Business

ఒక్క బండి కూడా అమ్మలేని TVS

TVS Faces Horrible COVID19 Lock Down Sales

గత నెలలో ఇతర వాహన కంపెనీల మాదిరి టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా సంస్థలు కూడా ఒక్క వాహనాన్నీ విక్రయించలేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉండటమే ఇందుకు కారణం. ‘కరోనా వైరస్‌తో ప్రభుత్వం, ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు ఒక బాధ్యతాయుత కార్పొరేట్‌ సంస్థగా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామ’ని టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మార్చి 23 నుంచి తమ ప్లాంట్లను మూసివేశామని, ఏప్రిల్‌లో దేశీయ విపణిలో ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదని పేర్కొంది. చెన్నై పోర్ట్‌ ట్రస్ట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మార్చి వాహన నిల్వల నుంచి 8,134 ద్విచక్ర వాహనాలు, 1,506 త్రిచక్ర వాహనాలను ఎగుమతి చేశామని వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం.. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధమవుతోందని పేర్కొంది. అదే సమయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక వ్యక్తిగత వాహన విభాగంలో గిరాకీ పుంజుకుంటుందనే ఆశాభావాన్ని టీవీఎస్‌ వ్యక్తం చేసింది. మరోవైపు మార్చిలో దేశీయంగా ఒక్క వాహనాన్ని విక్రయించనప్పటికీ, 2,630 ద్విచక్రవాహనాలను ఎగుమతి చేశామని హోండా మోటర్‌సైకిల్‌ వెల్లడించింది.