిన రచన. దానిని వెంకటేశ్వరరెడ్డికి యిచ్చి, దాని ఆధారంగా రాయమన్నారు. కొన్నిటిని సేకరించి రాశారు.ఆయన అందులో కొన్ని వదిలేసి, కొన్నిటిని స్వీకరించి రాశారు. ఉత్తరోత్తరా మేథావుల మెతకలు అనే పేరిట అది వెలుగు చూచింది.సంజీవదేవ్ వంటి వారితో బౌద్ధం, రామణీయకల గురించి రవీంద్రనాథ్ చర్చించారు.
బౌద్ధంపై వివిధ దేశాలలో ప్రచురితమైన రచనలు తెప్పించేవారు. ఆంజనేయరెడ్డి వంటి వారితో విషయం చర్చించేవారు.మానవవాద నాయకులు శిబ్ నారాయణ్ రే, ఎ.బి.షా. వి.ఎం. తార్కుండే వంటి వారు వచ్చినప్పుడు వీరిని కలసి చర్చించడం రవీంద్రనాథ్ చేసిన ఉత్తమ కార్యక్రమం.నార్ల వెంకటేశ్వరరావు బాగా సన్నిహితులైన తరువాత తరచు రవీంద్రనాథ్ నార్ల యింటికి వెళ్ళడం, నార్ల అప్పుడప్పుడూ జ్యోతి ప్రెస్ కు రావడం కద్దు. వారి మధ్య అనేక చర్చలు జరిగేవి.మానవవాద ఉద్యమంలో కాకలుతీరిన అబ్బూరి రామకృష్ణారావుతో సైలింగ్ క్లబ్ లో ఆనవాయితీగా చర్యలు జరపడం, పాల్గొన్న నాకు ఎంతో ముచ్చట వేసేది.ఫ్రెంచ్, జర్మన్ సినిమాలు హైదరాబాద్ లో జర్మన్ మాక్స్ ముల్లర్ భవన్ లో, అలయన్స్ ఫ్రాన్సస్ లో సారధీ స్టూడియోస్ లో ప్రదర్శించేవారు. వాటికి కలసి వెళ్ళేవాళ్ళం.సి. నరసింహారావు రాసిన వ్యక్తిత్వ వికాసం నచ్చగా, అందులో కొన్ని భాగాలు మిసిమిలో ప్రచురించారు.ఆధునిక తాత్వికులపై నా వ్యాసాలు చాలా వచ్చాయి మిసిమిలో. భాషాపరంగా ఏ సందేహం వచ్చినా బూదరాజు రాధాకృష్ణ ఆయనకు నిఘంటువు వలె అక్కరకు వచ్చేవాడు.మిసిమి కోసం కాకున్నా, యించుమించు రోజూ రాత్రి భోజన సమావేశం గాంధీనగర్ లోని రవీంద్రనాథ్ అద్దెయింట్లో జరిగేది. అందులో నేను విధిగా పాల్గొనేవాడిని. ఇక మిగిలిన వారు వారి వీలునుబట్టి చేరేవారు. అలా వచ్చిన వారిలో సి.నారాయణరెడ్డి, సంజీవదేవ్, డాక్టర్ వెంకటేశ్వరరావు (తెనాలి) ఎ.బి.షా, శిబ్ నారాయణ్ రే, మొదలైనవారున్నారు. మిసిమి కోసం కాకున్నా, మధ్యలో మిసిమి ప్రస్తావన వచ్చేది. కుటుంబంలోని వారిలో అడపదడప దేవ్, వెంకట్ తొంగి చూసేవారు. కళాజ్యోతి ముద్దుగా వుండేది.గదిలోకి వస్తూనే యింకో అంకుల్ ఏరి అని అడిగేది. శేషగిరిరావు, నేను, రవీంద్రనాథ్ ఎప్పుడూ కలసి తిరగడం వలన త్రి మస్కటీర్స్ అనే పేరు వచ్చింది! మొత్తం మీద ఆ చిన్న సమావేశాలు మిసిమికి బ్రయిన్ ట్రస్ట్ వలె వుండేవి.మిసిమి పత్రిక ప్రశంసలకు పాత్రమైంది. ఈనాడు మొదలుకొని తెలుగు దినపత్రికలు, హిందూ దినపత్రిక మిసిమిని గుణాత్మకంగా మెచ్చుకోవడం గమనార్హం.రవీంద్రనాథ్ తాను రాయిస్ట్ అని, హ్యూమనిస్ట్ అనీ ముద్రవేసుకోలేదు. కాని ఎం.ఎన్.రాయ్ మానవవాద వుద్యమంలో సాంస్కృతిక జీవనం ముఖ్యమైనది. రవీంద్రనాథ్ తెనాలి పత్రికల నుండీ మిసిమి వరకూ మానవవాద సంస్కృతితో నడిపారు. అంతర్లీనంగా మానవవాద సంస్కృతిని ప్రతిబింబింపజేసిన ఘనత రవీంద్రనాథ్ గారిది. వారు నడిపిన పత్రికలలో అది స్పష్టం. ఆలపాటి రవీంద్రనాథ్ పత్రికా జర్నలిజంలో ప్రామాణిక ఒరవడి ఏర్పరచారు. అది చరిత్ర. అది మనం అట్టిపెట్టుకొని రవీంద్రనాథ్ చూపిన చక్కని బాటను ఆదర్శంగా తీసుకోవాలి. —నరిసెట్టి ఇన్నయ్య