జైలు నుండి తత్త్వవేత్తగా ఆవిర్భవించిన ఎమ్.ఎన్.రాయ్
ఐదున్నర సంవత్సరాల జైలు జీవితం గడిపిన ఎమ్.ఎన్.రాయ్ ఒకవైపున సాధారణ ఖైదీగా బాధలు పడుతూనే మూడు ప్రాంతాలలో బదిలీ అయి ఒక పిల్లిని కూడా పెంచి విచిత్ర జీవితం గడిపాడు. అయితే జైలు జీవితం అత్యంత విలువైనదిగా ప్రయోజనాత్మకంగా మార్చటం ఎమ్.ఎన్.రాయ్ విశిష్టత. జైలునుండే అనేక ఉత్తరాలు తనకు కాబోయే భార్య ఎలెన్ ద్వారా వివిధ సైంటిస్టులకు పంపగలిగాడు. తాను రాస్తున్న పుస్తకానికి వారి నుండి వచ్చే సమాధానాలు ఎంతో ఉపయోగపడతాయని భావించాడు. సమకాలీన సైంటిస్ట్ ల రచనలు తెప్పించుకోగలిగాడు. ఇదంతా అత్యంత ప్రయాసతోకూడిన కార్యక్రమమైనా ఆయన పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రకృతి, జీవనం, చరిత్ర గురించిన వైజ్ఞానిక దృక్పథం తను రాయబోయే పుస్తకానికి శీర్షిక ఎంచుకున్నాడు. ఎడింగ్టన్, జీన్స్, రూథర్ ఫర్డ్, ఫికరింగ్ రచనలు కావాలని తెప్పించుకోగలిగాడు. జె.బి.ఎస్.హాల్డేన్, జూలియన్ హక్సలీ, సమకాలీన రచనలు కూడా సమకూర్చుకున్నాడు. తను రాసే లోతైన తాత్విక, శాస్త్రీయ పరిశీలనకు గాను రాయ్ డబ్ల్యు సెల్లర్స్, ఐన్ స్టయిన్, హైజన్ బర్గ్, నిల్ బోర్, డిబ్రాలీ, వైట్ హెడ్, బెట్రాండ్ రస్సెల్, ష్రోడింగర్, డిరాక్ వంటి సైంటిస్ట్ ల సమకాలీన రచనలు తెప్పించుకుని పరిశీలించాడు. సాపేక్షతా సిద్ధాంతం, క్వాంటమ్ సిద్ధాంతం బాగా లోతుగా పరిశీలించాడు. అమెరికన్ ఫిజికల్ సొసైటీ వారి రెవ్యూ తెప్పించుకుని ఐన్ స్టయిన్ సాపేక్షతా సిద్ధాంతాలను గమనిస్తూ పోయాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రపు తాత్విక ఫలితాలను సమగ్రంగా పరిశీలించటమే రాయ్ ధ్యేయం. ఇది కేవలం మార్క్సిస్ట్ దృక్పథంతోకాక అత్యంత ఆధునిక వైజ్ఞానిక పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని రాయటం ప్రారంభించాడు. అయితే మార్క్సిస్ట్ ధోరణుల నుండి క్రమేణా బయటపడుతూ నిస్పక్షపాత శాస్త్రీయ ధోరణిని అవలంబించాడన్నమాట.
ఆధునిక భౌతిక శాస్త్రం ఎలా సాగిపోతున్నది, జీవిత గమనంలో మార్మిక దశలు అధిగమించి నిజానిజాలు బయటపెడుతున్న తీరు విజ్ఞాన సంబంధమైన విషయాలలో సైన్స్ ఎమి చెబుతున్నది… ఆధునిక భౌతిక శాస్త్రం పరిశోధిస్తున్న తీరు రాయ్ గమనిస్తూ పోయాడు. కార్యకారణ సంబంధాలను ఎంతో లోతుగా సైన్సు ఆధారంగా అధ్యయనం చేశారు. ప్రతిదానికీ కారణం వుండాలని అనుకుంటే అదేంటో పరిశీలించటం సైన్సు నిత్యనూతనంగా చేస్తున్న పని. ఇలా ప్రతి దానికీ కారణం వుండాలని అంటేనే ప్రకృతికి కారణం దైవం అని మత శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అంతవరకు బాగానే వుంది. అంటే కార్యకారణ సంబంధాలు ఒప్పుకుని పయనించారన్నమాట. అయనప్పుడు ప్రకృతికి కారణం ఏమిటి అంటే దైవం అన్నారు. నమ్మకస్థులకు అది తృప్తిగానే వుంది. రాయ్ దీనిని ప్రస్తావిస్తూ కార్యకారణ సంబంధం ఒప్పుకుంటే దైవానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. నమ్మకస్థులు అంతటితో ఆగిపోయారు. సైంటిస్టులు ఆగిపోలేరు కదా! ఈ విషయమై ఎమ్.ఎన్.రాయ్ లోతుపాతులతో చర్చచేశారు. దైవం సర్వజ్ఞం అయితే ఆ లక్షణమే ప్రకృతికి ఎందుకు వుండకూడదు అని రాయ్ అడిగాడు. దానికి మతస్థులు సమాధానం చెప్పలేదు. మొత్తం మీద నిరంతరం సాగే ఈ సైంటిఫిక్ చర్చ రాయ్ జైలు నుండి పరిశీలించటం గమనార్హం.
జైలులో రాసిన ఐదువేల పేజీల శాస్త్రీయ పరిశీలనలు ఇంకా అచ్చుకావలసి వున్నది. కొన్ని రచనలు మాత్రం చిన్నపుస్తకాలుగా వెలువరించారు. అందులో మెటీరియలిజం, సైన్స్ అండ్ ఫిలాసఫీ పేర్కొనదగినది.
ఎ.బి.షా ఈ రచనలు చదివి ఆధునిక పరిశోధనల తిరోగమనం దృష్ట్యా ఇందులో మార్పులు చేర్పులు చేయవలసి వున్నదన్నారు. నా కోరికపై రాయ్ రచనలు నాకు పంపించారు. అందులో చాలా ఆశ్చర్యకరమైన పురోగతి వున్నది. వాటిని ఎడిట్ చెయ్యటం, ప్రచురించటం, ఆధునిక శాస్త్రాల దృష్ట్యా సరిదిద్దటం పెద్దపని. అదింకా జరగవలసి వున్నది. కానీ జైలులో వుండి చక్కటి మార్గాన్ని చూపిన రాయ్ విశిష్ఠకృషి చేశారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ పరిశోధనాలయంలో రాయ్ రచనలు వుంచారు. భవిష్యత్తులో ఈ కృషిని ఎవరైనా చేపట్టవలసి వున్నది. జైలు జీవితం దుర్భరంగా వున్నా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రాయ్ కృషి అభినందనీయం. ఉత్తరోత్తరా రాయ్ రచనల నుండి కొన్ని వ్యాసాలు ప్రామాణిక పత్రికలలో వెలువడ్డాయి. రాడికల్ హ్యూమనిస్ట్, క్వెస్ట్ పత్రికలు ఇందుకు పేర్కొనదగినవి. సైన్స్ అండ్ ఫిలాసఫీ అనే పుస్తకం రాయ్ ఏ ధోరణిలో పరిశోధన చేశాడో తెలియపరుస్తుంది.
ఎమ్.ఎన్.రాయ్ వినూత్నమైన కొత్త విషయాలు చెబుతూ వైజ్ఞానిక దృక్పథంలో అనుసరించవలసిన రీతులు పేర్కొన్నాడు. సైంటిస్టులు సాధారణంగా ఒక్కొక్క పరిధిలో నైపుణ్యాన్ని సంపాదించి ప్రపంచానికి వెలుగునిస్తారు. ఒకరు ఫిజిక్స్ లో నిష్ణాతులైతే మరొకరు బయాలజీలో ప్రపంచానికి కొత్తవిషయాలు చెబుతారు. ఇంకొకరు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందేరీతిలో ప్రజోపయోగకరంగా కొత్త సంగతులు బయటపెడతారు. ఈవిధంగా వివిధ విషయాలు వేటికవే గొప్ప సత్యాలను వెలిబుచ్చుతాయి. అయితే ఒక రంగంలో ఉన్నత స్థాయికి పోయిన సైంటిస్టు మిగిలిన విషయాలలో సాధారణ వ్యక్తికంటే తక్కువ స్థాయిలోనే వుండచ్చు. కనుక వారిలో మూఢనమ్మకాలు రావటానికి అది ఒక కారణం అవుతున్నది. ఉదాహరణకు గురుత్వాకర్షణ గురించి చెప్పిన న్యూటన్ మిగిలిన రంగాలలో బొత్తిగా ప్రవేశం లేక సాధారణ మానవుడికంటే అధ్వాన్నంగా నమ్మకాలు పెంపొందించుకున్నాడు. ఎడిసన్ వంటివారు వందలాది పేటెంట్ హక్కులు సంపాదించగా మరికొన్ని రంగాలలో అత్యంత హీనమైన చాదస్తాలకు పోయారు. ఈ లోపం చాలామంది సైంటిస్టులలో ఉన్నది. ఇది పరిష్కరించాలంటే వివిధ శాస్త్ర విభాగాలలో అత్యంత అధునాతనంగా జరుగుతున్న విషయాల సారాంశాలు స్థూలంగా తెలుసుకోవటం అవసరం. అందుకే శాస్త్రాల ఫలితాల సమన్వయం క్రోడీకరించి చెప్పాలి. అప్పుడు నిపుణుడు తన పరిధిలోనే కాక ఇతర రంగాలలో నిత్యనూతనంగా ఎలా పురోగమిస్తున్నదో తెెలుసుకుంటారు. దీనినే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటారు. రాయ్ ఆధునిక విజ్ఞానశాస్త్రాల తాత్విక ఫలితాలని రాశాడు. ఈ ధోరణి అపూర్వం. ఇది అనుసరిస్తే శాస్త్రజ్ఞులలో మూఢనమ్మకాలు తగ్గుతాయి.
జైలులో ఐదువేల పేజీలు రాసిన ఎమ్.ఎన్.రాయ్ ఈ సిద్ధాంతాలను చాలా వివరంగా పేర్కొన్నాడు. తనకు అందుబాటులో వున్నంతవరకు విషయ చర్చ చేశాడు. జైలు నుండి బయటికి వచ్చిన తరువాత రాజకీయరంగంలో నిర్విరామంగా నిమగ్నుడై జైలు కృషిని కొనసాగించలేకపోయాడు. అమృతలాల్ భిక్కు షా ఈ విషయం కొంతవరకు పట్టించుకున్నా ఆయన కూడా త్వరగానే చనిపోవటం వల్ల ఆ బృహత్తర ప్రయత్నం కొనసాగలేదు. విదేశాలలో రాయ్ చెప్పిన మార్గంలో ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ముందుకు సాగిపోతూ వుంది. ఇండియాలో రాయ్ రచన పరిష్కరించి ప్రచురించాల్సిన బాధ్యత సైంటిఫిక్ సంస్థ ఏదైనా చేపట్టి పూర్తి చేయాలి.
####################
రాడికల్ డెమోక్రటిక్ పార్టీ రద్దు – ఉద్యమానికి దారితీసిన తీరు
పిట్టకొంచెం కూత ఘనం అనే సామెత మానవేంద్రనాథ్ రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి చక్కగా వర్తిస్తుంది. 1940 డిసెంబరులో పుట్టిన పార్టీ అఖిలభారత స్థాయిలో 8 ఏళ్ళ పాటు సిద్ధాంత బలంగల పార్టీగా కూతపెట్టింది. రాయ్ చెప్పిన మాటలు, చేసిన పనులు, అనుచరులు సాగించిన ఉద్యమం అనేక విధాల పరోక్ష ప్రభావాన్ని చూపింది.
1940 డిసెంబరులో రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణంలో పార్టీ తలెత్తింది. హిట్లర్ కు అనుకూలంగా శుభాస్ చంద్రబోస్ విదేశాల నుండి ప్రచారం చేస్తుండగా దేశంలో ఆయనకు సానుభూతి గాలులు బాగా వీచాయి. మరొకవైపు గాంధీ బ్రిటీషు వారిని వెళ్ళిపొమ్మంటూ నినాదాలివ్వటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రపంచ పరిస్థితులను గ్రహించిన వ్యక్తిగా రాయ్ కొన్ని హెచ్చరికలు చేసినా ఉద్రిక్త జాతీయ భావాలతో ఉర్రూతలూగుతున్న దేశం రాయ్ హేతువాదాన్ని పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యానికి ఫాసిజానికి జరిగే యుద్ధమని, ఇందులో ఫాసిజం ఓడిపోతుందని బ్రిటీషువారు దేశాన్ని వదిలి వెళ్ళిపోతారని కనుక హిట్లర్ ను సమర్థించటం భారతదేశానికే ముప్పని రాయ్ చెప్పాడు. అది ఎవరికీ నచ్చలేదు. రాయ్ పెట్టిన పార్టీ మైనార్టీ పార్టీగానే ఎనిమిదేళ్ళు కొనసాగింది. యుద్ధంలో బ్రిటీషు వారిని సమర్థించడం అవసరమని ఎమ్.ఎన్.రాయ్ అంబేద్కర్ లు గట్టిగా వాదించారు. ఆ తరువాత వారి వాదనే నిజమని రుజువైనప్పటికీ ఉద్రేక వాతావరణంలో లోతుపాతుల్ని గ్రహించలేకపోయారు. మరొకవైపు గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా అనే నినాదం ఆవేశం పురికొల్పింది. ఎమ్.ఎన్.రాయ్ పార్టీపై అన్ని పక్షాల వారూ దాడి చేశారు. అయినప్పటికీ సిద్ధాంత బలంతో కొద్దిమంది మేథావులు ఆలోచనాపరుల తోడ్పాటుతో పార్టీ కొనసాగింది.
దేశానికి యుద్ధానంతరం స్వాతంత్ర్యం తప్పనిసరిగా వస్తుందని ఈలోగా నమూనా రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలని ఎలాంటి ఆర్థిక ప్రణాళిక కావాలో తేల్చుకోవాలని రాయ్ చెప్పాడు. కేవలం చెప్పటమే కాక ముసాయిదా రాజ్యాంగాన్ని రాసి అనుచరులంతా దేశంలో చర్చకు పెట్టారు. అదే విధంగా ఆర్థిక ప్రణాళిక కూడా రాసి ప్రజలముందుంచారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కన్నుతెరిచి బిర్లా అర్థిక ప్రణాళికను విడుదల చేసింది.
సిద్ధాంత రీత్యా ప్రజలలోకి పోవటానికి వీలుగా రాయ్ పార్టీ వివిధ స్థాయిలలో పత్రికలు స్థాపించింది. ఇండిపెండెంట్ ఇండియా అనే పత్రికను రాడికల్ హ్యూమనిస్టుగా మార్చారు. సిద్ధాంత బలం గల వ్యాసాలతో ‘మార్క్సిస్ట్ వే’ అనే పత్రిక మొదలుపెట్టి దానిని ‘హ్యూమనిస్టు వే’ గా మార్చారు. యూనివర్సిటీల నుండి, పాఠశాలల నుండి, కోర్టుల నుండి ప్లీడర్లు ఉపాధ్యాయులు పార్టీకి మద్దతుగా నిలిచారు. స్థానికంగానూ, దేశవ్యాప్తంగానూ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. అందువలన మంచి సాహిత్యం వెలువడింది. కమ్యూనిస్టుల ధాటికి తట్టుకుని సిద్ధాతం ప్రచారం చేయగలిగాడు.
ఇవన్నీ జరిగినప్పటికీ ప్రజాబాహుళ్యంలోకి పార్టీ వెళ్ళలేకపోయింది. ఉద్రిక్త వాతావరణం వలన మైనారిటీ పార్టీగానే మిగిలిపోయింది. అనేక సమస్యలపైన చిన్న పుస్తకాలు వెలువరించి చర్చలకు పరిష్కారాలకు పార్టీ తోడ్పడింది. ఆవిధంగా ప్రతికూల వాతావరణంలో కొనసాగుతూనే పరిమిత ఎన్నికలలో పాల్గొని 1946లో తీవ్ర ఓటమికి గురయ్యారు. పార్టీని కొనసాగించటం దుర్లభమని తేలిపోయింది. పార్టీ మనస్తత్వంగల కొందరు పట్టుదలతో కొనసాగించాలని ప్రయత్నించినా అది కుదరలేదు. చివరకు 1948లో పార్టీని రద్దు చేసుకున్నారు. పార్టీపట్ల ఎలాంటి త్యాగాలు చెయ్యటానికైనా సిద్ధపడిన వ్యక్తులు అంతటితో నిరుత్సాహ పడి రాజకీయాలకు దూరమయ్యారు. కొద్దిమంది ఇతర పార్టీలలో చేరారు. కానీ అధికసంఖ్యాకులు రాయ్ నాయకత్వాన ఉద్యమం సాగించాలని పట్టుదలతో ఉన్నారు. అప్పుడే రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమం ఆవిర్భవించింది. దీనికి ముందే రాడికల్ డెమోక్రటిక్ పార్టీ సిద్ధాంతపరంగా కూలంకషంగా చర్చించి ఆమోదించిన విషయాలను ఉద్యమం చేపట్టగలిగింది. 22 సిద్ధాంతాలు గల ఈ సూత్రాలు చాలా వైజ్ఞానికమైన రీతిలో సాగాయి. వీటిని విడమరిచి గ్రంథస్తం చేశారు. న్యూ వోరియంటేషన్ అనే గ్రంథాన్ని చర్చల సారాంశంగా వెలువరించారు. రాజకీయ పాఠశాలలో జరిగిన చర్చాంశాలను సైంటిఫిక్ పాలిటిక్స్ అనేపేరిట గ్రంథస్థం చేశారు. ఇవన్నీ ఉత్తరోత్తరా ఉద్యమానికి తోడ్పడ్డాయి. 22 సూత్రాలుగల సిద్ధాంతాన్ని రాజకీయ శిక్షణా తరగతులలో చర్చించి నిగ్గు తేల్చారు. ఆ విధంగా దేశంలో కొత్త సిద్ధాంతపరమైన ఉద్యమం మొదలైంది. ఒక రాజకీయ పార్టీని ఉద్యమంగా మార్చటం చారిత్రక ఘటన అనవచ్చు. పార్టీపట్ల కరడుగట్టిన వాతావరణంలో పెరిగినవారికి పార్టీని రద్దు చేయటం ఏమాత్రం నచ్చలేదు.
నవ్యమానవవాద సూత్రాలు 1946లోనే పార్టీ ఆమోదించటంతో ఉద్యమానికి సానుకూలత ఏర్పడింది. ఫిలిప్ స్ప్రాట్ (1902 –1971) బ్రిటన్ నుండి వచ్చిన కమ్యూనిస్టు మేథావి. అతడు రాయ్ సహచరుడుగా పార్టీలో కీలక పాత్ర వహించాడు. కానీ పార్టీని రద్దు చెయ్యటం ఇష్టపడక వ్యతిరేకించాడు. అలాంటివారు కొద్దిమంది ఉన్నప్పటికీ మేథావులలో అధిక సంఖ్యాకులు ఉద్యమానికి అనుకూలించారు. డెహ్రాడూన్ లో ఉద్యమ కేంద్రంగా రాయ్ దంపతుల నాయకత్వాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 8 ఏళ్ళ పార్టీ ఆవిధంగా ఉద్యమంగా తలెత్తి చిగురించింది.